22, ఏప్రిల్ 2010, గురువారం

పేరు లోనే ఉన్నది పెన్నిధి ....

నిన్న (అంటే ఈ టపా  మొదలెట్టే సమయానికి.. పదిహేడవ తారీకు) మా శ్రీకాంత్ పుట్టిన రోజు, నేను కూడా ఒక ఆఫీసు పని వలన హైదరాబాద్ లోనే ఉన్నాను. వాడు మా పెద్ద వాడు. రెండో పిల్లాడి పేరు శ్రీవంశి. ఈ పేర్లు పెట్టటం అన్న తంతు  ఒక్కొక్క సమయాల్లో చాలా విసుకు అనిపిస్తుంది అంటే నేను చూసిన కొన్ని సందర్భాలలో. మా పుట్టింటివారి తరఫు పేరు పెట్టాలని తల్లి, కాదని తండ్రి, మధ్యలో తాతలు, తాతమ్మలు, మావగారు, అత్తగారి సలహాలు, సూచనలు, అప్పుడప్పుడు కొంత ధాటిగా విసుర్లు, అలకలు ఆ పేరు ని చిరిగి చాటంత చేస్తాయి. అప్పుడు ఆ పేరు పెట్టుకున్న వాడు పెరిగి పెద్దయ్యాక ఈ తోకల్ని తలుచుకుని తలుచుకుని ఈ పేరు ఏమిటిరా బాబు హనుమంతుని తోక లాగా అని అమెరికా వెళ్ళిన తెలుగు వాడి లాగా ఆ పేరుని కుదించి మధించి కత్తిరించి అర్థం పర్థం  లేని కొత్త అవతారం ఎత్తుతాడు. ఇంతకీ మా అబ్బాయి పేరు పెట్టటం లో అంత ప్రతిఘటనలేమి ఎదురు కాలేదు. మా మామ్మ మటుకు గునిసింది, శ్రీ రాముని పేరు కావాలని.  నాకేమో శ్రీకాంత్ అన్న పేరు బాగా నచ్చింది. చివరికి ఆవిడే రాజీ పడి ఏదైనా ఆ మహా విష్ణువు అవతరలేగా అని తృప్తి పడింది. 
పేరులో ఏముంది!!  అని నాటకాలు, కవితలు మన తెలుగు వారు గుప్పించిన..  పేరుకున్న గొప్పదనం పెట్టుకున్న వాడికి గాని తెలియదు. ఒక్కొక్క సారి విచిత్రమైన ఎప్పుడు వినని పేర్లు కూడా వినిపిస్తుంటాయి.   మీక్కూడా ఈ రకం గా పేర్ల భాగవతం గాని ఉన్నట్లయితే నాకు తెలుయచేయండి, పంచుకోండి...
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

"మిథున"మైన బాపు రమణీయం...

బాపు రమణ ల గారి గురించి ఎంత చెప్పినా తరగదు ! మన తెలుగు సినిమా చరిత్ర లో రకమైన మహానుభావులు చాల మంది ఉన్నారని మీకు తెలుసు కదా. ఉదాహరణకి, విశ్వనాధ్, వంశి, బాపు, సిరివెన్నెల,ఘంటసాల, సుశీల, బాలు, జానకి,............ అలాఆఆఆఆఆఅ
ఇంతకీ నేనేం చెప్పోచ్చాను చెప్మా?? శ్రీరమణ గారి కథలు "మిధునం" చదివారా మీరు? పాత్రోచిత సంభాషణలు, పాత్రాభినయం (ఇలా ఎందుకన్నానంటే ప్రతి పాత్ర అభినయం తో సహా మనకి కనిపిస్తుంది) మలిచిన తీరు .... వహ్వా రే వహ్వా...
మొదటి కధ అరటి పువ్వుల వడల గురించి.. .  స్వామీజీ వాటి గురించి చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తారు ! వడల తయారీ తో నిబిడిఉన్న అంతర్లీన తాత్వికత ని హాస్యోక్తం గా చెప్పటం తోపాటు, ఏ దేముడి దగ్గర ఆ భజన చేసినట్టుగా సందర్బోచితం గా ఆ వర్ణనలని మార్చుకుంటూ వస్తారు.  చివరగా వేచిఉన్న భక్తురాలు ఆ ధోరణి కి మురిసిపోయి  "మీ పాదాల చెంత చోటిస్తే మీ జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తూ, అరటి పువ్వుల వడలను వండిపెదతాను"  అనిపించటంలో చమత్కారం కాలానుగుణం గా అనిపిస్తుంది.
వరహాల బావి, ధన లక్ష్మి కధ, మినిస్టర్ గారి అమ్మాయి పెళ్లి ఇత్యాదులన్నీ మత సామరస్యానికీ, సమకాలీన పరిస్తితుల గురించి కోమట్ల వ్యాపార శైలి ని హాస్యోక్తం గా తెలియచేస్తాయి.  బంగారు మురుగు కధ నేనెప్పుడూ చెప్పే బ్రాహ్మణ వ్యావహారిక శైలి సంభాషణలతో నవ్వు తెప్పిస్తాయి. మనవడ్నేసుకుని బామ్మ గారు కధ నడిపే తీరు ... చదవాలే గాని చెప్పనలవి కాదు. వాడికి పున్జీల కొద్దీ జీళ్ళు, పీచ్మిటాయి లూ (కంచు గంటను అమ్మేసి మరీ) కొనిపెట్టటం, బాదాం చెట్టు తొర్ర లో తినుబండారాల బ్యాంకు పెట్టటం, ...   "నాకు అరేల్లప్పుడు మా బామ్మ కి అరవై ఏళ్ళు. మా నాన్న అమ్మ ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు దేవుళ్ళు  గొడవల్లో వుండేవాళ్ళు. స్వాములార్లు, పీటధిపతులు  - ఎత్తే పల్లకి దించే పల్లకి తో మా ఇల్లు మఠం లా ఉండేది.అమ్మ తడి చీర కట్టుకుని పీటాల్ని సేవిస్తూ - నీ దగ్గరికి వెడితే తాకకోడదు అనేది."" ఇలా మొదలవుతుంది కధ.
అసలు బామ్మ గారి కాన్సెప్ట్ "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయ కంటే పాపం లేదు.చెట్టుకి చెంబెడు నీళ్ళు పొయ్యటం, పక్షి కి గుప్పెడు గింజలు వెయ్యటం, పశువు కి నాలుగు పరకలు వెయ్యటం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టటం - నాకు తెలిసిన్దివే..."  మహా గొప్ప గా ఉంది కదూ.
మీరు ఈ లంకె లోకి వెల్లి పూర్తి కధ చదవండి, సరళమైన ప్రక్రియతో ఆ లంకె లో సభ్యత్వం పొందచ్చు.
http://www.scribd.com/doc/7430162/Bangaru-Murugu-Part1
మిగిలిన కధ గురించి తరువాత రాస్తాను.
మీ లక్ష్మణ్ కుమార్ మల్లాది
(చెప్పుకోటాని మనకు చాలా చాలా గొప్ప కథకులు ఉన్నారు, నేను చదివినవి - శ్రీపాద, మల్లాది రామకృష్ణ శాస్త్రి, తిలక్, చాసో, మధురాంతకం, రమణ, వంశి, యుండమూరి, భానుమతి అత్తగారి కథలు, భమిడిపాటి, ఇలా చాలా ఉన్నాయ్. గుర్తుకొచ్చిన కొద్ది వాటిని మీకు వీలు చూసుకొని పరిచయం చేస్తాను, మీకు తెలియదని కాదు!!  ఏదో నా చాదస్తం గొద్ది... ఎందుకంటె నేను ఒకసారి చదివి వాటిని వదిలిపెట్టను!! తెలుగు మట్టి వాసన మరచి పోయినపుడల్లా మళ్ళీ మళ్ళీ వాటిని అనుభవిస్తూ అస్వాదిస్తూంటాను. అందుకని మిగిలిన గొప్ప రచయితల గురించి ప్రస్తావిన్చాదేంటి అని అనుకోకండి, సరేనా  )

8, ఏప్రిల్ 2010, గురువారం

ఇళయరాజా

ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునే చాల చాల మంది లో నేను ఒకడ్ని . అంటే నా చెవులు ఇప్పటికే తెగిపోయి ఉండాలి అని అనమోకండి. చెన్నై వచ్చాక సంగీత దాహం చాల మటుకు తీరింది. ప్రతి రోజు ఆఫీసు నుంచి రాగానే ఎఫ్ ఎం లో ప్రతి ఛానల్ లో రాత్రి తొమ్మిది గంటల నుంచి సంగీత ప్రవాహం మొదలవుతుంది. దాదాపు అన్ని అలవరసలలోను నిరంతర గానామృతం ప్రవహిస్తూంటుంది. మన తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా తమిళ భాషలో చాలా చాలా విబ్భిన్న తరహాలలో సంగీతం రచించారు ఇళయరాజా. ఇక్కడ నాకు బాగా నచ్చిన కొన్ని పాటల లంకెలు ఇస్తున్నాను. ఇవి విని రాజా గారికి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పండి  ... ఎందుకంటే సంగీతం పరమౌషధం! భాషా బేధం లేనిది సంగీతం.

౧. నిలావే వా...(మౌన రాగం చిత్రం లోనిది)    http://www.tamilwest.com/tamilsongs/inter/Mouna%20Raagam/ 
౨. ఎన్వానిలే ఒరే వెన్నిలా... , కాట్రిల్ ఎన్ధాన్ గీదం    http://www.tamilwest.com/tamilsongs/inter/johnny/
౩. పురువమే పుదియ పాడ పాడల్... (ఇది మన తెలుగులో కూడా వున్నది, పరువమా చిలిపి పరుగు తీయకు అని )
౪. నాన్ పాడుం మౌన రాగం ....   http://www.tamilwest.com/tamilsongs/inter/IdhayaKoyil/
౫. పెన్మానే సంగీతం పాడి వా ....  
                           http://www.tamilwest.com/tamilsongs/inter/Naan%20Sigappu%20Manithan/
౬. పూవే సెం పూవే ...  
                            http://www.tamilwest.com/tamilsongs/inter/Solla%20Thudikkuthu%20Manasu/
౭. రాసావే ఉన్నైనంబి (ఇది జానకి పాడిన పాత, ఎంత మధురంగా ఒక రకమైన యాస తో ఉంటుందో వినండి)
             http://www.tamilwest.com/tamilsongs/inter/Mudhal%20Mariyathai/
ఇవి కాక నా దగ్గర చాలా పాటలు సేకరించి ఉంచాను. పైన ఇవన్ని లంకెలతో ఎందుకు ఇచ్చానంటే మీరు వెంటనే అంతర్జాలం నుంచి పొందటానికి. చ్చాదస్తం అనుకోకండి, ఈ పాటలు వినండి.  మరిక ఉంటాను.  

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

4, ఏప్రిల్ 2010, ఆదివారం

పొలిమేర దాటేల్లిపోయింది

నేను క్రితం రాసిన "ఆ రోజుల్లో..." కి కొనసాగింపుగా ......

ఈ మధ్య వంశి (సిన్మా వంశి) మహాద్భుతం గా రాసి చూపించిన (కళ్ళకు కట్టినట్టుగా) "మా పసలపూడి కథలు" చదివారా! అక్కడక్కడ శృంగార మరకలు కనిపించినా, చాలా కథలలో మనసును కరిగించునట్టి, కదిలించే ఇతివృత్తాలు తో వంశి చాలా గొప్ప సృష్టి చేసాడు. దానిలో ఒక కధలో చెప్తాడు (పొలిమేర దాటేల్లిపోయింది.. పుస్తకం లో చిట్టచివరి కథ)

"కాలవగట్టు దగ్గరాగిన బస్సులోంచి దిగిన చిన శంకరం ట్రంకు పెట్టి పట్టుకుని దిగువలో ఉన్న ఊళ్ళోకి నడక మొదలెట్టాడు.
రధం ముగ్గులు, మల్లెపందిరి ముగ్గులు, ఏనుగు పాదం ముగ్గులు ఒకటేంటి రకరకాల ముగ్గులు ఒంచిన నడుం ఎత్తకండా నడవడానికి పిసరంత సందు లేకండా ముగ్గులేసేస్తున్నారు ఆడపిల్లలు.   చిన్నచిన్న సందులన్ని కల తిరిగిన హరిదాసు బ్రహ్మయ్యగారి వీధిలో కొచ్చేసరికి చిన్న పిల్లలంతా కల్సి దండకట్టేసారు. రెడ్ల ఇళ్ళకి పెరుగులకి పాలకి వెళ్తున్న చిన్న కులాల పిల్లలు గోపాలస్వామి గుడి గోడ పక్కన రాలిన పారిజాతం పూలు ఎరుకుంటున్నారు ....
అవుపెడతో అలికి ముగ్గులు పెట్టిన అరుగులు, పసుపు రాసి బొట్లేట్టిన గడపలు మామిడాకుల తోరణాలు కట్టిన ద్వార బంధాలు, సంప్రదాయంతో కళకళలాడుతుంది వూరు.  కళ్ళు కడుక్కోడానికి పాలేరుతో ఇత్తడి గంగాలంచెంబు పెట్టించింది వాళ్ళ చిన్నక్క. చిలక్కోయ్యకి తగిలించున్న గల్ల తువ్వాఅలందించాడు బావ.....
గోర్మిట్టీలు, బెల్లంపూతరేకులు, పాలపూరీలు, పాకుండలు రకరకాల పిండి వంటలు, దబ్బకాయ పులిహార,ఆవపెట్టిన అరిటి పువ్వు కూర, పనస పొట్టు కూర , కంది పచ్చడి , అత్తగారలా కూరేస్తుంటే ఎక్కిసం అయిపోయినా మొత్తానికెలాగో లాగించి పందిరిపట్టి మంచం ఎక్కి పడుకున్న మనిషి తిరిగి లేచేసరికి చీకటై పోయింది ....
వెడల్పాటి ఆ గోదావరి కాలవలో గూటి పదవ నెమ్మదిగా వెళ్తుంటే కాలవకి ఎడాపెడా పచ్చటి వేప చెట్లు, మామిడిచెట్లు, గానుగ చెట్లు , నిద్రగన్నేరు చెట్లు, ఏ పక్కకి చూసినా పచ్చదనం.  దూరంగా ఎక్కడో పొలాల్లో తాటాకు గుడిసలు వాటి కొప్పుల్లోంచి వస్తున్న పొగ, గులగుర్త  రేవు దగ్గర కొత్త బట్టలు కట్టుకున్న నలుగురు ఆడపిల్లలు మొన్నే వండిన కొత్త బెల్లంతో చేసిన పరమాన్నం, బూరలు, ఇత్తడి గిన్నెల్లో పెట్టుకుని వాటి మీద అరిటాకు ముక్కలు కప్పుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

అందమైన అనాటి జీవితాన్ని అందమైన కాలవ కింద పల్లెటూళ్ళ ని  వాటి మధ్యలో మరీ అందమైన పసలపూడి గ్రామాన్ని చెక్కుచెదరని సంప్రదాయాల్ని, కట్టుబాట్లని, వాళ్ళ అమాయకత్వాన్ని మానవ  సంబంధాల్నీ నెమరేసుకుంటూ చాలా ఏళ్ళ తర్వాత ఊళ్ళోకి దిగాను.
"చుదీదార్లూ మిడీలు వేసుకున్న ఇద్దరు పిల్లలు కేనతిక్ హోండా వెనకాలేక్కి మాముందు నిన్చేల్లేరు. గోపాలస్వామి గుళ్ళో పూజారిగారి కోడలు నైటీ వేసుకుని నారింజకాయల సైకిలోడితో బెరమాడుతూ ఈలోగా తేగల కట్ల  తట్ట మనిషేల్తుంటే తానని పిలుస్తోంది స్టైలుగా....
ఊళ్ళో ఏ పక్కకు  చూసినా కేనేతిక్ హొండలు, స్పెండర్లు కనపడ్తున్నాయి.నడుస్తున్న మా పక్కనించి ఒక ఇండికాకారు స్పీడుగా వెళ్ళిపోతే క్వాలిస్ దానికి ఎదురొచ్చింది.  సంతపేట లో ఒకప్పుడు ధాన్యం మిల్లున్దేచోటు ఇప్పుడు ఖాళీగా ఎత్తుగా పచ్చగడ్డి మొలిచి వుంది. మాసిన పంజాబీ  డ్రేస్స్ వేసుకున్న ఒక పిల్ల రెండు గేదెల్ని అక్కడ మేపుతావుంది.  గొల్లలతూము దగ్గర ఎవరో పాతిల్లు పడగొట్టి మోడరన్ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆవేళ గృహప్రవేశం అనుకుంటాను, వరసగా టేబుళ్లు వేసి వున్నాయి. కూర్చుని భోంచేస్తున్న జనాల ముందుకి అన్నం గిన్నెతో వచ్చిన కుర్రాడు "కొంచెం వైట్ రైస్ వడ్డిన్చమంటారా?" అంటున్నాడు.
ఇవ్వేళ రాజేశ్వరస్వామి తీర్థం గుర్తుందా? అన్నాడు త్యాగరాజు.
రధం లాగుతూ ఉంటారీపాటికి  పదండి అనేసి కదిలాను.
దారు శిల్పాలతో నిన్దిపొయిఉన్న మా రాజేశ్వరస్వామి  రధానికి ముందు ఎడాపెడా నాలుగు అంగుళాల కైవారంతో పొడుగ్గా ఉండే ఆ రెండు పెద్దాపురం తాళ్లనీ చెరి వందేసి మందీ లాగేవారు వెనకటికి.  లాగడానికి సంబరపడే చాలా మంది కుర్రోళ్ళు తాడు లేక మిగిలిపోయేవారు. అల్లాంటిది...
ఇవ్వేళ మా దేవుడి రధం రెండు తాల్లనీ వందలమంది జనాలు లాగడానికి బదులుగా,  ఎర్రరంగు మహేంద్ర ట్రాక్టర్ లాగుతుంది.

నేనెప్పుడూ ఏడవలేడుగానీ, ఆ దృశ్యం చూస్తున్నపుడు మట్టుకి నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజలా రాలిపోయినియ్యి."




యెంత చక్కగా పిందేసాడండీ గుండెల్ని.  ఈ కథలలో బాపుగారి బొమ్మలన్నీ సందర్భోచితంగా ఉన్నాయి , అసలు కధ చదువుతుంటే ఆ బొమ్మ చూస్తుంటే సారాంశం అంతా  మన కళ్ళకు కట్టేస్తుంది. అంత గొప్ప అవిడియాలు ఎలా తడతాయో ఆయనకి?  మీరు మట్టుకు ఈ పుస్తాకాన్ని  వదలకుండా చదవండి.  కనీసం తెలుగు బతుకు బతక లేక  పోయినా అచ్చ తెలుగు గ్రామాలు, సంబంధాలు, ప్రకృతి ఎలా వుంటుందో చదివి ఆనందించండి.
ఆయ్... మరిక దిగాడతానండి
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

ఆ రోజులే వేరు!!

ఆ రోజులే వేరు!!
మనం ఎప్పుడు వాడే మాట ఇది. ఒక ఉరు నుంచి వేరొక వూరు వెళ్ళినా, ఉద్యోగం మారినా, లేదా మన వయస్సు మారినా, పాత సంగతులు గుర్తుకొచ్చినపుడు మనం అంటుంటాం, "అబ్బ నువ్వేన్నైన చెప్పరా కానీ,  ఆ రోజులే వేరు".
దానికి నేనేమీ మినహాయింపు కాదు. చిన్నతనం లో మనం చేసిన అల్లరి, బాధ్యతలు లేని జీవితం ఎవరికి బాగుండదు చెప్పండి. వేసవి కాలం సెలవలు వచ్చిందంటే సూర్య కిరణాలు లేపుతుంటే లేవటం, (అంటే ఆలస్యం గా) ఎడ పెడా తిరిగేయ్యటం, సాయంత్రం పక్కింటి అబ్బాయి బుడ్డిబాబు, రాము, మా అన్నయ్య వాళ్ళతో గోలికాయలు ఆడటం, పోద్దస్తమాను రేడియో వినటం, ఇన్ని వ్యాపకాలు ఒక్కసారిగా మీద పడి పోతాయి. ఎండలు మండేవి అనుకోండి, కాని ఆయనెవరో చెప్పినట్టు, "మావిడి పళ్ళు, మల్లె పువ్వులు కావాలి గాని, మండుటెండలు అక్కరలేదా అని" ... ఆ రోజులే వేరు.
ఉదయం రేడియో లో మల్లిక్ గారి రాజ రాజేశ్వరి స్తోత్రం తో సుప్రభాతం అవటం మనం ఈ రోజుల్లో ఊహిన్చలెము .  మల్లాది సూరిబాబు గారి లింగాష్టకం, బాల మురళి రామదాసు కీర్తనలు, మధురాష్టకం, సుప్రభాతం, దేవి స్తుతి, సత్యదేవుని పాటలు, ఇలా చెప్పుకుంటూ పొతే మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం అనిపిస్తుంది. ముఖ్యం గా వాయులీనపు నేపద్యం లో మల్లిక్ గారి మంద్ర స్వరం లో ఆ స్తోత్రం పోద్దుపోద్దున్నే మనసుని ప్రశాంతం గా చేసేది. (ఇది ముఖ్యం గా విజయవాడ స్టేషన్ వినేవాల్లకే).
ఇప్పుడు కూడా ఆ పాత మధురాల్ని ఆలిండియ రేడియో వాళ్ళు తమ archieves దుకాణం లో అమ్మకానికి పెట్టారట. వీలయితే కొనుక్కుని, ఆ మధురాల్ని అచ్చంగా ఉన్చేసుకోండి.  నా మటుకు నాకు నా బాల్యం అంటే గత స్మృతులన్నీ సున్నాలు చుట్టుకుంటూ ఆ నేపధ్య సంగీతం తో కనివినిపిస్తాయి. ఇక శ్రావణ  మాసం లో (మా) బందరు, వర్షం లో పొద్దస్తమానం స్నానం చేస్తూనే ఉండేది. చల్లటి ఆ వాతావరణం, బురద బురద (కొండొకచో నీరు నిండిన) రహదారులు, ఆ వర్షం లో తడుస్తూ ఊరంతా తిరగడం, పేరంటాళ్ళు, పట్టు చీరల రెపరెపలు, తాంబూలాలు, శనగలు  సెనగల మసాల గారెలు,  ఇంకా ఇంకా చాలా ... నాకు నచ్చిన నా పాత జ్ఞాపకాలు.

1, ఏప్రిల్ 2010, గురువారం

పాత జ్ఞాపకం.

మా బ్యాంకు సంవత్సరీకాలు మూలంగా (అపార్థం చేసుకోకండి, నా ఉద్దేశ్యం annual closing ) మీతో మనసు విప్పి మాట్లాడలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. పొతే, ఈ సోది పుస్తకం మొదటి పుటలో మీకొక అమాయకమైన ప్రాణి చిత్రం కనపడుతూ ఉంది ఉంటుంది, కొత్తగా.  అది, .......... నేనే.  దాని పూర్తి వివరం ఆ లంకె లోకి వెడితే కనిపిస్తుంది,
మరి చూస్తారు కదూ...
మీ లక్ష్మణ కుమార్ మల్లాది.