13, అక్టోబర్ 2009, మంగళవారం

దీపావళి అందరికి చిన్నతనాన్ని గుర్తు తెస్తుంది. అలా కాని వాళ్ళెవరో చెప్పండి?
అప్పుడు వున్న ఉత్సాహం ఆనందం ఇప్పుడు కావాలంటే రాదు. మన పిల్లల్ని చూసి మన చిన్నతనాన్ని గుర్తుచేసుకోవాలి
విరుసిన ఆనంద దీపావళి, కురిసిన అనురాగ దీపాలివి......... అని రేడియో లో సుశీల పాట వింటూ ఆ పండుగ జరుపుకోవటం ఇపుడు ఒక జ్ఞాపకం మాత్రమే అయిపొయింది.
మా తాతయ్య దీపావళి రాత్రి పెద్ద ఇత్తడి పళ్ళెం లో తెచ్చిన దీవాలి టపాకాయలు పోసి, ఒక్కొక్కళ్ళని పిలిచి మతాబులు, చిచుబుడ్లు, భూచక్రాలు, తాళ్ళు, టపాకాయలు పంచేవాడు. ఎవరికి వాళ్ళు ఒక్కో ప్లేస్ లో సెటిల్ అయ్యే వాళ్ళం. మొదలెట్టా మన్నప్పుడే మొదలెట్టాలి, లేకపోతే కేకలేసేవాడు. ఒకళ్ళ తరవాత ఒకళ్ళు వెళ్లి రోడ్డు మీద భూచక్రాలు, చిచుబుడ్లు పెట్టి కాల్చి వచ్చే వాళ్ళం. అప్పట్లో తాడు బాంబులు, లక్ష్మి బాంబులు అంటే నాకు చచ్చే భయం. కాల్చే సమస్యే లేదు. అద్రుష్టం కొద్ది ఇప్పటి వరకు దీపావళి రోజు చేతులు కాల్చుకోలేదు. అంతా  అయిపోయాక, చేతులు కడుక్కొని తొక్కుడు లడ్డులు తినటం ... ఆ రుచే వేరు. రుచులందు తొక్కుడు లడ్డు రుచులు వేరయా అని......
ఈ సారి దీపావళి కే నెనూ ఒక చిన్న ఇల్లు కొన్నాను, అక్కడ చేసుకోవాలని అనుకున్నాను కానీ, ఇంక మరమ్మతులు వున్నాయి. వచ్చే దీపావళి స్వంత ఇంట్లో చేసుకుంటానని ఆశిస్తాను.
ఇక అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీ అందరు సుఖ సంతోషాలతో రంగురంగుల , శబ్దాల, హరివిల్లుల తో ఈ దీపావళి జరుపుకుంటారని, చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా వుంటారని ఆశిస్తూ ...................................
మీ ఆత్మీయ లక్ష్మణ్ కుమార్ మల్లాది.