27, అక్టోబర్ 2011, గురువారం

మళ్ళీ వచ్చే దీపావళి, క్షమించాలి

మళ్ళీ వచ్చే దీపావళి, క్షమించాలి .... మళ్ళీ వెళ్ళే దీపావళి.
మీకందరికీ ఆలస్యం గా దీపావళి శుభాకాంక్షలు. మీ చేతులు కాల్చుకోకుండా...  విష్ణు చక్రాలు వేళ్ళలో దూర్చి తిప్పకుండా... బుజ్జాయి లు  ఇంటి లోపలే చిచ్చు బుడ్లు పెట్టి మిమ్మల్ని కంగారు పెట్టకుండా...  తారా జువ్వలు పక్క వాళ్ళ ఇళ్ళ మీదకు ఎగురవేయకుండా...

ఇవన్నీ జరగకుండా, ప్రశాంతం గా, క్షేమం గా ఈ దివ్వెల పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటాను.

విశేషం ఏమిటంటే, నేను భాగ్యనగరానికి బదిలీ అయి వచ్చేసాను. మూడు నెలలు అయ్యిన్దనుకోండి. ఈ పరుగుల జీవితం లో మీతో ముచ్చట్లు చెప్పుకోవడం కుదరనందుకు నాకు మిగుల బాధగా ఉంది.
అయినా పర్లేదు...   

మళ్ళీ మీ బుర్ర తినటానికి, మీ ఓపిక పరీక్షించటానికి మీ ముందుకు మళ్ళీ వస్తాను.

మరిక ఇప్పటికి సెలవా మరి!!

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్ 




21, జూన్ 2011, మంగళవారం

'ఏకరువు'

సాయంత్రం నాలుగున్నర దాకా పని లేక బోరుకోట్టి చచ్చి చచ్చి, ఎలాగోలా ఈ రోజు ఆఫీసు అయిందనిపించి, కొట్టు (బట్టల కొట్ట్తో, పచారీ కొట్ట్తో కాదు, మా బ్యాంకు) కట్టేద్దామని తాళం వేయించ  పోతూ ఉంటె, ఒక జులపాల జుట్టు వాడు కారు దిగివచ్చి డెనిం జీన్స్ మీద ఎర్ర టీ షర్టు రేబాన్ కళ్ళద్దాలతో  చేతిలో కార్డు పట్టుకొని దిక్కులు చూస్తూ, అంతా  వెతుక్కుని ప్రశ్నార్ధకం లా నుంచుంటే ఎవడా వచ్చినిది అని  చూస్తూంటే, హి హి హి ఏ టీ ఎం ఉందండీ అంటూ వచ్చే ఆ విద్యాదికున్ని పిచ్చాడిలా చూసి, అబ్బెబ్బే లేదండీ అని నవ్వుతూ సాగనంపి మనసులో బోర్డు చూడటం కూడా రాదా ఈ వెధవకి ని తిట్టుకుని ద్విచక్ర వాహనం తీసి ఇంటికి బయల్దేరి, మధ్యలో కనిపించిన ఆ వాహనం అమ్మిన ఏజెన్సి వాడిని వెధవ బండి అమ్మావు, డుర్రు డుర్రు మని శబ్దం వస్తోంది అని వాణ్ణీ మనసు లోనే తిట్టుకొని, ఇంట్లో కూరలు లేవన్న విష్యం గుర్తొచ్చి, వాహనాన్ని సందు మొదట్లో సురేష్ కొట్టు దగ్గర ఆపి, అక్కడ ఉన్న పుచ్చు చ్చచ్చు వాడిపోయిన కూరలు చూసి విసుకుపుట్టి ఆదివారం అవటం వలన కూరల కొట్టు వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడా దొరక్క, దారి తప్పి వేరే సందులోకి వెళ్లి రోడ్డంతా కంకర పోసి ఉండటం వలన బండి బెదిరి, బెసికి తక్కుతూ తారుతూ అతి కష్టం మీద ఆ రోడ్డు బయట పడి  మళ్ళీ ఆ సురేష్ కొట్టు కే వెళ్లి ఆ కూరలే కొని, దుమ్ము ధూళి లో నలిగి, ఎండకు కమిలి చీకాకు పుట్టి ఇంటికి దారితీసి తాళం తీసి స్నానం చేద్దామని బాత్రుము కు వెళ్లి పంపు తిప్పితే,....    దేముడా... నా ఖర్మ కాలి నీళ్ళు రావాయే....

చెన్నపట్నం మహానగరి లోని మడిపాక్కం అను ఈ పంచాయితీ కుగ్రామా నగరం లో మొన్న అనగా ఆదివారం ఇలా జరిగింది. ఏదో ఇలా జరిగిందని ఏకరువు పెట్టాను, ఏమనుకోకండే!!!

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

(సాహితీ ప్రియులకు తప్పనిసరిగా ఒకటి గుర్తొచ్చే వుంటుంది. చాసో గారి 'ఏకరువు' కథ. ఏదో దానిని అనుకరిద్దామని సరదా గా ఇలా రాసాను. మళ్ళీ ఏమనుకోకండే ???!!!)

9, జూన్ 2011, గురువారం

వింత కొలిపే ఒక ఆకాశ చిత్రం

ఈ మధ్య ఆకాశం లో కొత్త రంగులు చూస్తూ కెమెరా లో బంధిస్తుండగా తీసిన ఒక వింత కొలిపే చిత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటె దానిలో ఆకాశం లో ఎగురుతున్న వీర హనుమాన్ ఒక చేతిలో గద మరొక చేయి గాలిలో చాపి వెడుతున్న రకం గా స్పష్టం గా కనిపిస్తోంది. దీనిని చూపి ఇదేదో భగవంతుని మాయ, ఆంజనేయుడు గాలిలో వెలిసాడు అని నేను చెప్పదలుచుకోలేదు గానీ, ఇదొక ఆశ్చర్యమైన చిత్రం గా అనిపించి మీ ముందు ఉంచాను. మేఘాల వింత సోయగం ప్రతి క్షణం విచిత్రం గా మారుతూండడం రక రకాల అనుభూతుల్ని అందించటం, ఆకారాల్ని దాల్చటం ప్రక్రుతి వింతయే కదా. దయచేసి గమనించండి, ఇది నేను సృష్టించినది కాదు, సొల్లు ఫోన్ లో సహజం గా తీసిన ఆకాశ చిత్రం.

ఆ చిత్రం మీరూ చూడండి:



మరిన్ని ఆకాశ చిత్రాలను ఈ లంకె పై చూడగలరు: ఆకాశ చిత్రాలు (రంగుల ప్రపంచం)

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది 

అభ్యర్ధన: మీరు నా అభిమానుల జాబితా లో చేరనే లేదు. దయచేసి మీ పేరు కుడిప్రక్క గల అనుసరించు వారి జాబితా డబ్బా లో నమోదు చేసుకో గలరు. చేసిన వారికి ధన్యవాదాలు.

20, మే 2011, శుక్రవారం

మధురం ఈ రాగం ...


ఈ మధ్య బ్లాగుల్లో చూసి నేర్చుకున్న విష్యం ఏమిటంటే మనకి నచ్చిన పాటలను మీకు బ్లాగ్ముఖంగా వినిపించవచ్చును అని.  ఈ విషయమై ఒక బ్లాగరు ను సంప్రదించగా వారు ఇచ్చిన సలహా మేరకు నాకు మొదటగా నచ్చిన ఒక పాట ను మీకు వినిపించ దలుచుకున్నాను. అసలు మొదటిసారిగా నేను ఇంతకు ముందు పుటలలో చెప్పిన ఆకాశవాణి వారి "రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను. కానీ అవి ఆకాశవాణి వారి ఆంతరంగిక రక్షణ (rights protected ) చే రక్షించబడటం వలన embaded సూత్రం జనించక (ఆ స్తోత్ర రాజాన్ని మీరు ఈ లంకె ద్వారా పొంది  వినవచ్చు:    స్తోత్రం   ) ఆ ప్రయోగం మానుకుని, మన ఘంటసాల గారి  ఆ పాత మధురాల లో నుంచి 'రసికరాజ తగువారము కామా .....' అన్న జయభేరి చిత్రం లోని ఒక పాట రాజాన్ని నా మొదటి ప్రాధాన్యతా క్రమ పట్టిక నుంచి బయటకు తీసి రికార్డు వేస్తున్నాను. విని ఆనందించండి. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ పాత గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను.



పేరు పొందిన వేదికల మీదనుంచి రకరకాల గాయకులూ ఈ పాట ను పాడటానికి ప్రయత్నించగా చాలా సార్లు నేను విన్నాను. కానీ, అసలు ఉన్నంతగా కొసరు ఉండక, అంత రుచి రాలేదు.  ఒక పోటీ లో మన 'శ్రీరామచంద్ర', అదేనండీ సోనీ వారి గాయక సామ్రాట్, అలవోకగా ఘంటసాల లెవెల్లో అతి మధురం గా గానం చేసాడు. ఆ పోటీలో నెగ్గక పోయినా రచ్చ గెలిచి ఇంటికి తిరిగి వచ్చాడు. సాంప్రదాయక సంగీత బాణీ లో ఉన్న ఈ పాట ను మీరు తప్పక ఇష్ట పడతారని ఆశిస్తూ...

ఒక్క క్షణం ఆగండి... ఏమండీ! ప్రక్కన నేను కొత్తగా చేర్చిన సభ్యుల జాబితా చూసారా, ఎవరూ సభ్యులు లేక నేనే మొదటి వాణ్ని అవ్వాల్సి వచ్చింది. మీకు ఏ మాత్రమైనా నా కబుర్లు నచ్చినా నా బ్లాగు ను అనుసరిస్తూ, సభ్యులు  గా చేరి నాను ఆదరించగలరు.       సరేనా!!!  

మరిక సెలవా మరి...

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది



12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ రామ నీ నామ మెంత రుచిరా !!!


కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూలా కర్తవ్యమ్ దైవమాన్హికం

శ్రీరామ రామ రామేతి , 
రమే రామే మనోరమే;

సహస్ర నామ తతుల్యం, 

రామ నామ వరాననే. 

'రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత, భక్తీ, అనుభూతి ఉన్నాయి. అందుకనే గామోసు అప్పటి హనుమాన్ నుంచీ భక్త శబరి, వాల్మీకి, త్యాగయ్య, రామదాసు మళ్ళీ తరువాతి కవిజనం ఆ భక్తీ భావం లో మమేకమై మనకి మంచి కృతులని, గీతాలని, పాటలనీ అందించారు. ఇక సీతారామ కల్యాణం జగత్ప్రసిద్ధం. భద్రాద్రి లో జరిగే ఈ వేడుక పండిత పామర జనరంజకం గా వైభవం గా జరుగుతుంది.

గంగా నది చూస్తె యెంత పవిత్ర భావం కలుగుతుందో, శివాలయం లో కార్తీకం లో డమరుక నాదాలతో విభూతి పరిమళాలతో శివలింగం చూస్తె (నా చిన్నప్పుడు బందరు లో ఖోజ్జిల్లుపేట శివాలయం లో కార్తీక మాసం ప్రతీ రోజూ రాత్రి వివిధ హారతులు ఇస్తూంటే, డోలు, ధమరుకాలతో నందీశ్వరుడు, శివుడు దిగివచ్చినట్టు గా వింత వింత నాదాలతో గర్భగుడి ప్రతిధ్వనిస్తూంటే ఒడలు పులకరించేవి) ఎంత వింత అనుభూతి కలుగుతుందో, శ్రీ రామ నవమి నాడు స్వయం గా చేయకపోయినా ఆ కళ్యాణ ఘట్టం తలుచుకుంటే అంత అనుభూతి. క్రితం సంవత్సరం ఈ రోజు (శ్రీ రామ నవమి నాడు) నేను రాసిన నా  జ్ఞాపకాల గురించి చదవాలనుకుంటే    ఇక్కడ      చూడండి.  
స్వామివారి వడపప్పు, పానకాలు జనులందరూ మెచ్చే ప్రసాదాలు.

జనన మరణ భయ శోక విదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం 
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
అటువంటి ఈ రామ ప్రసాద రసం, పానకాన్ని కరువుతీరా గ్రోలండి.

రామ భక్తీ సామ్రాజ్యం,
ఏ మానవుల కబ్బెనో మనసా.. అని త్యాగయ్య ప్రశ్నించు కున్నాడు.

అలాగే...

ఆ మానవుల సందర్శనం
అత్యంతా బ్రహ్మానందమే మనసా...

అని కూడా ఆనందపడ్డాడు.

ఆ ఆనందాన్ని తమ  ప్రతి చిత్రం/చలన చిత్రం లోను రామ భక్తి చూపించిన బాపు రమణలు ధన్యులు.  ఆ రాముని భజియించినట్టి భక్తాగ్రేసరు లందరూ ధన్యులు.


లోక కళ్యాణార్ధం ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుభ ముహూర్తాన జరుగే సీత రామ కల్యాణం ప్రజలందరికీ శుభకరం, మంగళ దాయకం. భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు ఇక్కడ మననం చేసుకుందాము:


శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు 
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో 
త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!


చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో 
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా 
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!


రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ  కల్పవల్లి కా 
రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో 
ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం
దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి!


మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ...




మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.


మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది 

9, ఏప్రిల్ 2011, శనివారం

అంకురం... ఒక హెచ్చరిక


ఎవరొ ఒకరు                       
ఎపుడో అపుడు
నడవరా ముందుగా            
అటొ ఇటొ ఎటోవైపు...


(అంకురం అన్న తెలుగు చలన చిత్రం లో నుంచి) 

ప్రజల కోసం... ప్రజా సమరం... ప్రజా విజయం

అవినీతిని అంతమొందించటానికి, భ్రష్తాచారాన్ని తుదముట్టించడానికి ఉద్యమించిన ఒక సామాన్యుడు ప్రజల మద్దతుతో, ఏ రాజకీయ కొణం లేకుండా, దేశమంతా వెల్లువెత్తిన ప్రజాభిమానం తొ సాధించిన తీరు ... అభినందనీయం.

ఇది ఒక అంకురం. ఆ చిగురుని ఆదిలొనే ఎండకట్టకుండా వ్రుక్షాన్ని చేయవలసిన బాధ్యత మేధావులు, యువత, ప్రజ, మనందరిమీదా ఉంది.

చిత్రమేమిటంటె, ఇన్ని సంవత్సరాల నించి ఆ బిల్లు అమోదం పొందకుండా చేసిన రాజకీయ పార్టీలు, నేతలు (ఇలా అని ఎందుకనాలంటె, పార్లమెంటులొ ఒటు వేసెది అమోదింపచేసేది వారే కాబట్టి), ఇపుడు టీవీ లొ చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తాయి, వారికసలు సిగ్గె లెదా అని అనిపిస్తుంది. ఒక ఎన్నికల పోటిదారుదంటాడు  .. "ఈ స్ఫూర్తి తొ అవతల పార్టీ వారు చేసే నొట్ల పంపకం, అవినీతి అడ్డుకుంటానని". మరి ఇప్పటిదాకా ఈయనెం చెసాడో. జనాలు నవ్వుతారని కూడా చూడకుండా , ఈ చైతన్యాన్ని కూడా ఒట్ల కోసరం వాడుకుందామని ఆయన యత్నం.

ఈ విజయ ప్రకటన వచ్చిన సమయం లొ ఒక టీవీ చర్చా కార్యక్రమం లొ పాల్గొన్ననేత ఒకామె(టైంస్ నౌ చానెల్ లొ, పేరు మీనాక్షి రెడ్డి) ముఖం లొ భావమేమీ లేకుండా పెడసరం గా విసిరిన మాటలు పాల్గొనే వాళ్ళనే కాక చూసె వాళ్ళకు కూడా విసుకు, కోపం తెప్పించాయి. ఇక మన రెణుకా చౌదరి అయితె, ఇదేదో రాజకీయ పార్టీల, నేతల పైనే జరుగుతున్న పొరాటంలా వర్ణించి తన అసహనాన్ని వ్యక్తం చేసారు. అవినీతి బురద అంటించుకున్న ఈ ప్రభుత్వం లోని రాజాలు, కల్మాదీలు, ఆదర్ష్ కాలనీలు ఇలా...  ఇవన్నీ ఈ రాజకీయ కొణం లొని భాగాలే.

ఇకపొతే, చేసేదేమీ లేక, కేవలం మూడు రొజుల్లొనే విజయవంతం గా ముగిసిన ఈ రాజకీయేతర విప్లవానికి తల వంచలేక, వంచలేక వంచిన కాంగ్రేస్, ఇది ప్రభుత్వం దిగివచ్చినట్లు కాదనీ ప్రజాస్వామ్య విజయం అనీ రక రకాలుగా ప్రకటనలిచ్చిన కపిల్ సిబాల్ మాటల్లొనే వారి అధికారం వీగిపొయింది. ఇది చాలక ఈ విజయం కొసం మన్మొహన్, సొనియా లు చాలా కృషి చేసారని ముక్తాయింపు ఒకటి.

ఎన్నికలలో కేవలం 30-40 శాతం ఓట్లతో విజయం పొంది, మూడొంతుల ఆధిక్యం తో గద్దెనెక్కే తమకు తరువాత ఇక ఎదురు లేదనుకునే రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక.

కానీ ఇంతటితో ఈ సమరం ఆగకూడదు. ఈ చిగురేసిన మొక్కని అందరూ కలిసి పెంచి పెద్ద చేసి దాని ఫలాలను భావి తరాలకు అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి.  ఈ సామాన్యమైన పోరాటం ఏ రాజకీయ అండా దండా లేకుండా అనన్య సామాన్యం గా మారి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించాలి. ఈ గంగా ప్రవాహంలోకి ఏ కుళ్ళు రాజకీయ ఉపనదినీ కలవనీయకూడదు. ఏ కళంక నేతనూ ఈ వేదిక పైకి అనుమతించకూడదు.  ఏ అరాచకీయ, రాజకీయ నేతల అప్రస్తుత ఊకదంపుడు ప్రసంగాలూ ఈ ఉద్యమ కారుల చెవిలో పడకూడదు. ఈ బృహత్కార్యానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఎవరో వొకరు ముందుకు నడవాలి.

ఆ ఒక్కరే ఈ "అన్నా హజారే"

ఆయనకు ప్రజలకు మధ్య ప్రసార మాధ్యమాలు వేసిన వారధి కలకాలం కొనసాగాలి. ఈ వేడి చల్లరగానే అవి మళ్ళీ తమ మూస పోసిన పాత కార్యక్రమాల లోకి, పార్టీల భజన లోకి వెళ్ళకూడదు.

ఇంత జరిగినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేవరకూ దీక్ష విరమించానన్న 'అన్నా' నిజంగా అభినందనీయుడు. మన రాజకీయ నేతల నిరాహార దీక్షలు ఎన్ని చూడలేదు!!

అంకురం           ఒక పుట్టుక
                    ఓ కొత్త చిగురు
                    ఒక పులకింత
                    ఒక ప్రక్రుతి వింత 

ఈ అంకురం       ఒక ఉత్తేజం
                    ఒక చైతన్యం
                    ఒక యువ తరంగం
                    ఒక ఉద్యమం 
                    ఒక హెచ్చరిక 

అవినీతి పూసుకున్న నేతలారా... 
మాటలు ఆపండి... చేతలు చూపండి.
ఈ దేశం లో కూడా ...
ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు !!
మీ మెడలు వంచగలరు !!

జయహో భారత్ ప్రజ,  జైహింద్.

మల్లాది లక్ష్మణ కుమార్.

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఖర నామ ఉగాది శుభాకాంక్షలు


ఈ ఉగాది పచ్చడి మీకోసం. తీరిగ్గా తరువాత పలకరించుకుందాం, ముందు స్నానం చేసి వచ్చి, ఈ కుంకుమ నుదుటిన ధరించి ఈ పూలతో పూజ చేసి, పచ్చడి రుచి చూడండి.

ఉగాది పండుగ వచ్చింది
                  ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
                 బాజాలయ్యాక పూజలు
ఊరేగింపు ముగిసాక
                 ఉత్సవాలు  జరిగాక
పంచాంగాలను చదివి
                  మంచిచెడ్డలు విన్నాము!
(మాగంటి.ఆర్గ్ నుంచి)

ఈ నవ వసంతం మీ జీవితాలలో నవ ఉషస్సులు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ప్రశాంతత నెలకొనాలని ఆ దేవ దేవుని ప్రార్ధిస్తూ....       ఖరనామ ఉగాది శుభాకాంక్షల తో ....

ఈ సందర్భం గా క్రితం సంవత్సరం "వికృతి" లో నేను ఈ భాగ్ముఖం గా ఇచ్చిన తెలుగు సందేశాన్ని, మళ్ళీ మీకోసం : (అప్పటికి నా ఈ బ్లాగు జనాల్లోకి రాలేదు)

 మళ్ళీ కొత్త  తెలుగు సంవత్సరం వచ్చేసింది!

తెలుగు తెగులు పట్టిన వాళ్ళకి ఇది ఒక పిండివంటల పండుగ (ఒక శెలవు) మాత్రమె కాని మన సంస్కృతీ సంప్రదాయం, దాని సొగసులు, సొబగులు ఏవి పట్టదు! ఇలాంటి/మీలాంటి వాళ్ళ కోసం ఈ వికృతి నామ సంవత్సరం లో ఒక ఝలక్!!!

భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో తెలుగు లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని . ఇంగ్లిషు  ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ. సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే .......
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్
ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్
ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్
ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు
ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం (ఇప్పటి సమాధానం - జై తెలంగాణా నా , జై ఆంధ్రా నా)

ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.

అదే, శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...
దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!

ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి..

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు - ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)
అందుకే, తెలుగువారికి అజరామరమయిన, అనిర్వచనీయమయిన భాషా సంపత్తిని వదిలి వెళ్ళిన తెలుగు కవులకు, రచయితలకు పాదాభివందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఈ సంవత్సరం అన్నా... 

తెలుగును మరవకండి, 
తెలుగును ప్రేమించండి, 
తెలుగువారిగా జీవించండి,
గర్వించండి.

మీ అందరికి ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ లోగిళ్ళు కలకాలం పచ్చగా సుఖశాంతులతో వెల్లి విరియాలని మీ జీవితాలు శుభప్రదం కావాలని మనసార కోరుతూ

మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది .






31, మార్చి 2011, గురువారం

మీకు ఒక బ్రహ్మానంద భరితమయిన సన్నివేశం చూపిన్చదలుచుకున్నాను. ఈ క్రింది చిత్రం చూడండి:

చిక్కాడు చేతిలో బావ  
ఒకాయన వేరొక యువకుని చేతిలో గోరింటాకు దిద్దుతున్నాడు. ఆ సన్నివేశం ముగ్గురూ ఆస్వాదిస్తున్నారు, ఆ భావాన్ని మొహం లో చూపిస్తూ.

విష్యం ఏమిటంటే, కుడి పక్కనున్న శంకరానికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆ హడావిడిలో బావ సుబ్రహ్మణ్యం (ఎడమ) ఇతని చేతిలో సరదాగా....  ఇలా గోరింటాకు పెడుతూ మూడో కంటికి చిక్కాడు. వెనక చిరునవ్వులు చిందించే ఆయన ఇంకొక బావ, అయన పేరు కూడా సుబ్రమణ్యం , కాకపోతే ఘనాపాటి గారు.

ఈ సన్నివేశం లో వీళ్ళ మోముపై చూపించిన బ్రహ్మానంద భరితమైన భావాలు నాకు బాగా నచ్చి ఈ చిత్రాన్ని మీ వరకు తీసుకొచ్చాయి.


ఈ చిత్రానికి మీ వ్యాక్యాలు హాస్యభరితం గా తెలియచేయండి. ఈ పెళ్ళికొడుకు కు కానుకగా నేనన్దిస్తాను.

ఉంటాను
లక్ష్మణ కుమార్ మల్లాది.

24, ఫిబ్రవరి 2011, గురువారం

చిన్నారి బుడుగు ఏడుస్తున్నాడు !!



తెలుగు భాష కి యెనలేని సేవలు చేసి మాలాంటి వారికి భాష మీద మక్కువ పెంచి తన చుట్టూ తిప్పుకున్న మహా మహుడు, రచనారావిన్దుడు, మన ముళ్ళపూడి వెంకట రమణ గారు దూర లోకాలు చేరారు. ఇక బాపు బొమ్మ ఏ బుడుగు తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, కబుర్లు చెప్పుకుంటుంది??

పాపం చిన్నారి బుడుగు ని దగ్గరకు తీసుకోండి, లాలించండి, మీ గుండెల్లో పెట్టి పెంచుకోండి.

ఆ ఆంధ్రాగ్రేసరునికి నివాళులతో

లక్ష్మణ కుమార్ మల్లాది.

ఆ రోజుల్లో ... రేడియో లో...

నిన్న దృశ్య శ్రవణ పెట్టె (అదేనండీ టెలివిజన్) చూస్తూ మీటలు మారుస్తూ అనుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమం లో సూర్య భగవానుని పూజల గురించి చెపుతుంటే ఆసక్తిగా చూస్తున్నాను. చివర్లో సూర్య నారాయణుని సుప్రభాతం వినిపించారు.  ' శ్రీ సూర్య నారాయణా  ... మేలుకో... హరి సూర్య నారాయణా .... అంటూ మొదలవుతుంది. 

నా పాత పుటలలో రాసినట్లు గా  భక్తిరంజని, ఆకాశ వాణి లో వినిపించే మధుర రాగాల గానలహరి వెంటనే గుర్తోచ్చేసింది. సూర్యుని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది.

"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."

అంటూ పొద్దు పొడుస్తున్న సూర్య బింబాన్ని వర్ణించటం మధురానుభూతి నిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు  మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడి ఛాయ ... "    అంటూంటే నేను నిజం గా నా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను.  చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం రేడియో లో వినపడే వందేమాతరం తో నే తెల్లారేది. అప్పటికి లేచి దంతధావనం కానిచ్చే లోపల నాద స్వరం, ఆంగ్ల వార్తలు అయిపోయి ఆ రోజు భక్తిరంజని కార్యక్రమం  లో ఏం వస్తుందో నని ఉత్కంత గా ఉండేది. వారాన్ని బట్టి వివిధ దేవతలా స్తోత్ర తరంగిణి వినిపించే వారు. వోలేటి వెంకటేశ్వర్లు గారి భజగోవిందం, బాలాంత్రపు వారి సూర్యాష్టకం, పైన చెప్పిన సూర్య నారాయణ స్తోత్రం బృంద గానం, రామా రావు గారి హనుమాన్ చాలీసా, శివ స్తుతి, మధురాష్టకం (మధురం మధురం అంటూ యెంత మధురం గా వినపదేదో), బాల మురళి తత్వాలు, రామదాసు కీర్తనలు, శ్రీరంగం గోపాలరత్నం పాటలు, మల్లిక్ గారి రాజ రాజేశ్వరీ స్తోత్రం... అలా అన్నీ మధురాలే.

మల్లిక్ గారి స్తోత్రం మంద్రం గా పవిత్రం గా రాగ యుక్తం గా వాయులీన నేపద్యం లో వినపడుతుంటే రోజు మొదలెట్టటం చాలా ఆనందం గా ఉండేది. చాలా అరుదుగా ఈ మధ్య దీన్ని ప్రసారం చేస్తున్నారు. దాన్ని వింటూ గతం లోకి పరుగెత్తటం బాల్యానందాన్నిస్తుంది.

ఈ కార్యక్రమం తరువాత పొలం పనులు, వెంటనే ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వచ్చేవి. మధ్యలో ఎక్కడో సంస్కృతం లో కూడా వార్తలు ఉండేవి. "ఇయమాకాషవాని! సంప్రతి వార్తః సుయంతం, ప్రవాచికః బలదేవానంద సాగరః" అంటూ వణుకుతూ వుండే గొంతు తో ఆ పెద్దాయన వార్తలు చదువుతుంటే ఏమిటో ఆ చిన్న వయసు లో కూడా ఏదో కొత్తది వినేస్తున్నాననిపించేది. "ఆగచ్చ! ఉపనిష్!" అంటూ పంతులు గారు చెప్పే సంస్కృత పాఠం తో పాటు, మా ఇంట్లో ఉదయపు ఉపాహారం తయారయ్యేది. చాలా రోజులు పెసరట్టు ఉప్మా లే మెను. అల్లం పచ్చడి  రుచి అదనం.

(ఆ భోగం కూడా ఎంతమందికి వుంటుందో .. అదృష్టవంతులు.  పచ్చిమిరపలు ,  అల్లం, జీలకర్ర  జమాయించి చేసి వేసిన పెసరట్టు  రుచి  విజయవాడ బాబాయి హోటల్లో తప్పితే వేరే  చోట  దొరకగాలదంటారా  .. ఈ రోజుల్లో   అదికూడా  అందని ద్రాక్ష అయిపొయింది.  మరుగున పడుతున్న తెగులుపట్టిన  తెలుగు లాగా. మొన్నామధ్య  ఓ చుట్టం  పెళ్ళిలో అల్పాహారం గా పెసరట్టు ఉప్మా పెట్టిస్తే, వేడి వేడి గా అందరూ సుబ్బరంగా సుష్టు  గా లాగించేసి ఈ ఆలోచన చేసిన ఆయన్ని మనసులో అభినందిన్చుకున్నారు.)

అది తిన్న వెంటనే మేం బడికి వెళ్ళే సమయం అయ్యేది. ఎనిమిది గంటల తరువాత వచ్చే ఈ మాసపు పాట, ఇతర కార్యక్రమాల మధ్యలో వచ్చే లలిత గీతాలు తెలుగు నుడికి, వడి కి , సరళమైన పదాల్లో కుదించి చెప్పే భావ ప్రకటన అనన్య సామాన్యం. దేవులపల్లి, బాలాంత్రపు రజని, నండూరు సుబ్బా రావు, దాశరధి వంటి మహనీయుల గీతాలు హృద్యం గా ఉండేవి. ఇక తొమ్మిది గంటల తరువాత, మధ్యాహ్నం పన్నెండు తరువాత వచ్చే శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాంతీయ కళాకారుల తో సంపన్నం అయ్యేవి. అవి వింటూ తేనీరు తాగుతూ చదువుకుంటూ ఉండేవాడిని. కార్మికుల కార్యక్రమం, ఒకటిన్నరకు స్త్రీల కార్యక్రమం, సాయంత్రం యువజనుల కార్యక్రమం దేనికదే విభిన్న కార్యక్రమాల సమాహారం గా అలరించేవి.

ఆ కార్యక్రమాలే కాకుండా వాటి మొదలులో వచ్చే నేపధ్య బాణీలు దేనికవే ప్రత్యేకం గా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే విధం గా ఉండేవి.  మీరు కనక వాటిని వింటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. యెంత బాగుండేవో కదూ. చిన్నక్క ఎకంబరం కబుర్లు, ఉషశ్రీ ధర్మ సందేహాలకి సమాధానాలు, బాలానందం లో రేడియో అక్కయ్య ముచ్చట్లు, పల్లె పదాలు, జానపద బాణీలు, స్త్రీల పాటలు, మధ్య మధ్యలో అలనాటి వెండితెర పాటలు, ఆ నాటి కొత్త పాటలు... వ్యాఖ్యాతల చతురతలు...  ఆదివారం మధ్యాన్నం నాటకం కోసం ప్రత్యేకం గా ఎదురు చూసేవాన్ని. (టెలివిజన్ వచ్చిన కొత్తలో చిత్రలహరి కోసం చూసినట్టుగా) నండూరు సుబ్బా రావు నాకు ఇష్టమైన నటుడు. ఆయన వాచికం ఇంచుమించు జగ్గయ్య గారి వాచికం లా తాజా గా ఉండేది. కృష్ణ మూర్తి - కుక్కపిల్లలు అన్న నాటకం లో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ నా చెవుల్లోనే వుంది.

ఇక వార్తల విషయానికొస్తే, ధిల్లీ వార్తలలో అ అ అ ... ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది ..." అంటూ తడబడుతూ మొదలెట్టే కందుకూరి సూర్యనారాయణ, ఎవరో తరుముకొస్తున్నట్టు చదివే అద్దంకి మన్నార్, ఇలియాస్ అహ్మద్, ఏడిద గోపాల రావు, ప్రాంతీయ వార్తలు చదివే కోక సంజీవ రావు, కొప్పుల సుబ్బా రావు, వ్యాఖ్యాతలు పాలగుమ్మి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మల్లాది సూరి బాబు ఇత్యాది మహా మహులందరూ నా జ్ఞాపకాలలో ఇంకా పదిలం గా ఉన్నారు.

ఈ తలపులన్నీ గురుతుకు రాగా ఇందాకే అంతర్జాలం లో అలనాటి భావ/లలిత/భక్తీ గీతాలకై వెతుకులాడాను, మళ్ళీ విందామని లేదా పొందుదామని. కొంతవరకు మన తెలుగు వీధి గుమ్మాలలో (అంటే సైట్లలో అని కవి హృదయం) రా రాజు అని నేననుకునే "మాగంటి.ఆర్గ్" లో విని నా జ్ఞాపకాలని తాజా గా ఉంచుకున్నాను.  మీరూ ఆ వీధి వాకిట్లో వుండే గోవు వెనక ఆ ఇంట్లో కి చేరి అలరించే వీటిని చదివి, విని ఆనందించ గలరని భావిస్తూ..

ఇంకొక్క మాట...   పైన చెప్పిన వాటిలో మీ వద్ద ఏదైనా దొరికితే నాకు పంప గలరని అర్ధిస్తూ , మళ్ళీ ఆలస్యం చేస్తే రాయటం మరిచి పోతానని మీకు సమర్పిన్చేసుకున్తున్నాను.

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

'సరస వినోదిని - సమస్యా పూరణం'

మన తెలుగులో మాత్రమె ఉన్న సాహితీ ప్రక్రియలలో ఒకటి  'అవధానం '  అని చాలా మంది భాషా వేత్తలు సెలవిచ్చారు. ఇప్పటివరకు ప్రత్యక్షం గా వీక్షించలేక పోయినా, మన ప్రసార మాధ్యమాల వలన కొంతవరకు ఆ ప్రక్రియ ప్రాశస్త్యాన్ని తెలుసుకోగలిగాను. ప్రస్తుతం ఉన్న శతావధాను లలో ప్రముఖులు  గరికపాటి వారు, మేడసాని మోహన్ గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, రాల్లభండి కవిత ప్రసాద్ గారు ఇంకా అలా అలా....

నేను ఒక వార్తా పత్రికలో చదివి దాచుకున్న కొన్ని పద్యాలు ఇటీవల మళ్ళీ చూడటం జరిగింది. బ్రహ్మశ్రీ మేడసాని మోహన్ గారు చేసిన ఒక శతావధానం లో (తొంభై లలో జరిగింది అనుకుంట) పలికిన కొన్ని పద్యాలు ఇవి. మీరూ పరికించి ఆనందించండి. తెలుగు భాష సొగసు, సొబగులు మీరు కూడా గ్రోలండి:

- నడ్డి, మెల్ల, గూని, గారపండ్లు ఈ శబ్దాలతో పద్యం రాయమని కోరినపుడు :

ఒకట గనన్ వరూధిని ఉన్నదో లేదొకో 'నడ్డి', ముక్కునన్
ప్రకటిత చంపక స్ఫురణ భాసిలు నాక్రమ'మెల్ల', కన్నలన్
వికస వనౌజ పత్రముల ఎల్లడారన్ బెడ'గూని', వీపు వి
శ్వకలిత మారుపేట విరజాజుల వెన్నల 'గార పండ్లు'నై

-సైకిలు, రిక్షా, ఆటో, మోటారు ఇత్యాదులైన వాహన శబ్దాలతో పద్యం:

ధాటీ భాసుర లీల 'సైకిల' కిల ధ్వానమ్ము లేపార వా
గ్ధాటిన్ మించినయట్టి ఫల్గుణుడు క'రిక్షా'న్తిన్ నివారించి తా
'నాటో' పమ్మును జూపె గోగ్రహణ వేలాక్రాంత విభ్రాంతియే
'మోటారె'త్తెను  చిత్త మత్తమునకున్ మోదంబు పారమ్మునన్.

- ప్రేక్షక హృదయాలు దోచిన చలన చిత్ర తారలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున శబ్దాలు ఉపయోగించి:

స్థిర దీర్ఘంబగు వాలముంగల్ 'చిరంజీవీ' భవత్ సత్క్రుపా
ఝరి వర్షింపుము రాక్షపోరు లహరీ! జం'బాల క్రిష్ణ'క్రియా
సరస శ్రీకర 'వెంకటేశ' పదసంచారా! హనూమంత వా
నర ముఖ్యా! దను జొళి గూర్చెదవు పు'న్నాగార్జున'శ్రేణిగన్

ఇక సమస్యా పూరణం లో 'సతికి మెట్టెల కంటే మీసములె అందం' అన్న సమస్యను పూరించిన విధము:


హాస్య ప్రసంగ వేళా
వ్యాసాంగ వచః ప్రసంగ మప్పటి సుఖమున్
వేసారి చూచుకో పతి
'మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్'

ఇవండీ ఆ విశేషాలు.  మీకు నచ్చాయని భావిస్తూ... అచ్చు తప్పులుంటే క్షమించమని ప్రార్ధిస్తూ...
శుభం భూయాత్.

మీ
మల్లాది లక్ష్మణ కుమార్













26, జనవరి 2011, బుధవారం

ప్రసాదం భక్తులు

మనం గుడికి వెళ్ళిన  ప్రతీసారీ ప్రసాదం దగ్గర కొచ్చేసరికి కొంతమంది ఏదైనా తీసుకుంటారు. కొంతమంది శుభ్రత, రుచి, ప్రసాదం లో రకం (పులిహోర, దధ్యోజనం, పొంగలి లాంటివి) చూసి తీసుకుంటారు.  కొన్ని చోట్ల ఏ రకమైన ప్రసాదం అయినా దాని రుచే రుచి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటివి అన్నమాట. తిరుపతి లడ్డు "ఆహా మహా ప్రసాదం, ఏమి రుచి" అనుకుంటూ దేముడంటే పడని వాళ్ళు కూడా లాక్కుని, తింటారు. ఈ రోజుల్లో కొంచెం సహజ లక్షణాలు తగ్గినా, ఒక తునక అయినా చాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళినపుడు, మా తాతయ్య వరసయే ఒకాయన అక్కడ పని చేస్తూన్దేవాళ్ళు.  అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా దర్శనం పైన అవరోధాలేమీ లేవు. దేవుని దగ్గర కొంతసేపు అలా నిన్చున్దబెట్టారు. ఇక ప్రసాదమైతే, ఒక పెద్ద బుట్టలో చక్కర పొంగలి, దోశలు, వడలు లాంటివి అనేకం తెచ్చి ఇచ్చారు.  ఈ ప్రసాదం రుచికరమైన ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని చూసే వాళ్ళని "ప్రసాదం భక్తులు" అని నామకరణం చేశాను. వీళ్ళు గుడికి దాదాపు ప్రసాదం  కోసమే, (కొంచెం భక్తి తో కూడా) వెళ్తారు.

ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే, నేను కూడా ఆ ప్రసాదం భక్తులలో ఒకణ్ణి.  చిన్నప్పుడు బందరు లో కృష్ణా రావు గారి బళ్ళో చదివేప్పుడు (బందరు బచ్చుపేట లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండేది.) పుష్య మాసం (ధనుర్మాస) లో రోజుకొక్క తరగతి నుంచి ప్రసాద వినిమయం కోసం పిలిచేవారు. మా వరుస ఎప్పుడొస్తుందని ఆత్రం గా చూసే వాణ్ని. ప్రసాద మంటేనే కొద్దిగా పెడతారు. అందుకే దానికి ఆ రుచి వస్తుందేమో. అయినా, వరుసలో ఒక ఆకు (మర్రి అకో మరి ఏదో  గుర్తు లేదు) పుచ్చుకుని వేడి వేడి తీపి పొంగలి నోరు కాల్చుకుంటూ తినటం నాకింకా గుర్తే. అక్కడ కళ్యాణ మంటపానికి పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి. చెప్పాలంటే అంత పెద్దవి కాదు కానీ అప్పటి నా వయసుతో పోల్చుకుంటే పెద్దగా అనిపించేవి. ఎక్కటానికి కష్ట పడే వాళ్ళం. వాటిమీదేక్కి ఆడుకోవటం ఇంకొక మంచి జ్ఞాపకం.  విషయం మారి నా పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతున్నాను...

ఆ తరువాత నేను పెద్దయ్యాక గుడికి వెళ్ళినపుడు, ప్రసాదం పుచ్చుకోవటం అనేది చాలా అరుదుగా జరిగింది. అక్కడి శుభ్రతా, పెట్టే వాడి శుభ్రతా అన్నీ చూసి తిన బుద్దయ్యేది కాదు.  ఆ మధ్య ఒక గుడిలో (బ్రాహ్మల నిర్వహణ లోని గుడి) మా బావమరిది తో వెళ్ళినపుడు 'గారి' ప్రసాదం పెట్టబోతే ఆ ఇచ్చే అయన మా వాణ్ని 'ఏమండీ ఆయన బ్రాహ్మలు కాదా' అని అడిగాడుట.

కానీ ఈ మధ్య ఈ చెన్న పట్నం లో నంగనల్లురు లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిని ఒక స్నేహితుడు పరిచయం చేసాడు. (ఆయనను 'భక్తుడు' అన్న పొట్టి పేరు పెట్టేసాను.ఈ భక్తుడు కూడా ప్రసాదం భక్తుడే) అక్కడ ప్రసాదం గురించి ప్రత్యేకం గా చెప్పాలి. పొంగలి గానీ పులిహోర గానీ, రవ్వ కేసరి, తీపి పొంగలి కానీ ...  ఆహా యెంత రుచి గా ఉంటుందండీ. మంచి నెయ్యి కారిపోతూ యమ రుచిగా వుంటుంది. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి, నా శుభ్రతా పరీక్ష లో కూడా అది నెగ్గింది. చాలా శుచిగా, మడిగా తయారు చేస్తారు. చెన్నై లో నేను చూసిన దేవాలయాలన్నిటి లోనూ ప్రసాదం చాలా రుచిగా వుంటుంది. అన్నిటిలోకీ ఈ గుడి ఇహ చెప్పకర్లేదు.

అందుకని ఈ మధ్య నేను మళ్ళీ ప్రసాదం భక్తుడ నయిపోయి, దాని కోసమే గుడికి వెళ్లి ఒక చుట్టు తిరిగి, దేముడికి ఒక నమస్కారం పారేసి (భక్తి తోనే అనుకోండి) ప్రసాదం వరుసలో నిలబడి పోతున్నాను. ఒకోసారి, రెండవ సారి కూడా. (ప్రసాదాన్ని బట్టి)

మీరుకూడా, దేముడేవరైనదీ కాకుండా భక్తి తో ప్రసాదం భక్తులుగా మారిపోండి.

ఉంటాను

మీ
మల్లాది లక్ష్మణ కుమార్.

22, జనవరి 2011, శనివారం

ఉద్యోగ పర్వం లొ కిష్కింధ కాండ!!

మా గొండా జీవితం లొ మరొక మరిచిపొలేని జ్ఞాపకం ఇది. చలి కాలం లొ సరదాగా ఉదయాన్నె లెచి మిత్రులు శివ ప్రసాదు, రమెష్ లతొ ఉదయం నడకకి వెళ్ళే వాళ్ళం. అలా ఊరి బయటి దాకా వెల్లి ఒక ఘంట సేపు తిరిగొచ్చె వాళ్ళం. ఉదయన్నె కటిక మంచు (కటిక చీకటి  లాగా,  అంటే దట్టమైనది అని అనుకొండి ) లొ ప్రకృతిని చూస్తూ అస్వాదిస్తూ చల్లదనాన్ని గొంతు నిండా  నింపు కుంటూ , (తరువాత జలుబు వలన నానా ఇక్కట్లు వచ్చెవనుకొండి) కబుర్లు చెప్పుకుంటూ వెడితే యెం మజా గా ఉందెదొ...

ఒక రొజు మంచు తెరల మాటున మన శివుడు ఒక అద్భుతాన్ని చూసాడు: యెమిటంటారా...

ఒక తొట... మన అంధ్రులకు ఎంతగానొ ప్రియమైన శాకం, మాయాబజార్ లొ కూడ "శాకంబరీ  దేవి వర ప్రసాదం,ఆంధ్రుల వంట.. అది లేకుండా ప్రభువులు ముద్దైనా ముట్టరు" అని అనిపించుకున్న మన గొంగూర.

అక్కడ వున్న రొజుల్లొ రమారమి సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మన అంధ్రా కేసి వచ్చె వాళ్ళం. ఇష్టం అని పచ్చళ్ళు యెంత పట్టికెల్లినా రెండు నెలల లొపే తాజా దనం పొయి అరుచి కలిగెది. తాజా గా చేసుకుందాం అంటె దొరకని స్థితి. ములక్కాడలూ అంతే, అస్సలు దొరికెవి కాదు. ఒక రొజు బజారులొ కనిపించాయి అంటె ఇహ మనవాళ్ళందరికీ చెప్పి తొలుకెళ్ళెవాళ్ళం. అవీ చాలా లేతగా 5 లెక 6 అంగుళాల  సైజులొ దొరికేవి.

ఈ తాయిలం కనిపెట్టిన శివ ప్రసాదు, వాళ్ళావిడ  తొ చెప్పేసాడు , మేము  ఒక ఖజానా ని చూసామని. ఇంకెముంది, జనాలంతా పెళ్ళాలని, వచ్చిన వాళ్ళు పిల్లలని వెంటేసుకుని ఒక ఉదయం ఆ గొంగూర చెను మీద పడ్డాము. కల్లు తాగిన కొతి వనమంతా చెరిచిందనీ... వానరులు కిష్కింధ వనం అంతా నేల మట్టం చెసినట్టుగా.. అసలె వాళ్ళు నారు కొసం పెంచినట్టున్నారు, అవి గొంగూర వ్రుక్షాలయినాయి. ఆ వ్రుక్షాలన్నీ మోడు చెసి, విరక్కొట్టి, కొసుకున్న వాళ్ళు కొసుకున్నంత తెచ్చెసుకున్నారు. దాంతొ పులుసె పెట్టుకొ, పచ్చడె చెసుకొ, పప్పె వండుకొ, ఉన్నన్నళ్ళూ వారం పది రొజుల పాటూ గొంగూర సంతర్పణ చెసుకున్నాం.

నేనుకూడాఈ వానరుల్లొ ప్రముఖుడినే  అని చెప్పటానికి  మిక్కిలి సంతొషిస్తూ, ఎండ  మావుల్లొ నీటి  చెలమ లాగ మాకు ఆ వనాన్ని తెలియ కుండా అంకితం చెసిన అజ్నాతుడికి ధన్యవాదాలు చెపుతూ...

ఇంకొ విషయమండోయి , ఈ కొతి పనికి అలవాటు పడి  కొన్ని రొజుల తరువాత వెల్లిన మాకు చుక్కెదురైంది. యెవరొ కాపలా మనిషి తిట్టినంత  పని చేయటం తొ అటుకేసి వెళ్ళటం మానుకున్నాం.

ఈ కిచ కిచలు మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలు వ్యాఖ్యలలొ తెలియ చేయండి.

మీ
మల్లాది లక్ష్మణ కుమార్




21, జనవరి 2011, శుక్రవారం

ఉద్యోగపర్వం లో హిందీ వేట

రామాయణం లో పిడకల వేట లాగ,నా ఉద్యోగ పర్వం లో హిందీ వేట బాగా జరిగింది. ఇవ్విధంబెట్లనిన:

నాకు హిందీ భాషా రానేరాదు నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో.  మా బ్యాంకు ఉత్తర దేశం లో కేంద్రీక్రుతమయినందువలన శిక్షణ కోసం జబల్పూర్, భువనేశ్వర్, కలకత్తా, చండీగర్ ఇత్యాదులైన ప్రదేశాలకి వెళ్ల వలసి వచ్చేది. దూర ప్రయాణాలు చేయటం అలవాటు లేని పని. ఎలాగైతేనేం, మొదటిసారి జబల్పూర్ వెళ్ళే పని పడింది 15 రోజుల శిక్షణ కోసం. అర్ధరాత్రి గంగా కావేరి రైలు పట్టుకుని మొదటి తరగతి లోకి అడుగుపెట్టాను. నా కూపే ఏదో కనుక్కోవటం తెలియకపోవటం వలన మిగిలిన వారిని నిద్ర లేపి తిట్లు తినవలసి వచ్చింది. ఒక పెద్దాయన నా అవస్థ గమనించి, నాయనా, కొత్తా ఏమిటి అని, పెట్టె తలుపు మీద వున్న అక్షరాలను గమనించి నీ సీటు చూసుకో అని నన్ను వోదార్చాడు.

తెల్లారింది, నాగపూర్ చేరాము. లేచి దంతధావనం చేసుకునేసరికి, పక్క పెట్టె లోనుంచి  (పెట్టె అనగా, కూపే అని కవి హృదయం) చక్కని సంగీతం, తబలా వాదన సన్నగా వినిపిస్తోంది. ఏమిటా అని చూద్దును కదా, హిందుస్తానీ సంగీతం ఏరులై పారుతోంది.  ఒక తమిళ జంట, ముచ్చటగా ఉన్నారు, సంగీత ప్రేమికులనుకుంట! ఒక ఉత్తర దేశపు పెద్దాయన తబలా ముందేసుకుని కూర్చుంటే, వీళ్ళు కర్నాటకాన్ని, హిందుస్తానీ ని కలగలిపి సమయాన్ని గడుపుతున్నారు. కాసేపు వాళ్ళ దగ్గరే కాలక్షేపం చేసాను. అక్కడే ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాధన్ ల "రంగులు" (colours) అనే కాసెట్ చూసాను. తరువాత కొని విని ఆనందించాను అనుకోండి. కాసేపు డైరీ (అప్పట్లో అదో వింత ప్రపంచం నాది) రాసి, వచ్చే పోయే స్టేషన్లు చూస్తూ కూర్చున్నాను. మొదటిసారి కావటం తో నాలో ఆత్రుత మొదలయింది, శిక్షణా కేంద్రానికి ఎలా వెళ్ళాలా అని, తోటి ప్రయాణీకుడిని అడిగితె, వెళ్లేసరికి రాత్రి 11 అవుతుందని , పైగా  ఆ  రోజు  హోలీ పండుగ, హడావిడిగా ఉంటుందని, తన వాహనం లో గమ్యస్థానం చేర్చాడు.

ఇక్కడ చూడండి చమత్కారం. అక్కడ వృత్తాకారం లో ఉన్న గదుల మధ్య భోజనాల బల్ల ఇతర సామాన్ లు ఉన్నాయ్. కొన్నిటి మీద "సౌచాలయ" అని రాసి ఉన్నది. మామూలుగా హిందీ లో 'సోచనా' అనగా ఆలోచించటం గదా అనుకుని అవి కార్యాలయ గదులేమో అనుకున్నాను. నాతొ పాటూ ఇద్దరు తెలుగు మేకలు (బకారాలన్నమాట) కూడా వచ్చారు. వారికీ హిందీ రాదు. ఉదయం లేచి కాలకృత్యాల కోసం వెతుకుతుంటే, అక్కడి పనివాడు నాకు ఈ 'సౌచాలయ' చూపించాడు. ఇవి తరగతి/కార్యాలయాల గదులు కదా బాబూ అంటే, నన్నొక వెర్రి చూపు చూసి, తలుపు తెరిచాడు. చూద్దును గదా పాయిఖానాలు. ఇహ చూసుకోండి! మిత్రులంతా ఈ విషయం చెప్పుకుని నేనక్కడ ఉన్నన్నాళ్ళూ ఏడిపిస్తూనే ఉన్నారు. 

ఎలా ఉన్నదంటే, వెనకటికో సహోద్యోగి, (హిందీ బాధితుడే) నాగపూరు వెళ్లి, రిక్షా మాట్లాడుకుని, వాడు మూడు వేళ్ళు చూపించి తీస్, తీస్ (చాలా సంవత్సరాల క్రితం లెండి, ఇప్పుడు ౩౦౦ అన్నట్టు) అంటే మనవాడు తీన్ ని గుర్తు తెచ్చుకుని, హుశారుగా ఎక్కేసాడు. తీరా వెళ్ళాక, విషయం అర్ధమై వాడితో హిందీ లో పోట్లాడలేక,   డబ్బులిచ్చి వదిలించుకుని, తిన్నగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసాడుట.

ఈ విష్యం ఇలా వుంటే, అక్కడ ఉన్నన్నాళ్ళూ  నా పని పోకచెక్క లా తయారయింది. వాళ్ళ భాష అర్ధం కాదు, తిరిగి చెప్దామంటే, చెప్పలేను. ఆ కార్యక్రమం ముగిసే సరికి, కొంత మటుకు హిందీ లో పండిట్ ని అయిపోయానంటే నమ్మండి. ఇక ఈ గొండా లోకి వచ్చి పడేసరికి, చాలా వరుకు వ్యవహారిక భాష పట్టుకోగలిగాను. కానీ ఇక్కడ ఇంకో చిక్కొచ్చి పడింది. ఈ భాష వేరొక యాస(భోజ్పురీ) లో వుండటం వలన, వాళ్ళు పూర్తిగా సత్తెకాలపు మనుషులవటం వలన, పాలబ్బాయి, కూరలబ్బి, పనివాళ్ళు ఏమి మాట్లాడిన ఉత్తినే వూ కొట్టి తలూపటం, అర్ధమైనట్లు నటించటం చెయ్యాల్సి వచ్చేది.  వాళ్ళెంత సత్తేకాలం వాళ్ళంటే, నాకు హిందీ రాదురా మొర్రో అంటే వీడేమిటి ఈ భారత దేశంలోనే పుట్టాడా అని వింతగా చూసేవాళ్ళు. మా మిత్రులంతా కలిసి వాళ్ళముందే సుభ్భరంగా తెలుగులో ఎల్లి మీద పిల్లి, పిల్లి మీద ఎల్లి అని చెప్పుకునేవాళ్ళం, వీళ్ళకు యెలాగూ  తెలియదుగా అని.

కొంత   మటుకూ ఇదీ విష్యం. మరికొంత మళ్ళీ గుర్తొచ్చినపుడు, వీలయినపుడు, సమయం చిక్కినపుడు...

ఉంటానండీ,
మీ
మల్లాది లక్ష్మణ కుమార్