30, డిసెంబర్ 2010, గురువారం

అజ్ఞాత కవి

దయచేసి గమనించ గలరు, క్రింద ప్రకటించిన కవితా రచయిత నేను కాదు, మీ స్పందనలు chakri5@yahoo.com కి తెలుపగలరు.
* * *
ఎవరో?
తెలీనప్పుడు కోతివనుకొన్నాను,
అప్పుడే, గుండ్రాయిలా ఉంటె,
నిజమేననుకున్నాను.
ఒకరు పాడుతుంటే, పాటలా కూడా వుంటావా!
నాకు అర్ధం కాలేదు!
అదుగో,
కొండపైన,
నడుంపై చేతులేసుకొని,
నేనే! అని నించుంటే
ఎందుకో, నమ్మబుద్ది కాలా!
పోదురు! ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే,
ఏ దారిన వెళ్ళినా
దీపం పట్టుకు, వెలుగు చూపించటమే!
ఎవరూ? చూద్దామంటే,  ....  చీకటి.
ఎంతదూరమనీ? ఇలా!
వద్దులే! నాకనవసరం
ఎవరున్టేనేం, లేకపోతేనేం ,
అన్నాను!    కానీ,
అన్య భారమేదో, గుండెలపై ఉంచిన బాధ!
నా అమాయకత్వానికి, అసమర్ధతకు,
ఎక్కడో, చీకట్లో
జాలిగా ఏడ్చిన చప్పుడు!
ఇక, ఉన్నచోటునే
ఆగిపోయాను - అబ్బ! యెంత అలసట?
వెను తిరిగి చూసాను!
మార్గమంతా...
నలిగిపోయిన పూవులగుపించాయి!
పాపమేవరిదో అర్ధం కాలేదు!
కానీ, బాధ కలిగింది!
నాకు తెలియదు -
ఎక్కడి సంస్కార విన్నపమో?
పశ్చాత్తాపానికి నాందిగా
కంటి నుండి ఒక బిందువు
ప్రాయశ్చిత్తానికి సమిధగా జారింది!
అది మొదలు, తెర పలచబడింది!
స్థాణువులా నిల్చుండిపోయాను!
నిశాంత చ్చాయలో ఇంద్రధనుస్సు!
కలలో కూడా కనలేదు!
ఎదురుగా, స్థిరంగా, సూటిగా వస్తోంది, దూరంగా!
తెల్లటి వెన్నెల కిరణం!
అంతఃనేత్రం, అప్పుడే తెరుచుకొంది!
నిశ్చలంగా ఉన్నా తంత్రి,
ఫెళ్ళున కదిలిన భ్రాంతి.
వెల్లువలా కోర్కె రగిలితే,
కౌగిలి చాలని కవనం!
మరోసారి కంట నీరుఉబికింది!
ఆర్ద్రంగా, దుఖ్ఖిస్తున్న గుండెపై పన్నీటి జల్లులా
నిశ్సబ్దంగా నవ్వు వినిపించింది!
ఈ సారి వెతకలేదు.
చేయి చాచి, కౌగిలించుకున్నాను!
ఇక ఎవరినీ చూడాలని అనిపించలేదు!
అయినా, అందరూ అవుపిస్తున్నారు!
ఇప్పుడు.... శూన్యం కూడా!!
నేను వింటున్న సంగీతం,
దాహం తీరగా, తీరగా తాగుతున్నాను,
అమృతం లా!
నా ఆనందం చూసి నవ్వుతున్నారు.
కొంచెం పంచి ఇస్తానన్నాను, తరగదన్న ధైర్యంతో
వద్దుట - ఈ పిచ్చి, వారికి వద్దుట.
జాలి కలిగింది.
ఒంటరిగా వదిలివేశారు.
నా వెంట ఉన్న, వారి జాడను గమనించలేదు.
రేపు రాజులుట,
ఈ రోజే రాళ్ళు దాచుకుంటున్నారు!
వెనుతిరిగి చూసి నవ్వాను,
అపారంగా ఉన్న వీళ్ళు ఎరుగని అండను చూసి.

ఈ శూన్యంలో దోబూచులాట తెలిసి-
నిర్యానమదిగాను.
సమాధానం లేదు?
మరోమారు, భాష తెలియదని అనుమానం కలిగింది.
అయినా తెలిసినట్టే అరిచాను.
నవ్వుతుంటే, తన్మయత్వం తో చేష్టలుడిగి చూస్తున్నాను!
ఆలోచిస్తున్నాను!!

అజ్ఞాత కవి

ఈ రోజు మీకు ఒక అజ్ఞాత కవిని పరిచయం చేస్తున్నాను. ఇప్పటివరకు తన కవితలు నాకు తెలిసి చీకటిలోనే ఉండిపోయాయి. అతని అనుమతి లేకుండా నేను మీకు ఇవి అందిస్తున్నాను! అసలు ప్రతి నాదగ్గరే ఉన్నది కనుక నేమో నాకు ఈ ధైర్యం?! "అజ్ఞాత కవి" అన్న శీర్షిక కింద మీరు వాటిని నా పుటలో చూడవచ్చు. మీ స్పందనలు నేరుగా అతనికే తెలియచేయండి....  chakri5@yahoo.com అన్న చిరునామా కి..

దయచేసి గమనించ గలరు. ఈ కవితలు నా సొంత రచన కాదు.

నీవు  రాలేదు !
వేచి వాలిన కనుల
చీకటి అలుముకుంది!
పరువాల కలువ
అలిగి ముడుచుకుంది!
విరిపూల వన్నె
ఎదురుచూపులో వాసి వాడినదేమో?
చెక్కిట జారిన ముత్యం
మునిపంట బిగిసిన పెదవి అదురుకు
ఝాడుసుకుంది
నిట్టూర్పు సెగలు నిండిపోయిన ఎద
సోలిపోయింది!
తను వాలిపోయింది!
రేయి మలుపు చూసుకుంది!
నీవు రాలేదు!!!

రచయిత చక్రి కి ధన్యవాదాలు మరియు క్షమాపణల తో ....

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

28, డిసెంబర్ 2010, మంగళవారం

నా ఉద్యోగ పర్వం లో స్వర్ణ యుగం అంటూ ఏదైనా ఉన్నదంటే అది నేను ఉత్తర ప్రదేశ్ లో గోండా అనబడే ఉరిలో పనిచేసేప్పుడే..  మేమందరం కలిసి 8 కుటుంబాలు తెలుగు  వాళ్ళు  ఉండేవాళ్ళం. అక్కడే స్థిరపడిన రావు గారు వీళ్ళకి అదనం... అదనం అంటే వినోదానికి కూడా అదనం అని. వృత్తి  రీత్యా ఆంగ్ల భాషా బోధకులు అయినప్పటికీ మాతో కలిసి అల్లరి చేస్తూ, మా గోలని భరిస్తూ, సాహిత్య పోషకులు కూడా అయివుండటం వలన నాకు మంచి కాలక్షేపం కలిగించిన అయన. ఆ రోజుల్లో, వారాంతపు రోజుల్లో, శలవ రోజుల్లో, అంతా కలిపి విభిన్నం గా గడిపే వాళ్ళం. చలికాలం అక్కడ గడ్డు కాలం. మన ఆంధ్రా లో వాళ్లకి చలి అంటే చిన్న స్వెట్టర్ వేసుకునే అనుభవమే కాని,మేము వెళ్ళిన మొదటి సంవత్సరం అయితే ఊహించలేని అనుభూతి కలిగింది మాకు ....

ఆ జ్ఞాపకాలతోనే మిత్రుడు నండూరి శివ ప్రసాద్ ఒక చిన్న తవిక కూర్చారు, మా మిత్రుల పేర్లతో కలిపి. కొండొకచో ఆంగ్ల పదాలున్నా, పదాల వరుస కు, ప్రవాహానికి బాగున్నాయని ఉంచేశాను.

ఆ మగధీరులందరూ మీకు తెలియక పోయినా .. ఏదో కాలక్షేపానికి మరి, ఒకసారి పరికించండి..

"ఆలోచనా కడలినుంచి ఆవిర్భవించిన అమృత  కలశం"
మరపురాని గోండా ముచ్చట్లు
- - -
చిన్నారులని స్కూల్  కి పంపించి
చిన్నసైజు మీటింగ్ లో చర్చించి
బాస్ గారి భయంతొ కొందరు   
సుదూరాలను చేరువచేస్తూ కొందరు

బైక్ మీద హడావిడిగా మరికొందరు
సండే  వచ్చినా సాయంత్రం కలసినా
అందరినోట ఆలవోకగా సాగే విష్యం transfer 
అది జరిగాక మనకు మిగిలేవి Rememberences
హాస్యానికి మరోపేరు RP గారు
ఆదరణ కు ఆదిగురువు రావుగారు
రమేశ్ గారి ప్రఙ్నత తన పాజిటివ్  కూర్పు అయితె
దాసుగారి విఙ్నత తన creative  చేర్పు
శంకర్ గారి ప్రత్యేకత straight forwardness
ఠాగూర్ గారి విశిశ్టత Friendliness
Allrounder రెడ్డి  గారు
Always sucessful ఆనంద బాబు గారు  
సరదాగా ఉండే సలహాల రాములన్న
సాహిత్యాభిలాషి మన లచ్ఛన్న
వంటలలో అందె వేసిన చేతులు ఈ ఆడువారందరూ
Multipurpose exposure సంపాదించారు ఈ మగవారందరు
అందరూ అందరే అనుభవఙ్నుల సందడే
బంధాలకు అనుబంధాలకు దూరంగా ఉన్నా
స్నేహ బంధం ఆత్మీయత పంచుకున్నాం
ఆటలతో సరదాగా గడిపేసాం
మరువలేని గోండా జీవితం

                                                                                                        - నండూరి శివ ప్రసాద్
బాగుందాండీ నా ఉద్యోగ పర్వం లో ఈ తవికల వేట. మరొక చిన్న తవిక కూడా ఉన్నది, పంపమని మిత్రునికి చెప్పాను.  అందినాక అదికూడా ప్రకటిస్తాను.  అంతవరకూ సెలవా మరి !!!!!
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

29, నవంబర్ 2010, సోమవారం

'పడమటి సంధ్యా రాగం

ఈ మధ్య మీతో చాలా సార్లు మాట్లాడదామని అనుకున్నాను... ఒక రోజు చిన్ని గళాలు ఆహ్లాదంగా ఆ 'పాత' మధురాలు పాడేప్పుడు (పాడుతా తీయగా లో), ఇంకొక రోజు బాలు గారు 'గాన గాంధర్వ' కార్యక్రమంలో ఆనాటి చక్కర కేళీలు గానం చేస్తున్నప్పుడు, ఓ రోజు రాత్రి రావూరి భరద్వాజ గారి అంతరంగ తరంగాలు 'అంతరంగిణి' చదువుతూ అంతర్ముఖుడి నైనపుడు (దీన్ని గురించి విపులం గా చర్చించాలని ఉంది.. ఈ లోగా వీలయితే ఆయన రచనలు 'ఒకింత వేకువ కోసం', 'నాలో నేను' లాంటి వి చదవండి ), కన్యాశుల్కం నాటిక ను ఆస్వాదిస్తున్నపుడు ....

మొన్నొక రోజు  'పడమటి సంధ్యా రాగం' విని/చూసి... .......................      ..............

గుమ్మలూరి గారి అభిరుచికి జంధ్యాల వారి చమత్క్రుచి (చమత్కార రుచి) తోడై, మంచి కాఫీ లాంటి, యెర్ర గా వర్రగా ఉన్న ఆవకాయ ముద్దలా..  ఎన్ని సార్లు ఆ చిత్రం చూసినా ప్రతిసారీ కొత్త ఆవకాయ రుచిలా. . . కమ్మగా..

జంధ్యాల గారి మాటల చమత్కారం ఒక ఎత్తైతే బాలు గారి సంగీతం వీనుల విందుగా ...      హాయిగా..

పిబరే రామ రసం...  (మన సదా శివ బ్రహ్మేన్డ్రుల కృతి) తెలిసిన రాగంలో నైనా మధ్య మధ్య లో పలకరించే వాయులీన రాగాలతో, ధ్వని తంత్రుల (పియానో) తరంగాలతో మరింత వినసొంపుగా వినిపించింది.  ఖండాంతరాలకు వెళ్లి తమకు తెలియకుండా 'తమను' కోల్పోయే తెలుగు వాడి దీన స్థితి  ...ఆ దీనత్వానికి అలవాటు  పడలేని ఆ పెద్దాయన పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది.  శ్రీరామ నవమిని గుర్తు చేసుకోలేని ఆ పెద్దాయన  "అదే  ఆ  రోజుల్లో అయితే  ..." అని  గుర్తు  చేసుకునే  సందర్భం  నా  పాత పుటల్లో  ని  జ్ఞాపకాలను  తట్టి  లేపింది. 

తిట్ల పురాణం, దండకం బాగా వంట పట్టించుకున్న జంధ్యాల మార్కు హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర చిత్రణ, వాచకం (గాత్ర ధారణ వేరే వారిది అనుకుంట) బాగా కుదిరాయి.  వర్షం లో గొడుగేసుకుని పచ్చిక తడుపుతూ వుండటం, ఇంట్లో వాళ్ళు తాళాలేసుకుని బయటకెడితే అయన తాళం పోగొట్టుకుని వచ్చి బయట దినపత్రిక నెత్తిన కప్పుకుని గుడ్లు మిటకరించుకుని కూర్చోటం, ఆరు బయట (అమెరికా లో) వొళ్ళంతా నూనె పూసుకుని హంగామా చేయటం... ఇంకా చాలా సందర్భాలలో...   మళ్ళీ, హిమక్రీముల దుకాణం యజమాని ని బాగున్నారా అంటే  "కు లాసే... (అంటే కుమారుని వలన లాసు)" అని వ్యంగ్యం గా చెప్పటం, పైగా కొడుకు ని వివిధ రకాల రాక్షసుల పేర్లతో పిలవటం .....       చాలా సందర్భాలలో సంభాషణలు బాగా నవ్విస్తాయి.


ఇక్కడ చూడండి:
....

విదేశాల నేపధ్యం లో జరిగే కథలతో వచ్చిన తెలుగు చిత్రాలలో ఇంత సహజం  గా, ఆద్యంతం చూడదగ్గ సినిమాలలో ఇది ఒకటి అని ఒప్పుకోక తప్పదు.

మీరు చూసారా?  మళ్ళీ మళ్ళీ చూడండి.   
  
హాస్యం ఆరోగ్య/ఆనంద దాయిని. హాయి గా నవ్వుకుని మనసుని తాజా గా ఉంచుకోండి.
మరి ఉంటాను...

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

11, జులై 2010, ఆదివారం

కుక్క కట్టేసి ఉంటుందంటారా!!!

అంటూ మెట్లు దిగుతున్న శివ ప్రసాద్  ఒక్కసారి కొయ్యబారిపోయాడు.  ముందు నడుస్తున్న రాధాకృష్ణ, వెనక మెట్ల మలుపు తిరుగుతున్నా నాదీ  అదే పరిస్థితి. ఎదురుగా సింహం లాంటి అల్సేషియన్ వరండా లోంచి బయటకు వస్తూ మమ్మల్ని చూసేసింది.


తెలుగుతనానికి దూరంగా ఉద్యోగరీత్యా ఉత్తర భారత ప్రదేశ్ లో హిందీ బతుకు బతుకుతున్న మాకు అపుడపుడూ కలిసి కాలక్షేపం చేయటం ఒక సరదా.  రాధాకృష్ణ కు బదిలీ అవటం తో వాళ్ళని కలవటానికి  వచ్చి  కబుర్లలో పడి రాత్రి 11 గంటలు అవటం గమనించలేదు.  ఆ సమయానికి ఇంటివాళ్ళు సదరు సింహాన్ని కట్టేయకుండా వదిలేస్తారని కూడా మర్చిపోయం.


ముందు రాధాకృష్ణ ఉండటం మా అదృష్టమయింది.  మెడ మీద వాటా లోకి అద్దెకు ఉంటున్న ఆయన్ని కొద్దిగా గుర్తు పట్టి, నాలుకతో పరామర్శించే ప్రయత్నంలో పడింది. శివప్రసాద్ ఏమనుకుంటున్నాడో గాని, నాకు కాళ్ళు వణుకుతున్నాయి.  ఎక్కడైనా ష్.... మంటే పారిపోయే గ్రామా సింహాలు, వెనక వస్తుంటేనే భయపడి, మాటిమాటికీ వెనక్కు చూసే నాకు ఈ పరిస్థితి 'సింహ' స్వప్నమే .  పైన మెట్ల తలుపులు బిడాయించి భానుగారు, వాణి  గారు, మాయావిడ భయం గా చూస్తున్నారు. గభాల్న పైకి ఉడాయించుదా మన్న ఆలోచన వచ్చినా ' అది ఎపుడైనా వేగంగా వస్తుంటే కరిచేస్తున్దేమూ అనిపిస్తుంది' అని వాణి గారన్న మాటలు గుర్తొచ్చి ఆలోచన అదిమి కదలకుండా నిల్చుండిపోయాను.  మధ్యలో ఉన్న శివ పరిస్థితి బేరీజు వేసుకుంటూ హుస్సైన్సాగర్ బుద్ధ విగ్రహం లా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు.  పరామర్శలు అందుకుంటున్న రాధాకృష్ణ కూడా భయపడుతుండటం స్పష్టం గా కనపడుతోంది.  విశాలంగా ఉన్న వరండా లోంచి ఇంటాయనను   పిలుద్దామన్నా వాళ్లకి వినిపించేలా  లేదు.  ఎవరికీ ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు.  మా భయాల్లో మేముండగా, సింహం పరామర్శ లాపి , మా వంక అనుమానంగా చూసి, ఠీవిగా రెండు మెట్లెక్కింది. శివ ఇంకా రెండు మెట్ల దూరంలోనే ఉండటంతో, భాను గారిలో గాభరా మొదలయ్యింది.  రాధాకృష్ణ రెండడుగులు ముందుకు వేసే ప్రయత్నం గమనించి, మొదట్లో ఆయనపై ఉన్న అభిప్రాయం చెరిపేసుకుని, వెనక్కి తగ్గి ఆయన్ను చేరి అనుమానించటం మొదలెట్టింది సింహం.  కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు శివ. నిమరాలని ఎత్తిన చెయ్యి నాకుతుంటే, లోపల భయంగా ఉన్నా, చిన్నప్పట్నుంచీ దాన్ని తన గుండెల మీద పెంచిన రకం ఆనందాన్ని ముఖంలో చూపిస్తూ, ఓ వెర్రి నవ్వు నవ్వి, దానికి అనుమానం పెరగకుండా, ముఖద్వారం వైపు జరగసాగాడు రాధాకృష్ణ.


దొరికిన అవకాశం చేజార్చుకోవద్దన్న గిరీశాన్ని గుర్తు తెచ్చుకుని, వెంటనే వాడేసుకున్నాను. చప్పుడు కాకుండా చప్పున పైకొచ్చిపడి మళ్ళీ తలుపులు బిగించాను.  ఆ సందడికో, రాధాకృష్ణ ఆనందానికి తృప్తి చెందో  ఏమో, ఆయన్ను విడిచి మళ్ళీ శివ దగ్గరకు వచ్చి నాలిక చాచింది సింహం.  అంతా నిశ్శబ్దం గా ఉంది. వీధి దీపం కాంతి  సన్నగా శివ ముఖంపై అయన భయాన్ని ప్రతిఫలిమ్పచేస్తోంది.  "ఏమండీ..." అంటూ భయంగా చెయ్యి ఎత్తి నాకోసం వెనక తడిమాడు.  "ఆ ఎత్తిన చెయ్యి మెల్లగా దాని వీపుపై వేసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చెయ్యండి"  నా గొంతు దూరంగా మేడ  మీంచి విన్పించటం తో, నేను చేసిన మిత్ర ద్రోహానికి గతుక్కుమన్నాడు.  వెంటనే ఆత్మరక్షణ ఉపాయం ఆలోచిస్తూ, "పాన్డేజీ..." అంటూ ఇంటాయాన్ని స్మరించాడు. మొదట్లో నూతినుంచి వచ్చినట్లున్నా అయన అరుపులు మెల్లగా స్టీరియో పానిక్ రూపాన్ని పొందాయి.


ఈలోగా ఈ హడావిడికి, రాధాకృష్ణ పిలుపులకి ఇంటాయన కరుణించి వచ్చి, దాని గొలుసు పట్టుకుని దూరంగా తీసుకుపోయే ప్రయత్నం లో పడ్డాడు. ఆడాల్లిద్దరూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా పడుకుని ఈ హడావిడికి  లేచి, ఇదంతా వినోదంగా చూస్తున్న శివ వాళ్ళబ్బాయి కౌశిక్ "భలే మజా వచ్చింది" అని గొల్లుమన్నాడు.

తెరిపినపడ్డ ప్రాణాలతో మేమంతా ఏడవలేక ఆ నవ్వులతో శృతి కలిపాం.


..... ఒక 5 సంవత్సరాల క్రితం మేము గొండా అనే తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగిన సరదా సంఘటన ఇది. మేమంతా మళ్ళీ కలుసుకున్న ప్రతీసారీ గుర్తు చేసుకుని నవ్వుకుంటాము. ఆ సంఘటనకి యధా రూపమే ఇది,  మీకోసం సరదాగా........................ చదివి ఆనందించారు కదూ !!!
మీ
మల్లాది లక్ష్మణ కుమార్.

7, జులై 2010, బుధవారం

సంగీతం పరమౌషధం!!!

ఈ మధ్య మా టీవీ లో వచ్చే సంగీత సంబరాలు చూస్తున్నారా! క్రితం వారం జరిగిన పోటీలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడేసారు. విష్యం ఏమిటంటే, దానిలో  ఒక  గాయని  పడిన  రాగం లోని  పాట.



 "రాగం" అని మన తెలుగులో వచ్చిన చిత్రం(చలన) ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. "తాయే యశోద" పాట ఎంతమంది విన్నారు? పోనీ ఇప్పుడైనా చేతులు ఎత్తండి!!



సంగీతం మానవ జాతికి యెంత అవసరమో, "శిశుర్వేత్తి  పశుర్వేత్తి ..." అని ఎందుకన్నారో, అన్ని బాధలు, అలజడులు సంగీతం తో ఎలా నయమవుతాయో, అసలు సంగీతం తో వైద్యం చెయ్యగలరా............       ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఈ పాట. (మహా మహా గొప్ప విద్వాంసులు/పాటలు మనకి చాలా వున్నాయి. ఏదో ఈ పాట గురించి అనుకుంటున్నాం కదా అని ఈ వ్యాఖ్య, గమనించగలరు).  ఆలాపన  తో మొదలైన  పాట గాయని  గొంతుతో  పాటు  రాగాలు  తీసే  వాయులీనం, పాశ్చాత్య  రాగాల /వాద్యాల  మిశ్రమం (fusion) మననీ  ఏదో  లోకాలలోకి  తీసుకుపోయి , విహరిమ్పచేసి అలరిస్తుంది.



ఒకప్పుడు "పాడుతా తీయగా" అన్న బాలు గారి కార్యక్రమం కోసం  మధ్య మధ్య లో  అయన చెప్పే  పాటల తెర వెనుక కధలు గురించి,  ఆ పాటల గురించి అయన వ్యాఖ్యానం, అయన చెప్పే తేట తెలుగు పద్యాల గురించి...... ఇలా చాలా వాటి గురించి చకోర పక్షుల్లాగా ఎదురు చూసే వాళ్ళం.  తెలుగు పాట ఎన్ని రకాలు గా పురుడు పోసుకుందో, ఎన్ని వయ్యారాలు పోయిందో, ఎన్ని రంగుల కళలు కందో, గాయకులు ఆ కార్యక్రమం లో పాడే పాత.. ఆపాత మధురాలు విని పులకించిపోయే వాళ్ళం. ప్రస్తుతం బహుళ ప్రచారం కోసం ఈ మధ్య వచ్చే సంకర పాటలు (పాతకులు/పాటకులు/పాఠకులు క్షమించాలి! లెస్స పలికితివి వత్సా! అని అనే వాళ్ళుంటే  ... ధన్యవాదాలు) అంటే అనీ కాదు, ఈ రోజుల్లో కూడా మంచి పాటలు వస్తున్నై. కాదని అనడంల్లేదు, కానీ ప్రేక్షకుల మనోరంజనం  కోసం చేసే చోట మంచి పాటలు పాడాలి. ఒక రోజు పాల్గొన్న గాయకుడు కూడా ఈ రకమైన బాధ వెలిబుచ్చారు. అయన ఒక మంచి పాత పాట పాడగా, న్యాయ నిర్ణేత అడిగారు, అందరూ ప్రస్తుత కాలం పాటలు పాడగా నువ్వు ఇలా చేసావేమిటి అని. దాని కోసం టీవీ వారిని ప్రాధేయపడి పాడాను అని చెప్పాడు కూడా.
ఇన్ని ఇలా జరుగుతుండగా, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుడు శ్రీ కీరవాణి (పేరులో తెలుగుతనం చూసారా) తనకు నచ్చిన పాటలు పాడితేనే వస్తాను అని షరతు తో వచ్చానని చెప్పారు. ఇంతకీ ఆ పాటలు ఏమిటో తెలుసా.. అలనాటి మల్లేశ్వరి లోని 'ఎందుకే నీకింత తొందర ..' , మరొక ఎప్పుడు వినని ఆణిముత్యం లాంటి పాట, ఆయనకి మన పాత మూలాలు మీద పట్టు వుండటం తోనే, తన పాటలు అంత శ్రావ్యం గా ఉంటాయి. కులుకుల కీరవాణి అని నేను సేకరించి పదిలపరచిన అయన పాటల గుచ్చానికి పేరు పెట్టుకున్నాను.



మరి ఏవీ ఆ పాత మధురాలు. ఏవీ ఆ మధుర మధురోహల సొబగులు. వింత దరువుల, వింత గొంతుకల, వింత విన్యాసాల పాటలు ఈ గాయకులూ పాడటం, వహ సెహబాస్ అని ఇతరులు పొగడటం, ఆకాశానికి ఎత్తే యటం .. నాకు మాత్రం నచ్చలేదు. మీరు ఎమనుకోపోతే ఈ మధ్య వచ్చిన రెహమాన్ రేహమేనియా కూడా అంత వినసోమ్పోగా లేదు. (మణిరత్నం మాయాజాలం మరుగైనట్లుగా..)



దయచేసి మన పురాతన నిధి ని పదిలంగా ఉంచండి, పదిమందికీ వినిపిమ్పచేయండి, ఆహ్లాదం కలిగించేలా అనుభవించండి, ఆ అనుభూతిని రోజంతా పదిలపరుచుకోండి.



మీ
మల్లాది లక్ష్మణ కుమార్

2, మే 2010, ఆదివారం

వెన్నెల రాత్రి, వెండి మబ్బులూను...

"వెన్నెల రాత్రి" అని చాలా రోజుల క్రితం మొదలెట్టాను ఈ టపాని. ఈ రోజు వెన్నెల రాత్రులు కాదు, చంద్రవంక మాత్రమె ఉంది.
నెల వంక, చంద్ర వంక అని కవితావేశులు ఎందుకని అన్నారో కాని, మన అచ్చ తెలుగు మాటలు, తేనెల మూటలు అన్న మాట నిఝామ్ అనిపిస్తుంది. ఆ వంక ఈ వంక చూడకుండా 'అర' విరిసిన వెన్నెల రాత్రులలో నెలవంక దర్శనం పైట తో సగం కప్పి ఉంచిన  మురిపించే ముద్దరాలి ముద్దు మోము ను  చూస్తున్నట్లనిపిస్తుంది. మల్లె తీగ పూల నుంచి వచ్చే సుగంధం, దొడ్లో చెట్ల క్రీనీడలు, సన్న గాలికి ఊగే కొమ్మల సవ్వడి, కొబ్బరి చెట్ల ఆకుల మధ్య నుంచి తొంగి చూసే మన ఈ నెలవంక, ప్రియురాలి/ శ్రీమతి తో కబుర్లు సల్లాపాలు     ఆహా ...  ఈ జీవితం లో ఇవన్ని  మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులు, ఊహలు.  ఈ ప్రకృతి అంతా ఇప్పుడు ఊహించుకోవాలె గాని, అనుభవించలేము. ఎక్కడో పల్లెటూళ్ళలో తప్పితే. ఇక నిండు చంద్రుని రాక  తో ప్రకృతి పరవశించి అందం ద్విగుణీకృతం చేసుకుంటుంది. వెన్నెల రాత్రి, వెండి మబ్బులూ విజయా వారి మాయాబజార్ లోని "లాహిరి లాహిరి..." పాట లో యెంత అందం గా మలిచారు. పుచ్చ పువ్వు పూసినట్లు గా వెన్నెల పరుచుకొని  వుంది  అన్న పోలిక మధురం, నిజం.
ఈ ఆహ్లాదకరమైన వెన్నెల ను అనుభవించండి, వంటికి పూసుకొని చల్లని అనుభూతిని పొందండి.
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

22, ఏప్రిల్ 2010, గురువారం

పేరు లోనే ఉన్నది పెన్నిధి ....

నిన్న (అంటే ఈ టపా  మొదలెట్టే సమయానికి.. పదిహేడవ తారీకు) మా శ్రీకాంత్ పుట్టిన రోజు, నేను కూడా ఒక ఆఫీసు పని వలన హైదరాబాద్ లోనే ఉన్నాను. వాడు మా పెద్ద వాడు. రెండో పిల్లాడి పేరు శ్రీవంశి. ఈ పేర్లు పెట్టటం అన్న తంతు  ఒక్కొక్క సమయాల్లో చాలా విసుకు అనిపిస్తుంది అంటే నేను చూసిన కొన్ని సందర్భాలలో. మా పుట్టింటివారి తరఫు పేరు పెట్టాలని తల్లి, కాదని తండ్రి, మధ్యలో తాతలు, తాతమ్మలు, మావగారు, అత్తగారి సలహాలు, సూచనలు, అప్పుడప్పుడు కొంత ధాటిగా విసుర్లు, అలకలు ఆ పేరు ని చిరిగి చాటంత చేస్తాయి. అప్పుడు ఆ పేరు పెట్టుకున్న వాడు పెరిగి పెద్దయ్యాక ఈ తోకల్ని తలుచుకుని తలుచుకుని ఈ పేరు ఏమిటిరా బాబు హనుమంతుని తోక లాగా అని అమెరికా వెళ్ళిన తెలుగు వాడి లాగా ఆ పేరుని కుదించి మధించి కత్తిరించి అర్థం పర్థం  లేని కొత్త అవతారం ఎత్తుతాడు. ఇంతకీ మా అబ్బాయి పేరు పెట్టటం లో అంత ప్రతిఘటనలేమి ఎదురు కాలేదు. మా మామ్మ మటుకు గునిసింది, శ్రీ రాముని పేరు కావాలని.  నాకేమో శ్రీకాంత్ అన్న పేరు బాగా నచ్చింది. చివరికి ఆవిడే రాజీ పడి ఏదైనా ఆ మహా విష్ణువు అవతరలేగా అని తృప్తి పడింది. 
పేరులో ఏముంది!!  అని నాటకాలు, కవితలు మన తెలుగు వారు గుప్పించిన..  పేరుకున్న గొప్పదనం పెట్టుకున్న వాడికి గాని తెలియదు. ఒక్కొక్క సారి విచిత్రమైన ఎప్పుడు వినని పేర్లు కూడా వినిపిస్తుంటాయి.   మీక్కూడా ఈ రకం గా పేర్ల భాగవతం గాని ఉన్నట్లయితే నాకు తెలుయచేయండి, పంచుకోండి...
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

"మిథున"మైన బాపు రమణీయం...

బాపు రమణ ల గారి గురించి ఎంత చెప్పినా తరగదు ! మన తెలుగు సినిమా చరిత్ర లో రకమైన మహానుభావులు చాల మంది ఉన్నారని మీకు తెలుసు కదా. ఉదాహరణకి, విశ్వనాధ్, వంశి, బాపు, సిరివెన్నెల,ఘంటసాల, సుశీల, బాలు, జానకి,............ అలాఆఆఆఆఆఅ
ఇంతకీ నేనేం చెప్పోచ్చాను చెప్మా?? శ్రీరమణ గారి కథలు "మిధునం" చదివారా మీరు? పాత్రోచిత సంభాషణలు, పాత్రాభినయం (ఇలా ఎందుకన్నానంటే ప్రతి పాత్ర అభినయం తో సహా మనకి కనిపిస్తుంది) మలిచిన తీరు .... వహ్వా రే వహ్వా...
మొదటి కధ అరటి పువ్వుల వడల గురించి.. .  స్వామీజీ వాటి గురించి చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తారు ! వడల తయారీ తో నిబిడిఉన్న అంతర్లీన తాత్వికత ని హాస్యోక్తం గా చెప్పటం తోపాటు, ఏ దేముడి దగ్గర ఆ భజన చేసినట్టుగా సందర్బోచితం గా ఆ వర్ణనలని మార్చుకుంటూ వస్తారు.  చివరగా వేచిఉన్న భక్తురాలు ఆ ధోరణి కి మురిసిపోయి  "మీ పాదాల చెంత చోటిస్తే మీ జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తూ, అరటి పువ్వుల వడలను వండిపెదతాను"  అనిపించటంలో చమత్కారం కాలానుగుణం గా అనిపిస్తుంది.
వరహాల బావి, ధన లక్ష్మి కధ, మినిస్టర్ గారి అమ్మాయి పెళ్లి ఇత్యాదులన్నీ మత సామరస్యానికీ, సమకాలీన పరిస్తితుల గురించి కోమట్ల వ్యాపార శైలి ని హాస్యోక్తం గా తెలియచేస్తాయి.  బంగారు మురుగు కధ నేనెప్పుడూ చెప్పే బ్రాహ్మణ వ్యావహారిక శైలి సంభాషణలతో నవ్వు తెప్పిస్తాయి. మనవడ్నేసుకుని బామ్మ గారు కధ నడిపే తీరు ... చదవాలే గాని చెప్పనలవి కాదు. వాడికి పున్జీల కొద్దీ జీళ్ళు, పీచ్మిటాయి లూ (కంచు గంటను అమ్మేసి మరీ) కొనిపెట్టటం, బాదాం చెట్టు తొర్ర లో తినుబండారాల బ్యాంకు పెట్టటం, ...   "నాకు అరేల్లప్పుడు మా బామ్మ కి అరవై ఏళ్ళు. మా నాన్న అమ్మ ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు దేవుళ్ళు  గొడవల్లో వుండేవాళ్ళు. స్వాములార్లు, పీటధిపతులు  - ఎత్తే పల్లకి దించే పల్లకి తో మా ఇల్లు మఠం లా ఉండేది.అమ్మ తడి చీర కట్టుకుని పీటాల్ని సేవిస్తూ - నీ దగ్గరికి వెడితే తాకకోడదు అనేది."" ఇలా మొదలవుతుంది కధ.
అసలు బామ్మ గారి కాన్సెప్ట్ "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయ కంటే పాపం లేదు.చెట్టుకి చెంబెడు నీళ్ళు పొయ్యటం, పక్షి కి గుప్పెడు గింజలు వెయ్యటం, పశువు కి నాలుగు పరకలు వెయ్యటం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టటం - నాకు తెలిసిన్దివే..."  మహా గొప్ప గా ఉంది కదూ.
మీరు ఈ లంకె లోకి వెల్లి పూర్తి కధ చదవండి, సరళమైన ప్రక్రియతో ఆ లంకె లో సభ్యత్వం పొందచ్చు.
http://www.scribd.com/doc/7430162/Bangaru-Murugu-Part1
మిగిలిన కధ గురించి తరువాత రాస్తాను.
మీ లక్ష్మణ్ కుమార్ మల్లాది
(చెప్పుకోటాని మనకు చాలా చాలా గొప్ప కథకులు ఉన్నారు, నేను చదివినవి - శ్రీపాద, మల్లాది రామకృష్ణ శాస్త్రి, తిలక్, చాసో, మధురాంతకం, రమణ, వంశి, యుండమూరి, భానుమతి అత్తగారి కథలు, భమిడిపాటి, ఇలా చాలా ఉన్నాయ్. గుర్తుకొచ్చిన కొద్ది వాటిని మీకు వీలు చూసుకొని పరిచయం చేస్తాను, మీకు తెలియదని కాదు!!  ఏదో నా చాదస్తం గొద్ది... ఎందుకంటె నేను ఒకసారి చదివి వాటిని వదిలిపెట్టను!! తెలుగు మట్టి వాసన మరచి పోయినపుడల్లా మళ్ళీ మళ్ళీ వాటిని అనుభవిస్తూ అస్వాదిస్తూంటాను. అందుకని మిగిలిన గొప్ప రచయితల గురించి ప్రస్తావిన్చాదేంటి అని అనుకోకండి, సరేనా  )

8, ఏప్రిల్ 2010, గురువారం

ఇళయరాజా

ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునే చాల చాల మంది లో నేను ఒకడ్ని . అంటే నా చెవులు ఇప్పటికే తెగిపోయి ఉండాలి అని అనమోకండి. చెన్నై వచ్చాక సంగీత దాహం చాల మటుకు తీరింది. ప్రతి రోజు ఆఫీసు నుంచి రాగానే ఎఫ్ ఎం లో ప్రతి ఛానల్ లో రాత్రి తొమ్మిది గంటల నుంచి సంగీత ప్రవాహం మొదలవుతుంది. దాదాపు అన్ని అలవరసలలోను నిరంతర గానామృతం ప్రవహిస్తూంటుంది. మన తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా తమిళ భాషలో చాలా చాలా విబ్భిన్న తరహాలలో సంగీతం రచించారు ఇళయరాజా. ఇక్కడ నాకు బాగా నచ్చిన కొన్ని పాటల లంకెలు ఇస్తున్నాను. ఇవి విని రాజా గారికి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పండి  ... ఎందుకంటే సంగీతం పరమౌషధం! భాషా బేధం లేనిది సంగీతం.

౧. నిలావే వా...(మౌన రాగం చిత్రం లోనిది)    http://www.tamilwest.com/tamilsongs/inter/Mouna%20Raagam/ 
౨. ఎన్వానిలే ఒరే వెన్నిలా... , కాట్రిల్ ఎన్ధాన్ గీదం    http://www.tamilwest.com/tamilsongs/inter/johnny/
౩. పురువమే పుదియ పాడ పాడల్... (ఇది మన తెలుగులో కూడా వున్నది, పరువమా చిలిపి పరుగు తీయకు అని )
౪. నాన్ పాడుం మౌన రాగం ....   http://www.tamilwest.com/tamilsongs/inter/IdhayaKoyil/
౫. పెన్మానే సంగీతం పాడి వా ....  
                           http://www.tamilwest.com/tamilsongs/inter/Naan%20Sigappu%20Manithan/
౬. పూవే సెం పూవే ...  
                            http://www.tamilwest.com/tamilsongs/inter/Solla%20Thudikkuthu%20Manasu/
౭. రాసావే ఉన్నైనంబి (ఇది జానకి పాడిన పాత, ఎంత మధురంగా ఒక రకమైన యాస తో ఉంటుందో వినండి)
             http://www.tamilwest.com/tamilsongs/inter/Mudhal%20Mariyathai/
ఇవి కాక నా దగ్గర చాలా పాటలు సేకరించి ఉంచాను. పైన ఇవన్ని లంకెలతో ఎందుకు ఇచ్చానంటే మీరు వెంటనే అంతర్జాలం నుంచి పొందటానికి. చ్చాదస్తం అనుకోకండి, ఈ పాటలు వినండి.  మరిక ఉంటాను.  

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

4, ఏప్రిల్ 2010, ఆదివారం

పొలిమేర దాటేల్లిపోయింది

నేను క్రితం రాసిన "ఆ రోజుల్లో..." కి కొనసాగింపుగా ......

ఈ మధ్య వంశి (సిన్మా వంశి) మహాద్భుతం గా రాసి చూపించిన (కళ్ళకు కట్టినట్టుగా) "మా పసలపూడి కథలు" చదివారా! అక్కడక్కడ శృంగార మరకలు కనిపించినా, చాలా కథలలో మనసును కరిగించునట్టి, కదిలించే ఇతివృత్తాలు తో వంశి చాలా గొప్ప సృష్టి చేసాడు. దానిలో ఒక కధలో చెప్తాడు (పొలిమేర దాటేల్లిపోయింది.. పుస్తకం లో చిట్టచివరి కథ)

"కాలవగట్టు దగ్గరాగిన బస్సులోంచి దిగిన చిన శంకరం ట్రంకు పెట్టి పట్టుకుని దిగువలో ఉన్న ఊళ్ళోకి నడక మొదలెట్టాడు.
రధం ముగ్గులు, మల్లెపందిరి ముగ్గులు, ఏనుగు పాదం ముగ్గులు ఒకటేంటి రకరకాల ముగ్గులు ఒంచిన నడుం ఎత్తకండా నడవడానికి పిసరంత సందు లేకండా ముగ్గులేసేస్తున్నారు ఆడపిల్లలు.   చిన్నచిన్న సందులన్ని కల తిరిగిన హరిదాసు బ్రహ్మయ్యగారి వీధిలో కొచ్చేసరికి చిన్న పిల్లలంతా కల్సి దండకట్టేసారు. రెడ్ల ఇళ్ళకి పెరుగులకి పాలకి వెళ్తున్న చిన్న కులాల పిల్లలు గోపాలస్వామి గుడి గోడ పక్కన రాలిన పారిజాతం పూలు ఎరుకుంటున్నారు ....
అవుపెడతో అలికి ముగ్గులు పెట్టిన అరుగులు, పసుపు రాసి బొట్లేట్టిన గడపలు మామిడాకుల తోరణాలు కట్టిన ద్వార బంధాలు, సంప్రదాయంతో కళకళలాడుతుంది వూరు.  కళ్ళు కడుక్కోడానికి పాలేరుతో ఇత్తడి గంగాలంచెంబు పెట్టించింది వాళ్ళ చిన్నక్క. చిలక్కోయ్యకి తగిలించున్న గల్ల తువ్వాఅలందించాడు బావ.....
గోర్మిట్టీలు, బెల్లంపూతరేకులు, పాలపూరీలు, పాకుండలు రకరకాల పిండి వంటలు, దబ్బకాయ పులిహార,ఆవపెట్టిన అరిటి పువ్వు కూర, పనస పొట్టు కూర , కంది పచ్చడి , అత్తగారలా కూరేస్తుంటే ఎక్కిసం అయిపోయినా మొత్తానికెలాగో లాగించి పందిరిపట్టి మంచం ఎక్కి పడుకున్న మనిషి తిరిగి లేచేసరికి చీకటై పోయింది ....
వెడల్పాటి ఆ గోదావరి కాలవలో గూటి పదవ నెమ్మదిగా వెళ్తుంటే కాలవకి ఎడాపెడా పచ్చటి వేప చెట్లు, మామిడిచెట్లు, గానుగ చెట్లు , నిద్రగన్నేరు చెట్లు, ఏ పక్కకి చూసినా పచ్చదనం.  దూరంగా ఎక్కడో పొలాల్లో తాటాకు గుడిసలు వాటి కొప్పుల్లోంచి వస్తున్న పొగ, గులగుర్త  రేవు దగ్గర కొత్త బట్టలు కట్టుకున్న నలుగురు ఆడపిల్లలు మొన్నే వండిన కొత్త బెల్లంతో చేసిన పరమాన్నం, బూరలు, ఇత్తడి గిన్నెల్లో పెట్టుకుని వాటి మీద అరిటాకు ముక్కలు కప్పుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

అందమైన అనాటి జీవితాన్ని అందమైన కాలవ కింద పల్లెటూళ్ళ ని  వాటి మధ్యలో మరీ అందమైన పసలపూడి గ్రామాన్ని చెక్కుచెదరని సంప్రదాయాల్ని, కట్టుబాట్లని, వాళ్ళ అమాయకత్వాన్ని మానవ  సంబంధాల్నీ నెమరేసుకుంటూ చాలా ఏళ్ళ తర్వాత ఊళ్ళోకి దిగాను.
"చుదీదార్లూ మిడీలు వేసుకున్న ఇద్దరు పిల్లలు కేనతిక్ హోండా వెనకాలేక్కి మాముందు నిన్చేల్లేరు. గోపాలస్వామి గుళ్ళో పూజారిగారి కోడలు నైటీ వేసుకుని నారింజకాయల సైకిలోడితో బెరమాడుతూ ఈలోగా తేగల కట్ల  తట్ట మనిషేల్తుంటే తానని పిలుస్తోంది స్టైలుగా....
ఊళ్ళో ఏ పక్కకు  చూసినా కేనేతిక్ హొండలు, స్పెండర్లు కనపడ్తున్నాయి.నడుస్తున్న మా పక్కనించి ఒక ఇండికాకారు స్పీడుగా వెళ్ళిపోతే క్వాలిస్ దానికి ఎదురొచ్చింది.  సంతపేట లో ఒకప్పుడు ధాన్యం మిల్లున్దేచోటు ఇప్పుడు ఖాళీగా ఎత్తుగా పచ్చగడ్డి మొలిచి వుంది. మాసిన పంజాబీ  డ్రేస్స్ వేసుకున్న ఒక పిల్ల రెండు గేదెల్ని అక్కడ మేపుతావుంది.  గొల్లలతూము దగ్గర ఎవరో పాతిల్లు పడగొట్టి మోడరన్ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆవేళ గృహప్రవేశం అనుకుంటాను, వరసగా టేబుళ్లు వేసి వున్నాయి. కూర్చుని భోంచేస్తున్న జనాల ముందుకి అన్నం గిన్నెతో వచ్చిన కుర్రాడు "కొంచెం వైట్ రైస్ వడ్డిన్చమంటారా?" అంటున్నాడు.
ఇవ్వేళ రాజేశ్వరస్వామి తీర్థం గుర్తుందా? అన్నాడు త్యాగరాజు.
రధం లాగుతూ ఉంటారీపాటికి  పదండి అనేసి కదిలాను.
దారు శిల్పాలతో నిన్దిపొయిఉన్న మా రాజేశ్వరస్వామి  రధానికి ముందు ఎడాపెడా నాలుగు అంగుళాల కైవారంతో పొడుగ్గా ఉండే ఆ రెండు పెద్దాపురం తాళ్లనీ చెరి వందేసి మందీ లాగేవారు వెనకటికి.  లాగడానికి సంబరపడే చాలా మంది కుర్రోళ్ళు తాడు లేక మిగిలిపోయేవారు. అల్లాంటిది...
ఇవ్వేళ మా దేవుడి రధం రెండు తాల్లనీ వందలమంది జనాలు లాగడానికి బదులుగా,  ఎర్రరంగు మహేంద్ర ట్రాక్టర్ లాగుతుంది.

నేనెప్పుడూ ఏడవలేడుగానీ, ఆ దృశ్యం చూస్తున్నపుడు మట్టుకి నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజలా రాలిపోయినియ్యి."




యెంత చక్కగా పిందేసాడండీ గుండెల్ని.  ఈ కథలలో బాపుగారి బొమ్మలన్నీ సందర్భోచితంగా ఉన్నాయి , అసలు కధ చదువుతుంటే ఆ బొమ్మ చూస్తుంటే సారాంశం అంతా  మన కళ్ళకు కట్టేస్తుంది. అంత గొప్ప అవిడియాలు ఎలా తడతాయో ఆయనకి?  మీరు మట్టుకు ఈ పుస్తాకాన్ని  వదలకుండా చదవండి.  కనీసం తెలుగు బతుకు బతక లేక  పోయినా అచ్చ తెలుగు గ్రామాలు, సంబంధాలు, ప్రకృతి ఎలా వుంటుందో చదివి ఆనందించండి.
ఆయ్... మరిక దిగాడతానండి
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

ఆ రోజులే వేరు!!

ఆ రోజులే వేరు!!
మనం ఎప్పుడు వాడే మాట ఇది. ఒక ఉరు నుంచి వేరొక వూరు వెళ్ళినా, ఉద్యోగం మారినా, లేదా మన వయస్సు మారినా, పాత సంగతులు గుర్తుకొచ్చినపుడు మనం అంటుంటాం, "అబ్బ నువ్వేన్నైన చెప్పరా కానీ,  ఆ రోజులే వేరు".
దానికి నేనేమీ మినహాయింపు కాదు. చిన్నతనం లో మనం చేసిన అల్లరి, బాధ్యతలు లేని జీవితం ఎవరికి బాగుండదు చెప్పండి. వేసవి కాలం సెలవలు వచ్చిందంటే సూర్య కిరణాలు లేపుతుంటే లేవటం, (అంటే ఆలస్యం గా) ఎడ పెడా తిరిగేయ్యటం, సాయంత్రం పక్కింటి అబ్బాయి బుడ్డిబాబు, రాము, మా అన్నయ్య వాళ్ళతో గోలికాయలు ఆడటం, పోద్దస్తమాను రేడియో వినటం, ఇన్ని వ్యాపకాలు ఒక్కసారిగా మీద పడి పోతాయి. ఎండలు మండేవి అనుకోండి, కాని ఆయనెవరో చెప్పినట్టు, "మావిడి పళ్ళు, మల్లె పువ్వులు కావాలి గాని, మండుటెండలు అక్కరలేదా అని" ... ఆ రోజులే వేరు.
ఉదయం రేడియో లో మల్లిక్ గారి రాజ రాజేశ్వరి స్తోత్రం తో సుప్రభాతం అవటం మనం ఈ రోజుల్లో ఊహిన్చలెము .  మల్లాది సూరిబాబు గారి లింగాష్టకం, బాల మురళి రామదాసు కీర్తనలు, మధురాష్టకం, సుప్రభాతం, దేవి స్తుతి, సత్యదేవుని పాటలు, ఇలా చెప్పుకుంటూ పొతే మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం అనిపిస్తుంది. ముఖ్యం గా వాయులీనపు నేపద్యం లో మల్లిక్ గారి మంద్ర స్వరం లో ఆ స్తోత్రం పోద్దుపోద్దున్నే మనసుని ప్రశాంతం గా చేసేది. (ఇది ముఖ్యం గా విజయవాడ స్టేషన్ వినేవాల్లకే).
ఇప్పుడు కూడా ఆ పాత మధురాల్ని ఆలిండియ రేడియో వాళ్ళు తమ archieves దుకాణం లో అమ్మకానికి పెట్టారట. వీలయితే కొనుక్కుని, ఆ మధురాల్ని అచ్చంగా ఉన్చేసుకోండి.  నా మటుకు నాకు నా బాల్యం అంటే గత స్మృతులన్నీ సున్నాలు చుట్టుకుంటూ ఆ నేపధ్య సంగీతం తో కనివినిపిస్తాయి. ఇక శ్రావణ  మాసం లో (మా) బందరు, వర్షం లో పొద్దస్తమానం స్నానం చేస్తూనే ఉండేది. చల్లటి ఆ వాతావరణం, బురద బురద (కొండొకచో నీరు నిండిన) రహదారులు, ఆ వర్షం లో తడుస్తూ ఊరంతా తిరగడం, పేరంటాళ్ళు, పట్టు చీరల రెపరెపలు, తాంబూలాలు, శనగలు  సెనగల మసాల గారెలు,  ఇంకా ఇంకా చాలా ... నాకు నచ్చిన నా పాత జ్ఞాపకాలు.

1, ఏప్రిల్ 2010, గురువారం

పాత జ్ఞాపకం.

మా బ్యాంకు సంవత్సరీకాలు మూలంగా (అపార్థం చేసుకోకండి, నా ఉద్దేశ్యం annual closing ) మీతో మనసు విప్పి మాట్లాడలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. పొతే, ఈ సోది పుస్తకం మొదటి పుటలో మీకొక అమాయకమైన ప్రాణి చిత్రం కనపడుతూ ఉంది ఉంటుంది, కొత్తగా.  అది, .......... నేనే.  దాని పూర్తి వివరం ఆ లంకె లోకి వెడితే కనిపిస్తుంది,
మరి చూస్తారు కదూ...
మీ లక్ష్మణ కుమార్ మల్లాది.

29, మార్చి 2010, సోమవారం

మా చక్రవర్తి స్పందనలు మీ కోసం

క్రితం కబుర్లలో రాసినట్లు మా శ్రీరామ చంద్ర చక్రవర్తి సమయానుకూలంగా తెలియచేసే స్పందనలను మీకందరికీ పంచాలని అనుకుంటున్నాను, ఇక చిత్తగించండి !!!
""మందార మకరంద మాధుర్యమునదేలు  మధుపమ్ము ఓవునే మదనములకూ !
నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచ చనునే తరంగిణులకు !
లలితా రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుతజములకూ !
పూర్ణేందు చంద్రికా స్ఫ్హురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నీహారములకు !
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము 
ఏ రీతి ఇతరమ్ము జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ?!!  

శ్రీమన్నారాయణుని  పట్ల భక్తి ఎంత ప్రియమైనదో  !! తెలుగు లో మాత్రమే  ఆ అనుభూతి ని అంతే హృద్యంగా  పొందగలమని   పోతన వారి పద్యమే చెపుతుంది !! అంత తీయనైన తెలుగులో స్వీయ భావాలు, అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు పంచుకోవటం విశేష ప్రయత్నమే !! ఈ అంతర్జాల వీధి సోది  సుమాలలో మా లక్ష్మణుడి బంతిపూలు విలక్షణంగా విరబూస్తూ ఉంటాయని ఆశిస్తున్నాను !!  క్రొత్త పూత కోసం చూస్తూవుంటాను""

మీ అందరికీ మా నిత్య శుభాకాంక్షలు !!

24, మార్చి 2010, బుధవారం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం
జగత్ప్రసిద్ది ఐన శ్రీ సీత రామ కళ్యాణం ఎన్నో శతాబ్దాలు/సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్న ఆనందకరమైన పండుగ. మన భద్రాద్రి లో జరిగే కళ్యాణం నిజం గా సీతారాములను అక్కడ ఆహ్వానించి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి, పవిత్రత అక్కడ ప్రత్యక్షం గా చూస్తున్నా, రేడియో లో వింటున్న, తలచుకున్న చాలా ప్రత్యేకం గా నాకు అనిపిస్తుంది. (ఇది చాల సంవత్సరాల క్రితం మాట) ఆ రోజుల్లో ఉషశ్రీ గారి వ్యాఖ్యానం తో సాగే కళ్యాణ ప్రసార కార్యక్రమం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, చెణుకులు, తళుకు బెళుకులు కళ్ళకు కట్టినట్టుగా అయన వివరిస్తుంటే ఆ కళ్యాణం మన చేతులతో చేస్తున్నట్టుగా అనిపించేది. తరువాత మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి కాలం లో కూడా చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. ఇంట్లో పూజ త్వరగా ముగించుకొని అది వినటం కోసం మా తాతయ్య తో సహా వేచివుందేవాళ్ళం.  ఈ రోజుల్లో ఎవరు వ్యాఖ్యానం చెపుతున్నారో తెలియదు  ...., అవి వినటానికి కూడా ఇప్పటి వారికి తీరిక లేదు.  రేడియో పూర్తిగా మరుగున పడిపోయింది.
సరిగ్గా కళ్యాణం అయిపోవచ్చే సమయానికి మా బందరు లో ఇంటి దగ్గర వున్నా సాయి మావయ్య (ఇప్పటి దత్త ఆశ్రమం ఎదురుగా) వాళ్ళ రామాలయం లో పానకం కోసం పరిగెత్తే వాళ్ళం. ఈ పండుగ ప్రత్యెక ప్రసాదం అదేగా.
రామనాయుదిపేట కూడలిలో వినాయక చవితి, శ్రీరామనవమి పండగలకి పందిళ్ళు వేసి (తాటాకు తో, కొత్త ఆకుల వాసన బాగుండేది) ప్రతిరోజూ రాత్రికి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. చవితికి కోట సచితానంద శాస్త్రి హరికధలు, శ్రీరామనవమికి నాటకాలు, ప్రొజెక్టర్ తో సినిమాలు తప్పకుండ చూసేవాళ్ళం.
శ్రీరామా నామాలు, కీర్తనలు, కావ్యాలు, పాటలు మన తెలుగు జాతికి తరగని సంపదలు.
వాటిని మనకు అందించిన వాల్మీకి, త్యాగయ్య, రామదాసు ఇత్యాదులు, గానం చేసిన దాసులు, గాయకులూ ధన్యులు. రామ నామ జపమే తన జీవన పరమావధి గా గడిపిన పవన పుత్రా హనుమాన్ కు నా నమస్సులు.
 మీకందరకూ శ్రీరామా కళ్యాణ శుభమాహోత్సవాన ఇవే నా శుభాకాంక్షలు.
శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి, బహు తీపి... అన్న పాట వింటూవుంటే ఆ రామచంద్రుని పై ఉన్న భక్తీ, ఆదరం, గౌరవం రెట్టింపు అవుతుంది. సకల గుణాభిరాముడు, ధర్మార్ధకామములందు విచక్షణ తో ప్రవర్తించి మానవాళికి ఆదర్శ ప్రయుడై నిలచిన ఆ పట్టాభి రామునికి నమస్సులతో,
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

మీ లక్ష్మణ కుమార్ మల్లాది. మీ స్పందనలను నా మెయిల్ కు పంపండి, mailto:malladi.lakshman@rediffmail.com

20, మార్చి 2010, శనివారం

ఒక స్నేహితుడి స్పందన

మన తెలుగు భాష అందాలన్నీ దాని వివిధ రకాలైన యాసలలో నిబిడీకృతమై ఉన్నాయ్.  కృష్ణ వాళ్ళది స్వచ్చమైన భాష ఐతే, తెలంగాణా, కర్నూలు, చిత్తూరు (అరవం మిళితమైన), గుంటూరు, నెల్లూరు, గోదావరి, శ్రీకాకుళం (ఒక రకం రాగాలు దీర్ఖాలతో),  హైదరాబాది (ఉర్దూ తో) ఇత్యాదులైన రకరకాల యాసలతో తెలుగు హొయలు పోతోంది. దేని అందం, శ్రావ్యం, సాహిత్యం దానికి ప్రత్యేకం, దాని సొంతం. మా గోదావరి కథలు, (ప్రస్తుతం దిగువ గోదారి కథలు), నెల్లూరు కథలు, అల్లం రాజయ్య రాసిని కథలు, ఇలా వివిధ ప్రాంతాల భాష ఔచిత్యాన్ని మనకి తెలుపుతాయి.
మన ప్రాచీన (పాత) సాహిత్యం లో ఉన్న బ్రాహ్మణ ప్రత్యెక భాష చాలా హృద్యం గా ఉంటుంది.
ఇక విషయానికి వస్తే, నా స్నేహితుడు, గొర్తి శ్రీరామచంద్ర చక్రవర్తి, పంపిన మెయిల్ నుంచి మీకోసం అందిస్తున్న ఒక స్పందన ......

ఓ రెంకా రేవడ్సా ?!! కాదిస్కే !!

పొంతులు గారా !! పండక్కొచారాండీ , అమ్మగారు బాన్నారాండీ ?!!
చాన్నాళ్ళ కొచ్చారు !! ఓ పారొచ్చెల్లండి (మా ఇంటికి ) !!
ఊడ్పులౌతన్నై బాబు, మాపటికొస్తాను నాన్న గారికి సెప్పు !
ఆయ్ ! పెద్ద పాప భీవారవేనండి !!
సంటిదానికి ఈ సంకురేతిరి కి రెండొచ్చే !!
నానున్నాను గందా ?!!
పర్లేదండి నేనట్టుకొస్తాగా ! రేయ్ శీను ఆ పెట్టెత్తుకోరా !!
ఏవన్నా అవుసరవుంటే పిలవండి !
లే సారూ పొద్దుగాల్నే వస్తుంటి, గా కింద సారు కాడ ఆలస్సిమైపోనాది!!
అంతా మంచిగుందా సారు !! ఏడ సారు, దినాం పరేసానే గంద !!
అన్నీ ప్రియమైపాయే !! గీ ఔలగాండ్ల లొల్లి తో పరేసానౌతున్డాది !!
మగ బిడ్డ బాగా సదువుతుండు !! వాన్కి మంచి కొలువు దొర్కాల , ఇంకేం ఫికర్ లే !!
నాతానేడౌతాది సారూ ?! పెయి బాలే కుండే !
వొంకాయిలు , బీరకాయిలు, పొట్లకాయ ఆలుగెడ్డ టమాటాలు పచ్చిరపకాయలూ య
పాలకూర,గోంగూర బచ్చలి కూర కరేపాకు కొత్తిమీరా వ్
తమ్పడికాయిలు,తమ్పడికాయిలు, తమ్పడికాయిలూ వ్
ఆ కాఆపీ కాఆపీ కాఆపీ !!! ఏ టీ ఏ టీ ఏ టీ !!!
ఇడ్డి వడా ఇడ్డి వడా ఇడ్డి వడా ఇడ్డి వడా !!!
ఆ కాఆపీ కాఆపీ కాఆపీ !!! ఏ టీ ఏ టీ ఏ టీ !!!
డైవర్ బాబూ కొంచం బ్రేకు మీద కాలెయ్యి !!
నీక్కాదేటి సెప్పేది లోన కెళ్ళేహే !!
ఏ వూరు మన్దీ ?!!
నిడమానూరు బొస్సేడెక్కాలే ?!!
చోద్దెం సూత్నావేటే బొస్సెల్ పోతాంది లగెత్తూ !!
ఏక్ డజన్ దేడ్ రూపయా సాబ్ !
అడై రూపాయి కి ఇస్తావా ?!!
ఎండ కాల్తన్నది, ఈడ నీడుంది
అలాగ వెళ్ళిపోయి వచ్చెయ్యండి !!
ఈపాలిత్తాన్నాగా !
ఇపుడేటన్టావ్ !
బాబ్బాబు ఈపాలొగ్గెయ్యండి !!
పొయ్యిమీద ఎసరౌతోంది వొద్నా !!
పెద్దానికి అన్నం పడేయమని చెప్పా !
అమ్మా నాల్గు డబ్బాలేయ్యనా !!
పంతులుగారు బొత్తిగా నల్లపూసైపోనారు !
శాస్తుర్లు గారికి కుర్చీ తెండిరా !!
అమ్మా, ఫ్రెండింటి కెళ్లి వస్తానే !!
ఏరా హోం వర్క్ చెయ్యకుండా ఎక్కడికి తగలడ్డావ్ ?!
మీరేవన్నా చెప్పండి ఈ మారు మా ఇంట్లో చెయ్యి కడగాల్సిందే !
ఏవే అలా చూస్తూ నుంచుంటావే, ఇంకో మారు ఆ గారెలందుకో !
అన్నీ వడ్డించినా మారడగాలమ్మా !!
అక్కాయ్ హోటల్లో ఓ పెసరట్టు వేసుకుంటే సరి !
అల్లం మిర్చి మంచిగా దట్టించు !
బాబూ కొంచెం అల్లప్పచ్చడన్దుకో !!
కొంచం నడుమ్వాలిస్తే గానీ నా వల్ల కాదు రా !
వీడిని నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదారీదినట్టే !
ముసురట్టిందీవేళ , పకోడీలు వేసేదా ?!!
మరి బండి వాడి జిలేబీ తెచ్చేదా ?!!
అదడగాల్సిన మాటా అదీ ?!!

ఆ మాటా ఈ మాటా ఆ నోటా ఈ నోటా అంతా తెలుగే
అన్నింటా హాయిగా తీయగా సాగు తోంది నలుగు తోంది వెలుగుతోంది
విరోధిలో మొలకెత్తిన విషబీజాలు
వికృతి లో విరగడౌతాయని ఆశిద్దాం
విరోధి మలచి సయోధ్య సాధించి
తెలుగు పురోగతి సాగిద్దాం !!

విక్రుతములన్నీ సుక్రుతములౌ గాక
విరాగాములన్ని సరాగాములౌ గాక
యుగాది అంతా శుభాలగు గాక
- మీ మల్లాది లక్ష్మణ కుమార్

15, మార్చి 2010, సోమవారం

బెజవాడ బందరు మధ్య స్టేషన్లు

ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని "తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?" అని అడిగారట. ఆయన "తరిగొప్పుల" అని చెప్పాడట. కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ "వచ్చే స్టేషన్ పేరు?" అని అడిగితే పక్కనున్నాయన సమాధానం "ఇందుపల్లి" అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి" అని అడగ్గానే పక్కాయనకి విసుగు పుట్టి , "ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?" అని అడిగారట. దువ్వూరివారు మహాపండితులు, అయినా "ఏదో కొద్దిగా వచ్చులెండి" అని అన్నారు. అప్పుడు ఆ పక్కనున్నాయన "అయితే ఈ శ్లోకం రాసుకోండి - స్టేషన్ల పేర్లన్నీ గుర్తుంటాయి" అని ఇలా చెప్పాడట -


"బెరాని ఉత ఇందోగు నూక
వప్పెచిమాః క్రమాత్
స్టేషన్సు బెబం శాఖాయాం

నూక్రాస్యాదితి నిర్ణయః"


అప్పుడు శాస్త్రి గారు రాసుకుని చదువుకున్నారు


బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు - గుడ్లవల్లేరు
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపుడి
మ = మచిలీపట్నం
బెబం = బెజవాడ బందరు మధ్య స్టేషన్లు
కానీ "నూక్రాస్యాత్" అనే పదం అర్థం కాక ఏమిటి అని ఆ పక్కాయన్ని కదిపితే వెంటనే ఆయన " నూజెళ్ళలో క్రాసింగ్ అవుతుంది" అని చెప్పి దిగిపోయాట్ట. ఇంతకీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడి నామధేయం మాత్రం తెలీదు..
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)


బాగుంది కదూ మరి, ఈ/మా బందరు పిచ్చోళ్ళ గొడవ!!???

14, మార్చి 2010, ఆదివారం

ఉగాది శుభాకంక్షలతో... పూర్తిగా చదవండి, తెలుగు తీయదనాన్ని అనుభవించండి

 మళ్ళీ కొత్త  తెలుగు సంవత్సరం వచ్చేసింది!

తెలుగు తెగులు పట్టిన వాళ్ళకి ఇది ఒక పిండివంటల పండుగ (ఒక శెలవు) మాత్రమె కాని మన సంస్కృతీ సంప్రదాయం, దాని సొగసులు, సొబగులు ఏవి పట్టదు! ఇలాంటి/మీలాంటి వాళ్ళ కోసం ఈ వికృతి నమ సంవత్సరం లో ఒక ఝలక్!!!

భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో తెలుగు లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని . ఇంగ్లిషు  ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ. సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే .......
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్
ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్
ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్
ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు
ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం (ఇప్పటి సమాధానం - జై తెలంగాణా నా , జై ఆంధ్రా నా)

ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.

అదే, శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...
దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!

ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి..

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు - ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)
అందుకే, తెలుగువారికి అజరామరమయిన, అనిర్వచనీయమయిన భాషా సంపత్తిని వదిలి వెళ్ళిన తెలుగు కవులకు, రచయితలకు పాదాభివందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఈ సంవత్సరం అన్నా...  తెలుగును మరవకండి, తెలుగును ప్రేమించండి, తెలుగువారిగా జీవించండి, గర్వించండి.
మీ అందరికి వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ లోగిళ్ళు కలకాలం పచ్చగా సుఖశాంతులతో వెల్లి విరియాలని మీ జీవితాలు శుభప్రదం కావాలని మనసార కోరుతూ
మీ లక్ష్మణ కుమార్ మల్లాది .

1, మార్చి 2010, సోమవారం

ఈ పాటను వినండి, చాల బాగుంది

ఈ పాటను వినండి, చాల బాగుంది, తమిళ్ లో చాల శ్రావ్యమైన పాటలలో ఇది ఒకటి.  మన బాలు గారు తరచూ గా ప్రస్తావించే సంగీత రాక్షసుడు ఇళయరాజా గారి పనితనం మనకి ఈ పాట ద్వారా తెలుస్తుంది.
నాకు ఇష్టమైన పాటలలో ఇది ఒకటి.

link - http://smashits.com/tsearch/music/song/nilavu-thoongum-neram.html

23, జనవరి 2010, శనివారం

శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి  గారి కథలు నేను ఎప్పట్నించో చదువుదా మనుకుంటున్న పుస్తకం.  చాల సంవత్సరాల నుంచి చాల చోట్ల అయన వడ్లగింజలు కథ గూర్చి చదివివుండటం వలన పుస్తక మహోత్సవం లో ఆయన కథల కోసం వెతికాను. రెండవ సంపుటం లో దొరికింది, దాదాపు రెండు సంవత్సరాల క్రితం కొని ఉంటాను కానీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు చదివానో లెక్కే లేదు. ఈ సోది (బ్లాగంటే అదేగా మరి) సూత్రం వలన మీకు విన్పించ గలుగుతున్నాను.  oka manchi katha- chadavandi

కథ ఎత్తుకోవటం లోనే బ్రాహ్మణ పాత్రధారి మన కథానాయకుడు అని చెప్పేస్తారు శ్రిపాదవారు. ఆ కథ నడిపే తీరు, పాత్రలు మలచిన తీరు, మాటల్లో విరుపులు, చెణుకులు,సొగసులు హావ భావాలతో సహా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కథ నడిచే తీరు యుద్ధ రంగాన్ని మరిపిస్తుంది. చదువుతూ మైమరచి పోతారు. భాష తళుకు సువాసనలన్ని చాల కొత్తగా వుంటాయి, మనం ఎపుడు ఆ రుచి చూడలేదు కాబట్టి!

వర్ణించడం నా వాళ్ళ కాదు గని, పైన చిప్పిన లింక్ లోకి వెళ్లి ఆ కథను  పొందండి, చదవండి, మన తెలుగు భాష సొగసు తెలుసుకోండి, మీరు కూడా ఏదైనా అటువంటి మంచి కథలు చదివితే నాకు తలుపండి, నా చిరునామా మల్లాది.లక్ష్మణ్@రెడిఫ్ఫ్మెయిల్.కామ్.

ఉంటాను మరి.......
మీ లక్ష్మణ కుమార్