జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2014, మంగళవారం

ఆకాశం సందడిగా ఉంది. రెపరెపలాడే పతంగులు, కుర్రకారు కేరింతలు... సంధ్య, కెంజాయ రంగు కళ్ళాపు చల్లి నింగిలో రంగుల చుక్కలేసి ముగ్గులు దిద్దటానికి తయారు చేసుకున్నట్టుంది. ఇప్పటిదాకా కనిపించని కొత్త పిట్టలు ఆకాశంలో ఈ వింత విహంగాలేమిటా అని సందడి చేస్తూ కిచకిచలతో కుహు కుహూ రవాతో నన్ను అడిగాయి. అవి మిడిసిపడే ఎగసి'పడే' కాగిత కలలే నని, చెట్టూ పుట్టలపై రాలిన సుమాలనీ, మేడలపై మిద్దెలపై తెగిపడిన రంగుల కలలనీ, ఆధారం లేక గాలి కి ఎగురుతున్న పటాల్నీ, అందనంత దూరం పోయి కంటికి కనిపించని మిగిలిన పతంగులనీ వాటికి చూపి, కంగారేమీలే దని వాటికి సర్ది చెప్పి ఇప్పుడే పంపించాను.

21, జూన్ 2011, మంగళవారం

'ఏకరువు'

సాయంత్రం నాలుగున్నర దాకా పని లేక బోరుకోట్టి చచ్చి చచ్చి, ఎలాగోలా ఈ రోజు ఆఫీసు అయిందనిపించి, కొట్టు (బట్టల కొట్ట్తో, పచారీ కొట్ట్తో కాదు, మా బ్యాంకు) కట్టేద్దామని తాళం వేయించ  పోతూ ఉంటె, ఒక జులపాల జుట్టు వాడు కారు దిగివచ్చి డెనిం జీన్స్ మీద ఎర్ర టీ షర్టు రేబాన్ కళ్ళద్దాలతో  చేతిలో కార్డు పట్టుకొని దిక్కులు చూస్తూ, అంతా  వెతుక్కుని ప్రశ్నార్ధకం లా నుంచుంటే ఎవడా వచ్చినిది అని  చూస్తూంటే, హి హి హి ఏ టీ ఎం ఉందండీ అంటూ వచ్చే ఆ విద్యాదికున్ని పిచ్చాడిలా చూసి, అబ్బెబ్బే లేదండీ అని నవ్వుతూ సాగనంపి మనసులో బోర్డు చూడటం కూడా రాదా ఈ వెధవకి ని తిట్టుకుని ద్విచక్ర వాహనం తీసి ఇంటికి బయల్దేరి, మధ్యలో కనిపించిన ఆ వాహనం అమ్మిన ఏజెన్సి వాడిని వెధవ బండి అమ్మావు, డుర్రు డుర్రు మని శబ్దం వస్తోంది అని వాణ్ణీ మనసు లోనే తిట్టుకొని, ఇంట్లో కూరలు లేవన్న విష్యం గుర్తొచ్చి, వాహనాన్ని సందు మొదట్లో సురేష్ కొట్టు దగ్గర ఆపి, అక్కడ ఉన్న పుచ్చు చ్చచ్చు వాడిపోయిన కూరలు చూసి విసుకుపుట్టి ఆదివారం అవటం వలన కూరల కొట్టు వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడా దొరక్క, దారి తప్పి వేరే సందులోకి వెళ్లి రోడ్డంతా కంకర పోసి ఉండటం వలన బండి బెదిరి, బెసికి తక్కుతూ తారుతూ అతి కష్టం మీద ఆ రోడ్డు బయట పడి  మళ్ళీ ఆ సురేష్ కొట్టు కే వెళ్లి ఆ కూరలే కొని, దుమ్ము ధూళి లో నలిగి, ఎండకు కమిలి చీకాకు పుట్టి ఇంటికి దారితీసి తాళం తీసి స్నానం చేద్దామని బాత్రుము కు వెళ్లి పంపు తిప్పితే,....    దేముడా... నా ఖర్మ కాలి నీళ్ళు రావాయే....

చెన్నపట్నం మహానగరి లోని మడిపాక్కం అను ఈ పంచాయితీ కుగ్రామా నగరం లో మొన్న అనగా ఆదివారం ఇలా జరిగింది. ఏదో ఇలా జరిగిందని ఏకరువు పెట్టాను, ఏమనుకోకండే!!!

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

(సాహితీ ప్రియులకు తప్పనిసరిగా ఒకటి గుర్తొచ్చే వుంటుంది. చాసో గారి 'ఏకరువు' కథ. ఏదో దానిని అనుకరిద్దామని సరదా గా ఇలా రాసాను. మళ్ళీ ఏమనుకోకండే ???!!!)

12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ రామ నీ నామ మెంత రుచిరా !!!


కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూలా కర్తవ్యమ్ దైవమాన్హికం

శ్రీరామ రామ రామేతి , 
రమే రామే మనోరమే;

సహస్ర నామ తతుల్యం, 

రామ నామ వరాననే. 

'రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత, భక్తీ, అనుభూతి ఉన్నాయి. అందుకనే గామోసు అప్పటి హనుమాన్ నుంచీ భక్త శబరి, వాల్మీకి, త్యాగయ్య, రామదాసు మళ్ళీ తరువాతి కవిజనం ఆ భక్తీ భావం లో మమేకమై మనకి మంచి కృతులని, గీతాలని, పాటలనీ అందించారు. ఇక సీతారామ కల్యాణం జగత్ప్రసిద్ధం. భద్రాద్రి లో జరిగే ఈ వేడుక పండిత పామర జనరంజకం గా వైభవం గా జరుగుతుంది.

గంగా నది చూస్తె యెంత పవిత్ర భావం కలుగుతుందో, శివాలయం లో కార్తీకం లో డమరుక నాదాలతో విభూతి పరిమళాలతో శివలింగం చూస్తె (నా చిన్నప్పుడు బందరు లో ఖోజ్జిల్లుపేట శివాలయం లో కార్తీక మాసం ప్రతీ రోజూ రాత్రి వివిధ హారతులు ఇస్తూంటే, డోలు, ధమరుకాలతో నందీశ్వరుడు, శివుడు దిగివచ్చినట్టు గా వింత వింత నాదాలతో గర్భగుడి ప్రతిధ్వనిస్తూంటే ఒడలు పులకరించేవి) ఎంత వింత అనుభూతి కలుగుతుందో, శ్రీ రామ నవమి నాడు స్వయం గా చేయకపోయినా ఆ కళ్యాణ ఘట్టం తలుచుకుంటే అంత అనుభూతి. క్రితం సంవత్సరం ఈ రోజు (శ్రీ రామ నవమి నాడు) నేను రాసిన నా  జ్ఞాపకాల గురించి చదవాలనుకుంటే    ఇక్కడ      చూడండి.  
స్వామివారి వడపప్పు, పానకాలు జనులందరూ మెచ్చే ప్రసాదాలు.

జనన మరణ భయ శోక విదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం 
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
అటువంటి ఈ రామ ప్రసాద రసం, పానకాన్ని కరువుతీరా గ్రోలండి.

రామ భక్తీ సామ్రాజ్యం,
ఏ మానవుల కబ్బెనో మనసా.. అని త్యాగయ్య ప్రశ్నించు కున్నాడు.

అలాగే...

ఆ మానవుల సందర్శనం
అత్యంతా బ్రహ్మానందమే మనసా...

అని కూడా ఆనందపడ్డాడు.

ఆ ఆనందాన్ని తమ  ప్రతి చిత్రం/చలన చిత్రం లోను రామ భక్తి చూపించిన బాపు రమణలు ధన్యులు.  ఆ రాముని భజియించినట్టి భక్తాగ్రేసరు లందరూ ధన్యులు.


లోక కళ్యాణార్ధం ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుభ ముహూర్తాన జరుగే సీత రామ కల్యాణం ప్రజలందరికీ శుభకరం, మంగళ దాయకం. భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు ఇక్కడ మననం చేసుకుందాము:


శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు 
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో 
త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!


చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో 
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా 
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!


రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ  కల్పవల్లి కా 
రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో 
ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం
దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి!


మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ...




మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.


మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది 

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఖర నామ ఉగాది శుభాకాంక్షలు


ఈ ఉగాది పచ్చడి మీకోసం. తీరిగ్గా తరువాత పలకరించుకుందాం, ముందు స్నానం చేసి వచ్చి, ఈ కుంకుమ నుదుటిన ధరించి ఈ పూలతో పూజ చేసి, పచ్చడి రుచి చూడండి.

ఉగాది పండుగ వచ్చింది
                  ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
                 బాజాలయ్యాక పూజలు
ఊరేగింపు ముగిసాక
                 ఉత్సవాలు  జరిగాక
పంచాంగాలను చదివి
                  మంచిచెడ్డలు విన్నాము!
(మాగంటి.ఆర్గ్ నుంచి)

ఈ నవ వసంతం మీ జీవితాలలో నవ ఉషస్సులు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ప్రశాంతత నెలకొనాలని ఆ దేవ దేవుని ప్రార్ధిస్తూ....       ఖరనామ ఉగాది శుభాకాంక్షల తో ....

ఈ సందర్భం గా క్రితం సంవత్సరం "వికృతి" లో నేను ఈ భాగ్ముఖం గా ఇచ్చిన తెలుగు సందేశాన్ని, మళ్ళీ మీకోసం : (అప్పటికి నా ఈ బ్లాగు జనాల్లోకి రాలేదు)

 మళ్ళీ కొత్త  తెలుగు సంవత్సరం వచ్చేసింది!

తెలుగు తెగులు పట్టిన వాళ్ళకి ఇది ఒక పిండివంటల పండుగ (ఒక శెలవు) మాత్రమె కాని మన సంస్కృతీ సంప్రదాయం, దాని సొగసులు, సొబగులు ఏవి పట్టదు! ఇలాంటి/మీలాంటి వాళ్ళ కోసం ఈ వికృతి నామ సంవత్సరం లో ఒక ఝలక్!!!

భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో తెలుగు లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని . ఇంగ్లిషు  ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ. సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే .......
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్
ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్
ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్
ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు
ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం (ఇప్పటి సమాధానం - జై తెలంగాణా నా , జై ఆంధ్రా నా)

ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.

అదే, శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...
దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!

ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి..

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు - ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)
అందుకే, తెలుగువారికి అజరామరమయిన, అనిర్వచనీయమయిన భాషా సంపత్తిని వదిలి వెళ్ళిన తెలుగు కవులకు, రచయితలకు పాదాభివందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఈ సంవత్సరం అన్నా... 

తెలుగును మరవకండి, 
తెలుగును ప్రేమించండి, 
తెలుగువారిగా జీవించండి,
గర్వించండి.

మీ అందరికి ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ లోగిళ్ళు కలకాలం పచ్చగా సుఖశాంతులతో వెల్లి విరియాలని మీ జీవితాలు శుభప్రదం కావాలని మనసార కోరుతూ

మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది .






31, మార్చి 2011, గురువారం

మీకు ఒక బ్రహ్మానంద భరితమయిన సన్నివేశం చూపిన్చదలుచుకున్నాను. ఈ క్రింది చిత్రం చూడండి:

చిక్కాడు చేతిలో బావ  
ఒకాయన వేరొక యువకుని చేతిలో గోరింటాకు దిద్దుతున్నాడు. ఆ సన్నివేశం ముగ్గురూ ఆస్వాదిస్తున్నారు, ఆ భావాన్ని మొహం లో చూపిస్తూ.

విష్యం ఏమిటంటే, కుడి పక్కనున్న శంకరానికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆ హడావిడిలో బావ సుబ్రహ్మణ్యం (ఎడమ) ఇతని చేతిలో సరదాగా....  ఇలా గోరింటాకు పెడుతూ మూడో కంటికి చిక్కాడు. వెనక చిరునవ్వులు చిందించే ఆయన ఇంకొక బావ, అయన పేరు కూడా సుబ్రమణ్యం , కాకపోతే ఘనాపాటి గారు.

ఈ సన్నివేశం లో వీళ్ళ మోముపై చూపించిన బ్రహ్మానంద భరితమైన భావాలు నాకు బాగా నచ్చి ఈ చిత్రాన్ని మీ వరకు తీసుకొచ్చాయి.


ఈ చిత్రానికి మీ వ్యాక్యాలు హాస్యభరితం గా తెలియచేయండి. ఈ పెళ్ళికొడుకు కు కానుకగా నేనన్దిస్తాను.

ఉంటాను
లక్ష్మణ కుమార్ మల్లాది.

24, ఫిబ్రవరి 2011, గురువారం

ఆ రోజుల్లో ... రేడియో లో...

నిన్న దృశ్య శ్రవణ పెట్టె (అదేనండీ టెలివిజన్) చూస్తూ మీటలు మారుస్తూ అనుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమం లో సూర్య భగవానుని పూజల గురించి చెపుతుంటే ఆసక్తిగా చూస్తున్నాను. చివర్లో సూర్య నారాయణుని సుప్రభాతం వినిపించారు.  ' శ్రీ సూర్య నారాయణా  ... మేలుకో... హరి సూర్య నారాయణా .... అంటూ మొదలవుతుంది. 

నా పాత పుటలలో రాసినట్లు గా  భక్తిరంజని, ఆకాశ వాణి లో వినిపించే మధుర రాగాల గానలహరి వెంటనే గుర్తోచ్చేసింది. సూర్యుని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది.

"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."

అంటూ పొద్దు పొడుస్తున్న సూర్య బింబాన్ని వర్ణించటం మధురానుభూతి నిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు  మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడి ఛాయ ... "    అంటూంటే నేను నిజం గా నా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను.  చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం రేడియో లో వినపడే వందేమాతరం తో నే తెల్లారేది. అప్పటికి లేచి దంతధావనం కానిచ్చే లోపల నాద స్వరం, ఆంగ్ల వార్తలు అయిపోయి ఆ రోజు భక్తిరంజని కార్యక్రమం  లో ఏం వస్తుందో నని ఉత్కంత గా ఉండేది. వారాన్ని బట్టి వివిధ దేవతలా స్తోత్ర తరంగిణి వినిపించే వారు. వోలేటి వెంకటేశ్వర్లు గారి భజగోవిందం, బాలాంత్రపు వారి సూర్యాష్టకం, పైన చెప్పిన సూర్య నారాయణ స్తోత్రం బృంద గానం, రామా రావు గారి హనుమాన్ చాలీసా, శివ స్తుతి, మధురాష్టకం (మధురం మధురం అంటూ యెంత మధురం గా వినపదేదో), బాల మురళి తత్వాలు, రామదాసు కీర్తనలు, శ్రీరంగం గోపాలరత్నం పాటలు, మల్లిక్ గారి రాజ రాజేశ్వరీ స్తోత్రం... అలా అన్నీ మధురాలే.

మల్లిక్ గారి స్తోత్రం మంద్రం గా పవిత్రం గా రాగ యుక్తం గా వాయులీన నేపద్యం లో వినపడుతుంటే రోజు మొదలెట్టటం చాలా ఆనందం గా ఉండేది. చాలా అరుదుగా ఈ మధ్య దీన్ని ప్రసారం చేస్తున్నారు. దాన్ని వింటూ గతం లోకి పరుగెత్తటం బాల్యానందాన్నిస్తుంది.

ఈ కార్యక్రమం తరువాత పొలం పనులు, వెంటనే ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వచ్చేవి. మధ్యలో ఎక్కడో సంస్కృతం లో కూడా వార్తలు ఉండేవి. "ఇయమాకాషవాని! సంప్రతి వార్తః సుయంతం, ప్రవాచికః బలదేవానంద సాగరః" అంటూ వణుకుతూ వుండే గొంతు తో ఆ పెద్దాయన వార్తలు చదువుతుంటే ఏమిటో ఆ చిన్న వయసు లో కూడా ఏదో కొత్తది వినేస్తున్నాననిపించేది. "ఆగచ్చ! ఉపనిష్!" అంటూ పంతులు గారు చెప్పే సంస్కృత పాఠం తో పాటు, మా ఇంట్లో ఉదయపు ఉపాహారం తయారయ్యేది. చాలా రోజులు పెసరట్టు ఉప్మా లే మెను. అల్లం పచ్చడి  రుచి అదనం.

(ఆ భోగం కూడా ఎంతమందికి వుంటుందో .. అదృష్టవంతులు.  పచ్చిమిరపలు ,  అల్లం, జీలకర్ర  జమాయించి చేసి వేసిన పెసరట్టు  రుచి  విజయవాడ బాబాయి హోటల్లో తప్పితే వేరే  చోట  దొరకగాలదంటారా  .. ఈ రోజుల్లో   అదికూడా  అందని ద్రాక్ష అయిపొయింది.  మరుగున పడుతున్న తెగులుపట్టిన  తెలుగు లాగా. మొన్నామధ్య  ఓ చుట్టం  పెళ్ళిలో అల్పాహారం గా పెసరట్టు ఉప్మా పెట్టిస్తే, వేడి వేడి గా అందరూ సుబ్బరంగా సుష్టు  గా లాగించేసి ఈ ఆలోచన చేసిన ఆయన్ని మనసులో అభినందిన్చుకున్నారు.)

అది తిన్న వెంటనే మేం బడికి వెళ్ళే సమయం అయ్యేది. ఎనిమిది గంటల తరువాత వచ్చే ఈ మాసపు పాట, ఇతర కార్యక్రమాల మధ్యలో వచ్చే లలిత గీతాలు తెలుగు నుడికి, వడి కి , సరళమైన పదాల్లో కుదించి చెప్పే భావ ప్రకటన అనన్య సామాన్యం. దేవులపల్లి, బాలాంత్రపు రజని, నండూరు సుబ్బా రావు, దాశరధి వంటి మహనీయుల గీతాలు హృద్యం గా ఉండేవి. ఇక తొమ్మిది గంటల తరువాత, మధ్యాహ్నం పన్నెండు తరువాత వచ్చే శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాంతీయ కళాకారుల తో సంపన్నం అయ్యేవి. అవి వింటూ తేనీరు తాగుతూ చదువుకుంటూ ఉండేవాడిని. కార్మికుల కార్యక్రమం, ఒకటిన్నరకు స్త్రీల కార్యక్రమం, సాయంత్రం యువజనుల కార్యక్రమం దేనికదే విభిన్న కార్యక్రమాల సమాహారం గా అలరించేవి.

ఆ కార్యక్రమాలే కాకుండా వాటి మొదలులో వచ్చే నేపధ్య బాణీలు దేనికవే ప్రత్యేకం గా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే విధం గా ఉండేవి.  మీరు కనక వాటిని వింటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. యెంత బాగుండేవో కదూ. చిన్నక్క ఎకంబరం కబుర్లు, ఉషశ్రీ ధర్మ సందేహాలకి సమాధానాలు, బాలానందం లో రేడియో అక్కయ్య ముచ్చట్లు, పల్లె పదాలు, జానపద బాణీలు, స్త్రీల పాటలు, మధ్య మధ్యలో అలనాటి వెండితెర పాటలు, ఆ నాటి కొత్త పాటలు... వ్యాఖ్యాతల చతురతలు...  ఆదివారం మధ్యాన్నం నాటకం కోసం ప్రత్యేకం గా ఎదురు చూసేవాన్ని. (టెలివిజన్ వచ్చిన కొత్తలో చిత్రలహరి కోసం చూసినట్టుగా) నండూరు సుబ్బా రావు నాకు ఇష్టమైన నటుడు. ఆయన వాచికం ఇంచుమించు జగ్గయ్య గారి వాచికం లా తాజా గా ఉండేది. కృష్ణ మూర్తి - కుక్కపిల్లలు అన్న నాటకం లో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ నా చెవుల్లోనే వుంది.

ఇక వార్తల విషయానికొస్తే, ధిల్లీ వార్తలలో అ అ అ ... ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది ..." అంటూ తడబడుతూ మొదలెట్టే కందుకూరి సూర్యనారాయణ, ఎవరో తరుముకొస్తున్నట్టు చదివే అద్దంకి మన్నార్, ఇలియాస్ అహ్మద్, ఏడిద గోపాల రావు, ప్రాంతీయ వార్తలు చదివే కోక సంజీవ రావు, కొప్పుల సుబ్బా రావు, వ్యాఖ్యాతలు పాలగుమ్మి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మల్లాది సూరి బాబు ఇత్యాది మహా మహులందరూ నా జ్ఞాపకాలలో ఇంకా పదిలం గా ఉన్నారు.

ఈ తలపులన్నీ గురుతుకు రాగా ఇందాకే అంతర్జాలం లో అలనాటి భావ/లలిత/భక్తీ గీతాలకై వెతుకులాడాను, మళ్ళీ విందామని లేదా పొందుదామని. కొంతవరకు మన తెలుగు వీధి గుమ్మాలలో (అంటే సైట్లలో అని కవి హృదయం) రా రాజు అని నేననుకునే "మాగంటి.ఆర్గ్" లో విని నా జ్ఞాపకాలని తాజా గా ఉంచుకున్నాను.  మీరూ ఆ వీధి వాకిట్లో వుండే గోవు వెనక ఆ ఇంట్లో కి చేరి అలరించే వీటిని చదివి, విని ఆనందించ గలరని భావిస్తూ..

ఇంకొక్క మాట...   పైన చెప్పిన వాటిలో మీ వద్ద ఏదైనా దొరికితే నాకు పంప గలరని అర్ధిస్తూ , మళ్ళీ ఆలస్యం చేస్తే రాయటం మరిచి పోతానని మీకు సమర్పిన్చేసుకున్తున్నాను.

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్.

26, జనవరి 2011, బుధవారం

ప్రసాదం భక్తులు

మనం గుడికి వెళ్ళిన  ప్రతీసారీ ప్రసాదం దగ్గర కొచ్చేసరికి కొంతమంది ఏదైనా తీసుకుంటారు. కొంతమంది శుభ్రత, రుచి, ప్రసాదం లో రకం (పులిహోర, దధ్యోజనం, పొంగలి లాంటివి) చూసి తీసుకుంటారు.  కొన్ని చోట్ల ఏ రకమైన ప్రసాదం అయినా దాని రుచే రుచి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటివి అన్నమాట. తిరుపతి లడ్డు "ఆహా మహా ప్రసాదం, ఏమి రుచి" అనుకుంటూ దేముడంటే పడని వాళ్ళు కూడా లాక్కుని, తింటారు. ఈ రోజుల్లో కొంచెం సహజ లక్షణాలు తగ్గినా, ఒక తునక అయినా చాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళినపుడు, మా తాతయ్య వరసయే ఒకాయన అక్కడ పని చేస్తూన్దేవాళ్ళు.  అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా దర్శనం పైన అవరోధాలేమీ లేవు. దేవుని దగ్గర కొంతసేపు అలా నిన్చున్దబెట్టారు. ఇక ప్రసాదమైతే, ఒక పెద్ద బుట్టలో చక్కర పొంగలి, దోశలు, వడలు లాంటివి అనేకం తెచ్చి ఇచ్చారు.  ఈ ప్రసాదం రుచికరమైన ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని చూసే వాళ్ళని "ప్రసాదం భక్తులు" అని నామకరణం చేశాను. వీళ్ళు గుడికి దాదాపు ప్రసాదం  కోసమే, (కొంచెం భక్తి తో కూడా) వెళ్తారు.

ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే, నేను కూడా ఆ ప్రసాదం భక్తులలో ఒకణ్ణి.  చిన్నప్పుడు బందరు లో కృష్ణా రావు గారి బళ్ళో చదివేప్పుడు (బందరు బచ్చుపేట లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండేది.) పుష్య మాసం (ధనుర్మాస) లో రోజుకొక్క తరగతి నుంచి ప్రసాద వినిమయం కోసం పిలిచేవారు. మా వరుస ఎప్పుడొస్తుందని ఆత్రం గా చూసే వాణ్ని. ప్రసాద మంటేనే కొద్దిగా పెడతారు. అందుకే దానికి ఆ రుచి వస్తుందేమో. అయినా, వరుసలో ఒక ఆకు (మర్రి అకో మరి ఏదో  గుర్తు లేదు) పుచ్చుకుని వేడి వేడి తీపి పొంగలి నోరు కాల్చుకుంటూ తినటం నాకింకా గుర్తే. అక్కడ కళ్యాణ మంటపానికి పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి. చెప్పాలంటే అంత పెద్దవి కాదు కానీ అప్పటి నా వయసుతో పోల్చుకుంటే పెద్దగా అనిపించేవి. ఎక్కటానికి కష్ట పడే వాళ్ళం. వాటిమీదేక్కి ఆడుకోవటం ఇంకొక మంచి జ్ఞాపకం.  విషయం మారి నా పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతున్నాను...

ఆ తరువాత నేను పెద్దయ్యాక గుడికి వెళ్ళినపుడు, ప్రసాదం పుచ్చుకోవటం అనేది చాలా అరుదుగా జరిగింది. అక్కడి శుభ్రతా, పెట్టే వాడి శుభ్రతా అన్నీ చూసి తిన బుద్దయ్యేది కాదు.  ఆ మధ్య ఒక గుడిలో (బ్రాహ్మల నిర్వహణ లోని గుడి) మా బావమరిది తో వెళ్ళినపుడు 'గారి' ప్రసాదం పెట్టబోతే ఆ ఇచ్చే అయన మా వాణ్ని 'ఏమండీ ఆయన బ్రాహ్మలు కాదా' అని అడిగాడుట.

కానీ ఈ మధ్య ఈ చెన్న పట్నం లో నంగనల్లురు లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిని ఒక స్నేహితుడు పరిచయం చేసాడు. (ఆయనను 'భక్తుడు' అన్న పొట్టి పేరు పెట్టేసాను.ఈ భక్తుడు కూడా ప్రసాదం భక్తుడే) అక్కడ ప్రసాదం గురించి ప్రత్యేకం గా చెప్పాలి. పొంగలి గానీ పులిహోర గానీ, రవ్వ కేసరి, తీపి పొంగలి కానీ ...  ఆహా యెంత రుచి గా ఉంటుందండీ. మంచి నెయ్యి కారిపోతూ యమ రుచిగా వుంటుంది. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి, నా శుభ్రతా పరీక్ష లో కూడా అది నెగ్గింది. చాలా శుచిగా, మడిగా తయారు చేస్తారు. చెన్నై లో నేను చూసిన దేవాలయాలన్నిటి లోనూ ప్రసాదం చాలా రుచిగా వుంటుంది. అన్నిటిలోకీ ఈ గుడి ఇహ చెప్పకర్లేదు.

అందుకని ఈ మధ్య నేను మళ్ళీ ప్రసాదం భక్తుడ నయిపోయి, దాని కోసమే గుడికి వెళ్లి ఒక చుట్టు తిరిగి, దేముడికి ఒక నమస్కారం పారేసి (భక్తి తోనే అనుకోండి) ప్రసాదం వరుసలో నిలబడి పోతున్నాను. ఒకోసారి, రెండవ సారి కూడా. (ప్రసాదాన్ని బట్టి)

మీరుకూడా, దేముడేవరైనదీ కాకుండా భక్తి తో ప్రసాదం భక్తులుగా మారిపోండి.

ఉంటాను

మీ
మల్లాది లక్ష్మణ కుమార్.

22, జనవరి 2011, శనివారం

ఉద్యోగ పర్వం లొ కిష్కింధ కాండ!!

మా గొండా జీవితం లొ మరొక మరిచిపొలేని జ్ఞాపకం ఇది. చలి కాలం లొ సరదాగా ఉదయాన్నె లెచి మిత్రులు శివ ప్రసాదు, రమెష్ లతొ ఉదయం నడకకి వెళ్ళే వాళ్ళం. అలా ఊరి బయటి దాకా వెల్లి ఒక ఘంట సేపు తిరిగొచ్చె వాళ్ళం. ఉదయన్నె కటిక మంచు (కటిక చీకటి  లాగా,  అంటే దట్టమైనది అని అనుకొండి ) లొ ప్రకృతిని చూస్తూ అస్వాదిస్తూ చల్లదనాన్ని గొంతు నిండా  నింపు కుంటూ , (తరువాత జలుబు వలన నానా ఇక్కట్లు వచ్చెవనుకొండి) కబుర్లు చెప్పుకుంటూ వెడితే యెం మజా గా ఉందెదొ...

ఒక రొజు మంచు తెరల మాటున మన శివుడు ఒక అద్భుతాన్ని చూసాడు: యెమిటంటారా...

ఒక తొట... మన అంధ్రులకు ఎంతగానొ ప్రియమైన శాకం, మాయాబజార్ లొ కూడ "శాకంబరీ  దేవి వర ప్రసాదం,ఆంధ్రుల వంట.. అది లేకుండా ప్రభువులు ముద్దైనా ముట్టరు" అని అనిపించుకున్న మన గొంగూర.

అక్కడ వున్న రొజుల్లొ రమారమి సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మన అంధ్రా కేసి వచ్చె వాళ్ళం. ఇష్టం అని పచ్చళ్ళు యెంత పట్టికెల్లినా రెండు నెలల లొపే తాజా దనం పొయి అరుచి కలిగెది. తాజా గా చేసుకుందాం అంటె దొరకని స్థితి. ములక్కాడలూ అంతే, అస్సలు దొరికెవి కాదు. ఒక రొజు బజారులొ కనిపించాయి అంటె ఇహ మనవాళ్ళందరికీ చెప్పి తొలుకెళ్ళెవాళ్ళం. అవీ చాలా లేతగా 5 లెక 6 అంగుళాల  సైజులొ దొరికేవి.

ఈ తాయిలం కనిపెట్టిన శివ ప్రసాదు, వాళ్ళావిడ  తొ చెప్పేసాడు , మేము  ఒక ఖజానా ని చూసామని. ఇంకెముంది, జనాలంతా పెళ్ళాలని, వచ్చిన వాళ్ళు పిల్లలని వెంటేసుకుని ఒక ఉదయం ఆ గొంగూర చెను మీద పడ్డాము. కల్లు తాగిన కొతి వనమంతా చెరిచిందనీ... వానరులు కిష్కింధ వనం అంతా నేల మట్టం చెసినట్టుగా.. అసలె వాళ్ళు నారు కొసం పెంచినట్టున్నారు, అవి గొంగూర వ్రుక్షాలయినాయి. ఆ వ్రుక్షాలన్నీ మోడు చెసి, విరక్కొట్టి, కొసుకున్న వాళ్ళు కొసుకున్నంత తెచ్చెసుకున్నారు. దాంతొ పులుసె పెట్టుకొ, పచ్చడె చెసుకొ, పప్పె వండుకొ, ఉన్నన్నళ్ళూ వారం పది రొజుల పాటూ గొంగూర సంతర్పణ చెసుకున్నాం.

నేనుకూడాఈ వానరుల్లొ ప్రముఖుడినే  అని చెప్పటానికి  మిక్కిలి సంతొషిస్తూ, ఎండ  మావుల్లొ నీటి  చెలమ లాగ మాకు ఆ వనాన్ని తెలియ కుండా అంకితం చెసిన అజ్నాతుడికి ధన్యవాదాలు చెపుతూ...

ఇంకొ విషయమండోయి , ఈ కొతి పనికి అలవాటు పడి  కొన్ని రొజుల తరువాత వెల్లిన మాకు చుక్కెదురైంది. యెవరొ కాపలా మనిషి తిట్టినంత  పని చేయటం తొ అటుకేసి వెళ్ళటం మానుకున్నాం.

ఈ కిచ కిచలు మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలు వ్యాఖ్యలలొ తెలియ చేయండి.

మీ
మల్లాది లక్ష్మణ కుమార్




29, నవంబర్ 2010, సోమవారం

'పడమటి సంధ్యా రాగం

ఈ మధ్య మీతో చాలా సార్లు మాట్లాడదామని అనుకున్నాను... ఒక రోజు చిన్ని గళాలు ఆహ్లాదంగా ఆ 'పాత' మధురాలు పాడేప్పుడు (పాడుతా తీయగా లో), ఇంకొక రోజు బాలు గారు 'గాన గాంధర్వ' కార్యక్రమంలో ఆనాటి చక్కర కేళీలు గానం చేస్తున్నప్పుడు, ఓ రోజు రాత్రి రావూరి భరద్వాజ గారి అంతరంగ తరంగాలు 'అంతరంగిణి' చదువుతూ అంతర్ముఖుడి నైనపుడు (దీన్ని గురించి విపులం గా చర్చించాలని ఉంది.. ఈ లోగా వీలయితే ఆయన రచనలు 'ఒకింత వేకువ కోసం', 'నాలో నేను' లాంటి వి చదవండి ), కన్యాశుల్కం నాటిక ను ఆస్వాదిస్తున్నపుడు ....

మొన్నొక రోజు  'పడమటి సంధ్యా రాగం' విని/చూసి... .......................      ..............

గుమ్మలూరి గారి అభిరుచికి జంధ్యాల వారి చమత్క్రుచి (చమత్కార రుచి) తోడై, మంచి కాఫీ లాంటి, యెర్ర గా వర్రగా ఉన్న ఆవకాయ ముద్దలా..  ఎన్ని సార్లు ఆ చిత్రం చూసినా ప్రతిసారీ కొత్త ఆవకాయ రుచిలా. . . కమ్మగా..

జంధ్యాల గారి మాటల చమత్కారం ఒక ఎత్తైతే బాలు గారి సంగీతం వీనుల విందుగా ...      హాయిగా..

పిబరే రామ రసం...  (మన సదా శివ బ్రహ్మేన్డ్రుల కృతి) తెలిసిన రాగంలో నైనా మధ్య మధ్య లో పలకరించే వాయులీన రాగాలతో, ధ్వని తంత్రుల (పియానో) తరంగాలతో మరింత వినసొంపుగా వినిపించింది.  ఖండాంతరాలకు వెళ్లి తమకు తెలియకుండా 'తమను' కోల్పోయే తెలుగు వాడి దీన స్థితి  ...ఆ దీనత్వానికి అలవాటు  పడలేని ఆ పెద్దాయన పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది.  శ్రీరామ నవమిని గుర్తు చేసుకోలేని ఆ పెద్దాయన  "అదే  ఆ  రోజుల్లో అయితే  ..." అని  గుర్తు  చేసుకునే  సందర్భం  నా  పాత పుటల్లో  ని  జ్ఞాపకాలను  తట్టి  లేపింది. 

తిట్ల పురాణం, దండకం బాగా వంట పట్టించుకున్న జంధ్యాల మార్కు హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర చిత్రణ, వాచకం (గాత్ర ధారణ వేరే వారిది అనుకుంట) బాగా కుదిరాయి.  వర్షం లో గొడుగేసుకుని పచ్చిక తడుపుతూ వుండటం, ఇంట్లో వాళ్ళు తాళాలేసుకుని బయటకెడితే అయన తాళం పోగొట్టుకుని వచ్చి బయట దినపత్రిక నెత్తిన కప్పుకుని గుడ్లు మిటకరించుకుని కూర్చోటం, ఆరు బయట (అమెరికా లో) వొళ్ళంతా నూనె పూసుకుని హంగామా చేయటం... ఇంకా చాలా సందర్భాలలో...   మళ్ళీ, హిమక్రీముల దుకాణం యజమాని ని బాగున్నారా అంటే  "కు లాసే... (అంటే కుమారుని వలన లాసు)" అని వ్యంగ్యం గా చెప్పటం, పైగా కొడుకు ని వివిధ రకాల రాక్షసుల పేర్లతో పిలవటం .....       చాలా సందర్భాలలో సంభాషణలు బాగా నవ్విస్తాయి.


ఇక్కడ చూడండి:
....

విదేశాల నేపధ్యం లో జరిగే కథలతో వచ్చిన తెలుగు చిత్రాలలో ఇంత సహజం  గా, ఆద్యంతం చూడదగ్గ సినిమాలలో ఇది ఒకటి అని ఒప్పుకోక తప్పదు.

మీరు చూసారా?  మళ్ళీ మళ్ళీ చూడండి.   
  
హాస్యం ఆరోగ్య/ఆనంద దాయిని. హాయి గా నవ్వుకుని మనసుని తాజా గా ఉంచుకోండి.
మరి ఉంటాను...

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

2, మే 2010, ఆదివారం

వెన్నెల రాత్రి, వెండి మబ్బులూను...

"వెన్నెల రాత్రి" అని చాలా రోజుల క్రితం మొదలెట్టాను ఈ టపాని. ఈ రోజు వెన్నెల రాత్రులు కాదు, చంద్రవంక మాత్రమె ఉంది.
నెల వంక, చంద్ర వంక అని కవితావేశులు ఎందుకని అన్నారో కాని, మన అచ్చ తెలుగు మాటలు, తేనెల మూటలు అన్న మాట నిఝామ్ అనిపిస్తుంది. ఆ వంక ఈ వంక చూడకుండా 'అర' విరిసిన వెన్నెల రాత్రులలో నెలవంక దర్శనం పైట తో సగం కప్పి ఉంచిన  మురిపించే ముద్దరాలి ముద్దు మోము ను  చూస్తున్నట్లనిపిస్తుంది. మల్లె తీగ పూల నుంచి వచ్చే సుగంధం, దొడ్లో చెట్ల క్రీనీడలు, సన్న గాలికి ఊగే కొమ్మల సవ్వడి, కొబ్బరి చెట్ల ఆకుల మధ్య నుంచి తొంగి చూసే మన ఈ నెలవంక, ప్రియురాలి/ శ్రీమతి తో కబుర్లు సల్లాపాలు     ఆహా ...  ఈ జీవితం లో ఇవన్ని  మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులు, ఊహలు.  ఈ ప్రకృతి అంతా ఇప్పుడు ఊహించుకోవాలె గాని, అనుభవించలేము. ఎక్కడో పల్లెటూళ్ళలో తప్పితే. ఇక నిండు చంద్రుని రాక  తో ప్రకృతి పరవశించి అందం ద్విగుణీకృతం చేసుకుంటుంది. వెన్నెల రాత్రి, వెండి మబ్బులూ విజయా వారి మాయాబజార్ లోని "లాహిరి లాహిరి..." పాట లో యెంత అందం గా మలిచారు. పుచ్చ పువ్వు పూసినట్లు గా వెన్నెల పరుచుకొని  వుంది  అన్న పోలిక మధురం, నిజం.
ఈ ఆహ్లాదకరమైన వెన్నెల ను అనుభవించండి, వంటికి పూసుకొని చల్లని అనుభూతిని పొందండి.
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

22, ఏప్రిల్ 2010, గురువారం

పేరు లోనే ఉన్నది పెన్నిధి ....

నిన్న (అంటే ఈ టపా  మొదలెట్టే సమయానికి.. పదిహేడవ తారీకు) మా శ్రీకాంత్ పుట్టిన రోజు, నేను కూడా ఒక ఆఫీసు పని వలన హైదరాబాద్ లోనే ఉన్నాను. వాడు మా పెద్ద వాడు. రెండో పిల్లాడి పేరు శ్రీవంశి. ఈ పేర్లు పెట్టటం అన్న తంతు  ఒక్కొక్క సమయాల్లో చాలా విసుకు అనిపిస్తుంది అంటే నేను చూసిన కొన్ని సందర్భాలలో. మా పుట్టింటివారి తరఫు పేరు పెట్టాలని తల్లి, కాదని తండ్రి, మధ్యలో తాతలు, తాతమ్మలు, మావగారు, అత్తగారి సలహాలు, సూచనలు, అప్పుడప్పుడు కొంత ధాటిగా విసుర్లు, అలకలు ఆ పేరు ని చిరిగి చాటంత చేస్తాయి. అప్పుడు ఆ పేరు పెట్టుకున్న వాడు పెరిగి పెద్దయ్యాక ఈ తోకల్ని తలుచుకుని తలుచుకుని ఈ పేరు ఏమిటిరా బాబు హనుమంతుని తోక లాగా అని అమెరికా వెళ్ళిన తెలుగు వాడి లాగా ఆ పేరుని కుదించి మధించి కత్తిరించి అర్థం పర్థం  లేని కొత్త అవతారం ఎత్తుతాడు. ఇంతకీ మా అబ్బాయి పేరు పెట్టటం లో అంత ప్రతిఘటనలేమి ఎదురు కాలేదు. మా మామ్మ మటుకు గునిసింది, శ్రీ రాముని పేరు కావాలని.  నాకేమో శ్రీకాంత్ అన్న పేరు బాగా నచ్చింది. చివరికి ఆవిడే రాజీ పడి ఏదైనా ఆ మహా విష్ణువు అవతరలేగా అని తృప్తి పడింది. 
పేరులో ఏముంది!!  అని నాటకాలు, కవితలు మన తెలుగు వారు గుప్పించిన..  పేరుకున్న గొప్పదనం పెట్టుకున్న వాడికి గాని తెలియదు. ఒక్కొక్క సారి విచిత్రమైన ఎప్పుడు వినని పేర్లు కూడా వినిపిస్తుంటాయి.   మీక్కూడా ఈ రకం గా పేర్ల భాగవతం గాని ఉన్నట్లయితే నాకు తెలుయచేయండి, పంచుకోండి...
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది

4, ఏప్రిల్ 2010, ఆదివారం

ఆ రోజులే వేరు!!

ఆ రోజులే వేరు!!
మనం ఎప్పుడు వాడే మాట ఇది. ఒక ఉరు నుంచి వేరొక వూరు వెళ్ళినా, ఉద్యోగం మారినా, లేదా మన వయస్సు మారినా, పాత సంగతులు గుర్తుకొచ్చినపుడు మనం అంటుంటాం, "అబ్బ నువ్వేన్నైన చెప్పరా కానీ,  ఆ రోజులే వేరు".
దానికి నేనేమీ మినహాయింపు కాదు. చిన్నతనం లో మనం చేసిన అల్లరి, బాధ్యతలు లేని జీవితం ఎవరికి బాగుండదు చెప్పండి. వేసవి కాలం సెలవలు వచ్చిందంటే సూర్య కిరణాలు లేపుతుంటే లేవటం, (అంటే ఆలస్యం గా) ఎడ పెడా తిరిగేయ్యటం, సాయంత్రం పక్కింటి అబ్బాయి బుడ్డిబాబు, రాము, మా అన్నయ్య వాళ్ళతో గోలికాయలు ఆడటం, పోద్దస్తమాను రేడియో వినటం, ఇన్ని వ్యాపకాలు ఒక్కసారిగా మీద పడి పోతాయి. ఎండలు మండేవి అనుకోండి, కాని ఆయనెవరో చెప్పినట్టు, "మావిడి పళ్ళు, మల్లె పువ్వులు కావాలి గాని, మండుటెండలు అక్కరలేదా అని" ... ఆ రోజులే వేరు.
ఉదయం రేడియో లో మల్లిక్ గారి రాజ రాజేశ్వరి స్తోత్రం తో సుప్రభాతం అవటం మనం ఈ రోజుల్లో ఊహిన్చలెము .  మల్లాది సూరిబాబు గారి లింగాష్టకం, బాల మురళి రామదాసు కీర్తనలు, మధురాష్టకం, సుప్రభాతం, దేవి స్తుతి, సత్యదేవుని పాటలు, ఇలా చెప్పుకుంటూ పొతే మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం అనిపిస్తుంది. ముఖ్యం గా వాయులీనపు నేపద్యం లో మల్లిక్ గారి మంద్ర స్వరం లో ఆ స్తోత్రం పోద్దుపోద్దున్నే మనసుని ప్రశాంతం గా చేసేది. (ఇది ముఖ్యం గా విజయవాడ స్టేషన్ వినేవాల్లకే).
ఇప్పుడు కూడా ఆ పాత మధురాల్ని ఆలిండియ రేడియో వాళ్ళు తమ archieves దుకాణం లో అమ్మకానికి పెట్టారట. వీలయితే కొనుక్కుని, ఆ మధురాల్ని అచ్చంగా ఉన్చేసుకోండి.  నా మటుకు నాకు నా బాల్యం అంటే గత స్మృతులన్నీ సున్నాలు చుట్టుకుంటూ ఆ నేపధ్య సంగీతం తో కనివినిపిస్తాయి. ఇక శ్రావణ  మాసం లో (మా) బందరు, వర్షం లో పొద్దస్తమానం స్నానం చేస్తూనే ఉండేది. చల్లటి ఆ వాతావరణం, బురద బురద (కొండొకచో నీరు నిండిన) రహదారులు, ఆ వర్షం లో తడుస్తూ ఊరంతా తిరగడం, పేరంటాళ్ళు, పట్టు చీరల రెపరెపలు, తాంబూలాలు, శనగలు  సెనగల మసాల గారెలు,  ఇంకా ఇంకా చాలా ... నాకు నచ్చిన నా పాత జ్ఞాపకాలు.

1, ఏప్రిల్ 2010, గురువారం

పాత జ్ఞాపకం.

మా బ్యాంకు సంవత్సరీకాలు మూలంగా (అపార్థం చేసుకోకండి, నా ఉద్దేశ్యం annual closing ) మీతో మనసు విప్పి మాట్లాడలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. పొతే, ఈ సోది పుస్తకం మొదటి పుటలో మీకొక అమాయకమైన ప్రాణి చిత్రం కనపడుతూ ఉంది ఉంటుంది, కొత్తగా.  అది, .......... నేనే.  దాని పూర్తి వివరం ఆ లంకె లోకి వెడితే కనిపిస్తుంది,
మరి చూస్తారు కదూ...
మీ లక్ష్మణ కుమార్ మల్లాది.

24, మార్చి 2010, బుధవారం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం
జగత్ప్రసిద్ది ఐన శ్రీ సీత రామ కళ్యాణం ఎన్నో శతాబ్దాలు/సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్న ఆనందకరమైన పండుగ. మన భద్రాద్రి లో జరిగే కళ్యాణం నిజం గా సీతారాములను అక్కడ ఆహ్వానించి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి, పవిత్రత అక్కడ ప్రత్యక్షం గా చూస్తున్నా, రేడియో లో వింటున్న, తలచుకున్న చాలా ప్రత్యేకం గా నాకు అనిపిస్తుంది. (ఇది చాల సంవత్సరాల క్రితం మాట) ఆ రోజుల్లో ఉషశ్రీ గారి వ్యాఖ్యానం తో సాగే కళ్యాణ ప్రసార కార్యక్రమం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, చెణుకులు, తళుకు బెళుకులు కళ్ళకు కట్టినట్టుగా అయన వివరిస్తుంటే ఆ కళ్యాణం మన చేతులతో చేస్తున్నట్టుగా అనిపించేది. తరువాత మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి కాలం లో కూడా చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. ఇంట్లో పూజ త్వరగా ముగించుకొని అది వినటం కోసం మా తాతయ్య తో సహా వేచివుందేవాళ్ళం.  ఈ రోజుల్లో ఎవరు వ్యాఖ్యానం చెపుతున్నారో తెలియదు  ...., అవి వినటానికి కూడా ఇప్పటి వారికి తీరిక లేదు.  రేడియో పూర్తిగా మరుగున పడిపోయింది.
సరిగ్గా కళ్యాణం అయిపోవచ్చే సమయానికి మా బందరు లో ఇంటి దగ్గర వున్నా సాయి మావయ్య (ఇప్పటి దత్త ఆశ్రమం ఎదురుగా) వాళ్ళ రామాలయం లో పానకం కోసం పరిగెత్తే వాళ్ళం. ఈ పండుగ ప్రత్యెక ప్రసాదం అదేగా.
రామనాయుదిపేట కూడలిలో వినాయక చవితి, శ్రీరామనవమి పండగలకి పందిళ్ళు వేసి (తాటాకు తో, కొత్త ఆకుల వాసన బాగుండేది) ప్రతిరోజూ రాత్రికి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. చవితికి కోట సచితానంద శాస్త్రి హరికధలు, శ్రీరామనవమికి నాటకాలు, ప్రొజెక్టర్ తో సినిమాలు తప్పకుండ చూసేవాళ్ళం.
శ్రీరామా నామాలు, కీర్తనలు, కావ్యాలు, పాటలు మన తెలుగు జాతికి తరగని సంపదలు.
వాటిని మనకు అందించిన వాల్మీకి, త్యాగయ్య, రామదాసు ఇత్యాదులు, గానం చేసిన దాసులు, గాయకులూ ధన్యులు. రామ నామ జపమే తన జీవన పరమావధి గా గడిపిన పవన పుత్రా హనుమాన్ కు నా నమస్సులు.
 మీకందరకూ శ్రీరామా కళ్యాణ శుభమాహోత్సవాన ఇవే నా శుభాకాంక్షలు.
శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి, బహు తీపి... అన్న పాట వింటూవుంటే ఆ రామచంద్రుని పై ఉన్న భక్తీ, ఆదరం, గౌరవం రెట్టింపు అవుతుంది. సకల గుణాభిరాముడు, ధర్మార్ధకామములందు విచక్షణ తో ప్రవర్తించి మానవాళికి ఆదర్శ ప్రయుడై నిలచిన ఆ పట్టాభి రామునికి నమస్సులతో,
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

మీ లక్ష్మణ కుమార్ మల్లాది. మీ స్పందనలను నా మెయిల్ కు పంపండి, mailto:malladi.lakshman@rediffmail.com

13, అక్టోబర్ 2009, మంగళవారం

దీపావళి అందరికి చిన్నతనాన్ని గుర్తు తెస్తుంది. అలా కాని వాళ్ళెవరో చెప్పండి?
అప్పుడు వున్న ఉత్సాహం ఆనందం ఇప్పుడు కావాలంటే రాదు. మన పిల్లల్ని చూసి మన చిన్నతనాన్ని గుర్తుచేసుకోవాలి
విరుసిన ఆనంద దీపావళి, కురిసిన అనురాగ దీపాలివి......... అని రేడియో లో సుశీల పాట వింటూ ఆ పండుగ జరుపుకోవటం ఇపుడు ఒక జ్ఞాపకం మాత్రమే అయిపొయింది.
మా తాతయ్య దీపావళి రాత్రి పెద్ద ఇత్తడి పళ్ళెం లో తెచ్చిన దీవాలి టపాకాయలు పోసి, ఒక్కొక్కళ్ళని పిలిచి మతాబులు, చిచుబుడ్లు, భూచక్రాలు, తాళ్ళు, టపాకాయలు పంచేవాడు. ఎవరికి వాళ్ళు ఒక్కో ప్లేస్ లో సెటిల్ అయ్యే వాళ్ళం. మొదలెట్టా మన్నప్పుడే మొదలెట్టాలి, లేకపోతే కేకలేసేవాడు. ఒకళ్ళ తరవాత ఒకళ్ళు వెళ్లి రోడ్డు మీద భూచక్రాలు, చిచుబుడ్లు పెట్టి కాల్చి వచ్చే వాళ్ళం. అప్పట్లో తాడు బాంబులు, లక్ష్మి బాంబులు అంటే నాకు చచ్చే భయం. కాల్చే సమస్యే లేదు. అద్రుష్టం కొద్ది ఇప్పటి వరకు దీపావళి రోజు చేతులు కాల్చుకోలేదు. అంతా  అయిపోయాక, చేతులు కడుక్కొని తొక్కుడు లడ్డులు తినటం ... ఆ రుచే వేరు. రుచులందు తొక్కుడు లడ్డు రుచులు వేరయా అని......
ఈ సారి దీపావళి కే నెనూ ఒక చిన్న ఇల్లు కొన్నాను, అక్కడ చేసుకోవాలని అనుకున్నాను కానీ, ఇంక మరమ్మతులు వున్నాయి. వచ్చే దీపావళి స్వంత ఇంట్లో చేసుకుంటానని ఆశిస్తాను.
ఇక అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీ అందరు సుఖ సంతోషాలతో రంగురంగుల , శబ్దాల, హరివిల్లుల తో ఈ దీపావళి జరుపుకుంటారని, చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా వుంటారని ఆశిస్తూ ...................................
మీ ఆత్మీయ లక్ష్మణ్ కుమార్ మల్లాది.

17, సెప్టెంబర్ 2009, గురువారం

చానా రోజులయ్యింది మిమ్మల్ని పలకరించి....
ఇప్పుడు చెప్పోచ్చేదేటంటే, ఉన్నపళాన  రావుగోపాలరావు స్టైలు లోకి  దిగిపోయి ముత్యాలముగ్గు ని గుర్తుతెచ్సుయ్యలని నా కోరిక!!
"పొద్దున్నే పరగడుపున పచ్చి మంచినీళ్ళు పుచ్చుకొని, ఆ ప్రత్యక్ష నారాయణున్ని సేవించుకోవాలని నాకూ వుంటుంది. సెకెట్రీ, (పక్కన సెకెట్రీ ఉండలేగాని మనం ఈ డొక్కు ఉద్యోగం ఎందుకు చేస్తాం).....
అ ఆ ఆఅకాశం (యాస లెండి సర్దుకుపొండి)లోకి చూడు, మర్ఢరై పోనట్లేదు, సూరీడు నెతుటిగడ్డలా లేడూ , యెన్సేపు తిని తొంగుంటే కాదయా, కుసింత కలాపోసన ఉండాలా."
... అని డైలోగులు చెప్పుకొటం కాదు, పెందలకడే లేచి ఆ సేవ చేసుకోవాలన్నమాట, కాని అవన్నీ ఆలోచిస్తుంటే ఎక్కడ కుదురుతై  చెప్పండి, ఎంతమటుకు మన నిద్ర, భోజనమే సరిపోతుంది, పట్నం జీవితం??
బాపు గారి కో కో (కోతి  కొమ్మచ్చి  నండీ, స్వాతి చదవడం లేదా ) లాగే దారితప్పి టాపిక్ పక్కకెళ్ళి పోతున్నాను.
ఇయ్యన్నీ ఎందుకండీ, రేపు ఆదివారం వీలు చూసుకొని మంచి సోది కొడతాను, చదేవేయ్యండి మరి
ఉంటాను, మా ఆవిడా పిలుస్తోంది (నీవు లేక వీణ పలుకలేనన్నది .......(రింగ్ టోను ) అంటూ 

మరి ఉంటాను, శుభ రాత్రి,
....................మీ లక్ష్మణ్

7, సెప్టెంబర్ 2009, సోమవారం

గోంగూర పచ్చడి

ఆహా ఏమి రుచి, అనరా మైమరచి, రోజు తిన్న మరి, మోజే తీరనిది
తాజా కూరలలో రాజ ఎవరండి, ఇంక చెప్పాలా గొంగురే నండి
ఓ .....ప్రియ ప్రియ,
రోజు మనచేత చేయబడు చెత్త చెత్త కూరలు తిని తిని, మా శంకర్ కి కూడా విసుకు పుట్టింది, వెంటనే మన విజయవాడ ప్రియ పచ్చడి గోంగూర కొని తెచ్చాడు, ఇక చూసుకోండి కమ్మగా తిని, బ్రేఅవ్ మని త్రెంచి, ఇక రాద్దామని కూర్చున్నాను
ఈసారి ఇంటికెళ్ళి వచ్చేప్పుడు మా ఆవిడని మంచి కొండ గొంగురతో వెల్లుల్లి దట్టించి రోటిలో దంచి ఇమ్మని అడగాలి
మన తెలుగు వారి భాగ్యమేమో గాని ఎవరికీ లేని ఊరగాయలు రుచులు ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, దబ్బకాయ, చింతకాయ ఇంకాదానిలో రకాలు పులిహోర అవయకాయ, వెల్లుల్లి ఆవకాయ, పెసర ఆవకాయ, బెల్లం ఆవకాయ.............. ఎందుకులెండి మీ నోరు ఊరుతుంది !!!!!!!!
మీ ఇంట్లో కూడా చెప్పి రకరకాల రుచులు చేయించుకోండి, ఇంకో సంగతండొయ్ , పెళ్ళాం మాంచి మూడ్ లో ఉన్నప్పుడే చెప్పండి, లేకపోతే అష్టోత్తరం చేసేస్తారు ........ కాకపోతే ఈ రోజులలో ఇంట్లో పచ్చడి ఎవరు చేస్తారండి, ఒక్క మా ఆవిడా తప్ప,
మీ 

లక్ష్మణ కుమార్ మల్లాది 

ముందు మాట

ప్రతి పుస్తకానికి ముందు మాట ఉంటుంది. అలాగే నా బ్లాగ్ కి కూడా ఒక బిల్డుప్ ఇచ్చుకోవాలి కదా
అసలు పేరు గురించి మీకు ముందు చెప్పాలి. అచ్చ తెలుగు పేర్లు చాల ట్రై చేశాను. అన్ని ఇంతకూ ముందే వాడేసారు. ఇక మనకి బంతిపూలంటే చాల ఇష్టం, దాని ఆకుల వాసన చాల లైవ్లీ గా ఉంటుంది. అందుకని ఆ పేరు పెట్టేసాను.
నాకు తెలుగన్నా , మన సంస్కృతీ సాంప్రదాయాలు అన్నా చాల ఇష్టం. మన తెలుగు పాటలు, కథలు, జానపదాలు, సినిమాలు ... మనకు లేనివి ఏవి, పురాతనమైన మన ఆచారాలూ, పల్లెలు, పైర్లు, పండగలు, మల్లెలు, జాజులు, సంపెంగలు, మామిడి పండ్లు, చెరువు గట్లు , ఇలా చెప్పుకుంటూ పోతే చిరిగి చాంతాడు అవుతుంది ఈ జాబితా.
చిన్నప్పుడు అంటే 1980-95 లలో చాల భావుకత తో తెలుగు లో ఉత్తరాలు రాసేవాడిని, అప్పట్లో నా ఉత్తరాల కోసం జనం చకోర పక్షుల్లా ఎదురు చూసేవారు. పెళ్ళయ్యాక కొంచెం (బాగా) జోరు తగ్గింది. ఈ మధ్య ఉద్యోగ రీత్యా చెన్నై లో (కొంచెం ఖాళీ గా)ఉండటం వలన మళ్ళీ  నా ఊహలను మీ అందరికి పరిచయం చేసే వీలు కలుగు తోంది. తెలుగు రాసే పధ్ధతి ఉండటం వలన కూడా భావ వ్యక్తీకరణ పూర్తిగా ఉంటుంది. నాకు నచ్చిన, నేను మెచ్చిన ఏ వస్తువు పై నైన నాకిష్టం వచ్చినట్టు గీకేస్తాను,
ఇక కాచుకోండి................ మీ లక్ష్మణ్

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

మొదటి చిలక పలుకులు, శ్రద్ధగా వినండి (చూడండి)

మొదటిసారి బ్లాగ్ రాసేస్తున్ననంటే నాకు నేనే శభాష్ అనుకోవాలి, ఎందికంటే, పెద్దపెద్దోల్లె తెగ రాసేస్తుంటే పిల్లగాల్లం మనమొక లెక్కా

ఇంతకీ చెప్పొచ్చే దేంటంటే నీనూ ఒక బ్లాగర్ అయ్యనోచ్చ్ !!
ఇక నా సోదంతా చూసి చూసి, చదివి మీరు అలసిపోతారంటే నమ్మండి

ఇక అర్థరాత్రయ్యింది కానీ ఈ రోజుకి మిమ్మల్ని ఒదిలేస్తున్నాను, లేకుంటే, నా తడాకా ఇప్పుడే మీకు చుపించేద్దును