చక్రి - కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చక్రి - కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2013, ఆదివారం


ఇంకొన్ని చక్రి కవితలు:

చడి చప్పుడు లేకుండా ఎప్పుడు ఎలా చేరి ఒదిగానో 
ఆకలి తాపాలు వేధిస్తే వేగలేక  తనువు మరచానో 
తడబడుతూ పడిలేస్తూ అందుకే  ఇలా ఎదిగానో 
తెలివి తెచ్చుకు నిలువెత్తు తెర దిమ్పుకున్నానో  
విధి మేర వింత కలబోత  తలదాల్చుకున్నానో 
మలి వేళన తెలిసి నిశ్చేష్టత అలము కుంటానో  
కలత నిదుర లో కలలని అన్వయిస్తానో  ?!!

      *               *                *

నీ అస్థిత్వానికి అనంత సాక్షి నేను
నీ ఆగమనాభిలాషి ఆతిధ్యము నేను   
నీ అనంత చెరగుల ఆధారమూ నేనే 
నీ  సవ్వడుల వెన్నంటి వచ్చేది నేనే  
నీవు నన్ను చీల్చుకు రావాలి 
నేను నిన్ను కమ్ముకు రావాలి 
నా బాహువుల్లోనే నీవు ఆడుకోవాలి 
నా కౌగిలిలో నీతో దోబూచులాడాలి 
ప్చ్ కానీ నీవెంటే  నేను కనుమరుగవ్వాలి 
ఇది విరామరహిత విన్యాస  కేళి 
ద్రష్ట దృష్టుల నవరస జావళి 
ఈ ఆనందమేనా  దీపావళి !!

ఉగాది కి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని ఆశిస్తూ 

16, జనవరి 2013, బుధవారం

చక్రి - కవితలు


కొత్త సంవత్సరం లో రాఖరఖాలుగా రాద్దామని అనుకున్నాను కానీ ....   కాలేదు.
ప్రస్తుతానికి క్రింది కవిత, అదీ మా చక్రి రాసినది, చదివి ఆనందించండి.

ప్రతి క్షణం మనసుని కాంతిమయం చెయ్యాలి ట
కానీ మరుక్షణమే చీకటి అలుముకుంటుంది ట
ఎవరి బ్రతుకు పుటలకు వారే రంగులద్దాల ట
తమ చేతలతో తామే మాపుకుంటారు ట
గతమయ్యే రేపు, జ్ఞాపకమయి మరపుకొంటారు ట
వెను తిరిగి చూస్తే మసక బారిన వెలుగు రేఖలు ట
నలిగి వెలిసి వసి వాడిన రంగు పూ సోబగులు ట
ఆ నోట ఆ నోట అన్నారు ట విన్నారుట ట వింటారు ట!!
అవి వెలిగి రంగులిడినవో
నలిగి మసి నలుముకున్నవో
మౌన రాగాల మూగబోయినవో ?!!

పలు భావనల సమాహారం మా చక్రి కవితలు. నాకెంతో ఇష్టమైన కవితలు మీకు కూడా పరిచయం చేస్తున్నాను.

తరువాత తీరిగ్గా కలుద్దాం.

సెలవు.

మల్లాది లక్ష్మణ కుమార్ 

20, జనవరి 2011, గురువారం

నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు

మా చక్రి సంక్రాంతి శుభవేళ కొత్త సందేశం ఇచ్చాడు. మరిక అదేమిటో చిత్తగించండి:
                                                        *       *      *
నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు
ఆనాటి కానాటి
సామ్రాజ్యాలు సామ్రాట్టులు మటుమాయమయ్యే
రాజ్యాలు రాజులు పోయి రాతి గురుతులు మిగిలే
నవాబులు పటేళ్ళు తెరమరుగాయే
కామందులు కరణాలు కనుమరుగాయె
ఘోర కలికల్మషములు కాలగర్భము చేరె !
నాటికి నేటికి తెలుగు వెలుగుజూడ
పాంచ వేద మది నన్నయ్య తెనిగించు
రామాయణమున్ తిక్కన నిర్వచించు
సిరికిన్ జెప్పడంటూ శ్రీనాధు వర్ణించు
మందార మకరందమనుచు పోతన ప్రార్ధించు
సత్య భామనే యనుచు సిద్దేంద్రు నర్తించు
శ్రీరాము దయ చేతననుచు బద్దెన పలికించు
విశ్వదాభిరామయన్చు వేమన బోధించు
అదివో అల్లదివో అనుచు అన్నమయ్య మ్రొక్కించు
లెస్స లెస్సయని శ్రీకృష్ణరాయ శ్లాఘించు
పలుకే బంగారమాయెనా యనుచు గోపన్న లాలించు
ఎందఱో మహానుభావులన్చు త్యాగయ్య కీర్తించు
ఎల్లలెరుగని నీ విదుల భావమ్ముల మేలుగని నీ
సంక్రాంతికిన్ విశాలాంధ్రసుతుల్ సుఖమునొందు గాక
వేర్పాట్లు మరచి !!

(--భావము తప్ప వ్యాకరణ దోషములు గ్రహించ వలదని మనవి ) అని చక్రి తెలియచేసారు.
                                       *     *     *

మన తెలుగు వెలుగులు ఎల్లెడలా వ్యాపింప చేయు ఇటువంటి కీర్తనలే మనకు రక్ష. కావున దయచేసి మన భాషను విడదీయకండి. కిన్చపరచకండి. అభిమానించండి. సొగసును ఆస్వాదించండి.

ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, యాస ఏదైనా... 

"జై తెలుగు" అనండి.  తెలుగు తల్లికి నివాళు లివ్వండి.

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది.
(మీ అభిప్రాయాలను ప్రచురించటం మరచిపోకండి)


30, డిసెంబర్ 2010, గురువారం

అజ్ఞాత కవి

దయచేసి గమనించ గలరు, క్రింద ప్రకటించిన కవితా రచయిత నేను కాదు, మీ స్పందనలు chakri5@yahoo.com కి తెలుపగలరు.
* * *
ఎవరో?
తెలీనప్పుడు కోతివనుకొన్నాను,
అప్పుడే, గుండ్రాయిలా ఉంటె,
నిజమేననుకున్నాను.
ఒకరు పాడుతుంటే, పాటలా కూడా వుంటావా!
నాకు అర్ధం కాలేదు!
అదుగో,
కొండపైన,
నడుంపై చేతులేసుకొని,
నేనే! అని నించుంటే
ఎందుకో, నమ్మబుద్ది కాలా!
పోదురు! ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే,
ఏ దారిన వెళ్ళినా
దీపం పట్టుకు, వెలుగు చూపించటమే!
ఎవరూ? చూద్దామంటే,  ....  చీకటి.
ఎంతదూరమనీ? ఇలా!
వద్దులే! నాకనవసరం
ఎవరున్టేనేం, లేకపోతేనేం ,
అన్నాను!    కానీ,
అన్య భారమేదో, గుండెలపై ఉంచిన బాధ!
నా అమాయకత్వానికి, అసమర్ధతకు,
ఎక్కడో, చీకట్లో
జాలిగా ఏడ్చిన చప్పుడు!
ఇక, ఉన్నచోటునే
ఆగిపోయాను - అబ్బ! యెంత అలసట?
వెను తిరిగి చూసాను!
మార్గమంతా...
నలిగిపోయిన పూవులగుపించాయి!
పాపమేవరిదో అర్ధం కాలేదు!
కానీ, బాధ కలిగింది!
నాకు తెలియదు -
ఎక్కడి సంస్కార విన్నపమో?
పశ్చాత్తాపానికి నాందిగా
కంటి నుండి ఒక బిందువు
ప్రాయశ్చిత్తానికి సమిధగా జారింది!
అది మొదలు, తెర పలచబడింది!
స్థాణువులా నిల్చుండిపోయాను!
నిశాంత చ్చాయలో ఇంద్రధనుస్సు!
కలలో కూడా కనలేదు!
ఎదురుగా, స్థిరంగా, సూటిగా వస్తోంది, దూరంగా!
తెల్లటి వెన్నెల కిరణం!
అంతఃనేత్రం, అప్పుడే తెరుచుకొంది!
నిశ్చలంగా ఉన్నా తంత్రి,
ఫెళ్ళున కదిలిన భ్రాంతి.
వెల్లువలా కోర్కె రగిలితే,
కౌగిలి చాలని కవనం!
మరోసారి కంట నీరుఉబికింది!
ఆర్ద్రంగా, దుఖ్ఖిస్తున్న గుండెపై పన్నీటి జల్లులా
నిశ్సబ్దంగా నవ్వు వినిపించింది!
ఈ సారి వెతకలేదు.
చేయి చాచి, కౌగిలించుకున్నాను!
ఇక ఎవరినీ చూడాలని అనిపించలేదు!
అయినా, అందరూ అవుపిస్తున్నారు!
ఇప్పుడు.... శూన్యం కూడా!!
నేను వింటున్న సంగీతం,
దాహం తీరగా, తీరగా తాగుతున్నాను,
అమృతం లా!
నా ఆనందం చూసి నవ్వుతున్నారు.
కొంచెం పంచి ఇస్తానన్నాను, తరగదన్న ధైర్యంతో
వద్దుట - ఈ పిచ్చి, వారికి వద్దుట.
జాలి కలిగింది.
ఒంటరిగా వదిలివేశారు.
నా వెంట ఉన్న, వారి జాడను గమనించలేదు.
రేపు రాజులుట,
ఈ రోజే రాళ్ళు దాచుకుంటున్నారు!
వెనుతిరిగి చూసి నవ్వాను,
అపారంగా ఉన్న వీళ్ళు ఎరుగని అండను చూసి.

ఈ శూన్యంలో దోబూచులాట తెలిసి-
నిర్యానమదిగాను.
సమాధానం లేదు?
మరోమారు, భాష తెలియదని అనుమానం కలిగింది.
అయినా తెలిసినట్టే అరిచాను.
నవ్వుతుంటే, తన్మయత్వం తో చేష్టలుడిగి చూస్తున్నాను!
ఆలోచిస్తున్నాను!!

అజ్ఞాత కవి

ఈ రోజు మీకు ఒక అజ్ఞాత కవిని పరిచయం చేస్తున్నాను. ఇప్పటివరకు తన కవితలు నాకు తెలిసి చీకటిలోనే ఉండిపోయాయి. అతని అనుమతి లేకుండా నేను మీకు ఇవి అందిస్తున్నాను! అసలు ప్రతి నాదగ్గరే ఉన్నది కనుక నేమో నాకు ఈ ధైర్యం?! "అజ్ఞాత కవి" అన్న శీర్షిక కింద మీరు వాటిని నా పుటలో చూడవచ్చు. మీ స్పందనలు నేరుగా అతనికే తెలియచేయండి....  chakri5@yahoo.com అన్న చిరునామా కి..

దయచేసి గమనించ గలరు. ఈ కవితలు నా సొంత రచన కాదు.

నీవు  రాలేదు !
వేచి వాలిన కనుల
చీకటి అలుముకుంది!
పరువాల కలువ
అలిగి ముడుచుకుంది!
విరిపూల వన్నె
ఎదురుచూపులో వాసి వాడినదేమో?
చెక్కిట జారిన ముత్యం
మునిపంట బిగిసిన పెదవి అదురుకు
ఝాడుసుకుంది
నిట్టూర్పు సెగలు నిండిపోయిన ఎద
సోలిపోయింది!
తను వాలిపోయింది!
రేయి మలుపు చూసుకుంది!
నీవు రాలేదు!!!

రచయిత చక్రి కి ధన్యవాదాలు మరియు క్షమాపణల తో ....

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

29, మార్చి 2010, సోమవారం

మా చక్రవర్తి స్పందనలు మీ కోసం

క్రితం కబుర్లలో రాసినట్లు మా శ్రీరామ చంద్ర చక్రవర్తి సమయానుకూలంగా తెలియచేసే స్పందనలను మీకందరికీ పంచాలని అనుకుంటున్నాను, ఇక చిత్తగించండి !!!
""మందార మకరంద మాధుర్యమునదేలు  మధుపమ్ము ఓవునే మదనములకూ !
నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచ చనునే తరంగిణులకు !
లలితా రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుతజములకూ !
పూర్ణేందు చంద్రికా స్ఫ్హురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నీహారములకు !
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము 
ఏ రీతి ఇతరమ్ము జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ?!!  

శ్రీమన్నారాయణుని  పట్ల భక్తి ఎంత ప్రియమైనదో  !! తెలుగు లో మాత్రమే  ఆ అనుభూతి ని అంతే హృద్యంగా  పొందగలమని   పోతన వారి పద్యమే చెపుతుంది !! అంత తీయనైన తెలుగులో స్వీయ భావాలు, అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు పంచుకోవటం విశేష ప్రయత్నమే !! ఈ అంతర్జాల వీధి సోది  సుమాలలో మా లక్ష్మణుడి బంతిపూలు విలక్షణంగా విరబూస్తూ ఉంటాయని ఆశిస్తున్నాను !!  క్రొత్త పూత కోసం చూస్తూవుంటాను""

మీ అందరికీ మా నిత్య శుభాకాంక్షలు !!