మధురాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మధురాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2013, మంగళవారం

అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనసింహధ్వజముగ్రాలచూడవలదే.....



నేడే చూడండి
బందరు శ్రీ దుర్గా మహల్ లో
మీ అభిమాన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరు తారక రామారావు మరియు మీ అభిమాన తారాగణం సావిత్రి, అక్కినేని, రేలండి రమణారెడ్డి  ఎస్ వీ రంగారావు మొదలగువారు నటించిన
మాయా బజార్
 ...........................

అసలు ఇక్కడే ఎందుకు చూడాలి? ఏం పెద్ద గొప్ప ఆ టాకీసు అని అంటారని నాకు తెలుసు!!!
మీరు వినలెదా... మచిలీపట్నం మాయాబజార్ మాటనీ కొస్తే లైనేసా ... అన్న పాట. ఇదేకాకుండా సుందరాకాండ సినిమాలో మచిలీపట్నపు మాట్నీ ఆటకు బాక్సులు నిన్డునులే అని ఇంకొన్ని తెలుగు పాటల్లో కూడా బందరు, మాయాబజారు ప్రస్తావన కనిపిస్తుంది.

మయా బజార్ విడుదలైన కొత్తల్లో దుర్గా మహల్ లో ప్రతిరోజూ పండగట అని పెద్దవాళ్ళు అంటుండగా విన్నాను. ఆంధ్రావని అంతటా తారక రాముడికి  తెర ముందే  నీరాజనాలు ఇచ్చేవారని ప్రతీతి. అప్పట్నుంచే ఇంతమంది గుండెల్లో చోటు చేసుకున్న ఈ సినీరాజాన్ని ఇప్పుడు యావత్ భారతానికే నచ్చిన మొదటి  చలన చిత్రం గా మహా మహా సత్యజిత్, శ్యాం బెనగల్, గురుదత్, రాజ్ కపూర్, మృణాల్ సేన్ వంటి వారి చిత్రాలను తోసిరాజని, బెంగాలీ, హిందీ  కావ్యాలని పక్కన పెట్టి, ఎన్నికవ్వటం మన ఆంధ్రులకి గర్వకారణం.

ఈ సినిమా గురించి బ్లాగ్లోకం లో చాలా మంది చాల రకాలుగా చెప్పెసుకున్నారు. మాయ శశిరేఖ పేరు పెట్టుకున్న బ్లాగరి ఆ. సౌమ్య గారు కూడా పలువురు మెచ్చగ ఇట్లా (మాయాబజార్ – పాండవులు లేని భారతం), ఇంకా భండారు శ్రీనివాసరావు గారు (http://bhandarusrinivasarao.blogspot.in/2013/05/blog-post_2772.html) రాసేసారు.
ఏమో, యెంత చెప్పినా యెంత వినినా తినగా తినగ వేము (ఇది వేము కాదండోయి, ప్రాస కోసం అని మనవి) ఇంకా తీయనగునని చూడగా చూడగా ఇంకొద్ది గొప్పతనం, వింత బయటపడుతుందని అనుకొని , తెలుసుకొని , మళ్ళీ ఇలా రాసే అవకాశం ఈ శుభ సందర్భంగా నాకు కలిగిన్ది.

ఏ రకం గా చూసినా, ఏ కోణాల్లో చూసినా, ఏ శాఖ లో వెతికినా తప్పు పట్టటానికి వీలులేని కళాఖండం "మన" మాయాబజారు . వింత కొలిపే మార్కస్ బార్లె ఛాయాగ్రహణం నలుపు తెలుపుల్లో ని వెన్నెల నీ, చందమామ నీ, హాయి గొలిపే  చల్ల పిల్ల గాలినీ, ఆ గాలికి ఊయలలూగే పైరునీ కథానాయకుడు ప్రియురాలి సరాగాలనీ ఇంపుగా చిత్రించి చూపారు. పింగళి గారి మాటకారితనం గురించి చెప్పనలవి కాదు (నాకు , పైన పేర్కొన్న బ్లాగరి ఇప్పటికే చెప్పేశారు). వింతలూ భ్రాంతులూ విషయానికొస్తే అప్పుడెప్పుడో 1957 లోనే మన దృశ్య శ్రవణ పెట్టె ని అప్పటి  వీక్షకులకు పరిచయం చేసారు రెడ్డి గారు. బిగ్గు బజార్లని, వన్ మాల్ నీ అప్పుడే ఊహించేసారు విడిది లో సృష్టించేసారు . అం ఆహా అంటూ గింబళి, గిల్పం సృష్టించేసారు. రథ చోదకుడు భళి భళి దేవా అని పాడినా, ఘటోత్కచుని  శిష్యులు అల్లరి ఆగం చేసినా, అలమలాలు వీరతాళ్ళు అన్న కొత్త పదాలు కనిపెట్టినా , చిన మాయను పెను మాయ అని కృష్ణ పాత్రని ముసలి బ్రాహ్మడిగా చూపించినా ప్రేక్షకులకి వినోదిన్చారే గానీ విసుగు పుట్టలేదు చిత్ర నిడివి వల్ల కానీ తడవ తడవ కీ వచ్చే పాటల వాళ్ళ కానీ  అలుపు వెయ్యలేదు. సావిత్రి ఆహ నా పెళ్ళంట అంటూ చూపిన నటన ఇంకా ఏ ఇతర నటీమణుల నటన లోనూ చూడలేము.  తడబాటు సిగ్గు కలగలిపి నాట్యాన్ని  జోడించి మధ్యలో మగతనపు భావ ప్రకటన చూపి కలగలిపిన ఆ సన్నివేశాలు  చిత్రానికే మకుటాయమానం. 

నటన లో జంట కవులవంటి నందమూరి అక్కినేని నటనా చాతుర్యం, రేలంగి, రమణారెడ్డి హాస్యం, ఘంటసాల, లీల, సుశీల, మాధవపెద్ది గళవిన్యాసమ్, పింగళి వారి పద విన్యాసం, ఘంటసాల వారి స్వరాలూ అన్నిటినీ మించి ఎస్వీ రంగారావు ఘతొత్కచీయమ్ .... వీటన్నిటికీ 

చిత్ర నిర్మాణానికి పని చేసిన అందరికీ 

వీరందరికీ రంగులద్దిన చిత్రకారులకీ 

ఇంత అరుదైన చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్న ఆంధ్రు లందరికీ 

ఎన్నిక కు కారకులైన అందరికీ 
  
మాయాబజార్ సినిమా మొత్తం డైలాగులు, పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే వాయించెయ్యగలను.- అని ధంకా బజాయించి చెప్పే బ్లాగు వీరుడు రవికిరణ్ గారికీ, ఇంకా ఆ.సౌమ్య గారికీ 

వివాహ భోజనంబు అంటూ ఇప్పటికీ మాధవపెద్ది గళమే వింటున్నామా అని అనిపించేలా పాడగల అభినవ మాధవపెద్ది సత్యం నా సహోద్యోగి చింతలపాటి సురేష్ ( చింతలపాటి సురేష్) గారికీ 

చివరగా, అప్పటి కాలానుగుణ పరిస్తితులను బట్టీ సాహసం చేసి వింతలూ విశేషాలతో ఏర్చి కూర్చటమే కాకుండా వ్యాపారాత్మకం గా అలోచించి, ఈ చిత్రాన్ని రాసినా చూసినా సకల సౌభాగ్యాలు సంపదలూ కలుగుతాయని ఫలశ్రుతి చెప్పించిన కె వి రెడ్డి గారి ఆలోచనకు 

వేసెయ్యండి వీరతాళ్ళు. 

ఈ పద్యం ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను :

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"


మరిక సెలవా .... 
మల్లాది లక్ష్మణ కుమార్  
 





20, మే 2011, శుక్రవారం

మధురం ఈ రాగం ...


ఈ మధ్య బ్లాగుల్లో చూసి నేర్చుకున్న విష్యం ఏమిటంటే మనకి నచ్చిన పాటలను మీకు బ్లాగ్ముఖంగా వినిపించవచ్చును అని.  ఈ విషయమై ఒక బ్లాగరు ను సంప్రదించగా వారు ఇచ్చిన సలహా మేరకు నాకు మొదటగా నచ్చిన ఒక పాట ను మీకు వినిపించ దలుచుకున్నాను. అసలు మొదటిసారిగా నేను ఇంతకు ముందు పుటలలో చెప్పిన ఆకాశవాణి వారి "రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను. కానీ అవి ఆకాశవాణి వారి ఆంతరంగిక రక్షణ (rights protected ) చే రక్షించబడటం వలన embaded సూత్రం జనించక (ఆ స్తోత్ర రాజాన్ని మీరు ఈ లంకె ద్వారా పొంది  వినవచ్చు:    స్తోత్రం   ) ఆ ప్రయోగం మానుకుని, మన ఘంటసాల గారి  ఆ పాత మధురాల లో నుంచి 'రసికరాజ తగువారము కామా .....' అన్న జయభేరి చిత్రం లోని ఒక పాట రాజాన్ని నా మొదటి ప్రాధాన్యతా క్రమ పట్టిక నుంచి బయటకు తీసి రికార్డు వేస్తున్నాను. విని ఆనందించండి. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ పాత గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను.



పేరు పొందిన వేదికల మీదనుంచి రకరకాల గాయకులూ ఈ పాట ను పాడటానికి ప్రయత్నించగా చాలా సార్లు నేను విన్నాను. కానీ, అసలు ఉన్నంతగా కొసరు ఉండక, అంత రుచి రాలేదు.  ఒక పోటీ లో మన 'శ్రీరామచంద్ర', అదేనండీ సోనీ వారి గాయక సామ్రాట్, అలవోకగా ఘంటసాల లెవెల్లో అతి మధురం గా గానం చేసాడు. ఆ పోటీలో నెగ్గక పోయినా రచ్చ గెలిచి ఇంటికి తిరిగి వచ్చాడు. సాంప్రదాయక సంగీత బాణీ లో ఉన్న ఈ పాట ను మీరు తప్పక ఇష్ట పడతారని ఆశిస్తూ...

ఒక్క క్షణం ఆగండి... ఏమండీ! ప్రక్కన నేను కొత్తగా చేర్చిన సభ్యుల జాబితా చూసారా, ఎవరూ సభ్యులు లేక నేనే మొదటి వాణ్ని అవ్వాల్సి వచ్చింది. మీకు ఏ మాత్రమైనా నా కబుర్లు నచ్చినా నా బ్లాగు ను అనుసరిస్తూ, సభ్యులు  గా చేరి నాను ఆదరించగలరు.       సరేనా!!!  

మరిక సెలవా మరి...

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది



7, జులై 2010, బుధవారం

సంగీతం పరమౌషధం!!!

ఈ మధ్య మా టీవీ లో వచ్చే సంగీత సంబరాలు చూస్తున్నారా! క్రితం వారం జరిగిన పోటీలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడేసారు. విష్యం ఏమిటంటే, దానిలో  ఒక  గాయని  పడిన  రాగం లోని  పాట.



 "రాగం" అని మన తెలుగులో వచ్చిన చిత్రం(చలన) ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. "తాయే యశోద" పాట ఎంతమంది విన్నారు? పోనీ ఇప్పుడైనా చేతులు ఎత్తండి!!



సంగీతం మానవ జాతికి యెంత అవసరమో, "శిశుర్వేత్తి  పశుర్వేత్తి ..." అని ఎందుకన్నారో, అన్ని బాధలు, అలజడులు సంగీతం తో ఎలా నయమవుతాయో, అసలు సంగీతం తో వైద్యం చెయ్యగలరా............       ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఈ పాట. (మహా మహా గొప్ప విద్వాంసులు/పాటలు మనకి చాలా వున్నాయి. ఏదో ఈ పాట గురించి అనుకుంటున్నాం కదా అని ఈ వ్యాఖ్య, గమనించగలరు).  ఆలాపన  తో మొదలైన  పాట గాయని  గొంతుతో  పాటు  రాగాలు  తీసే  వాయులీనం, పాశ్చాత్య  రాగాల /వాద్యాల  మిశ్రమం (fusion) మననీ  ఏదో  లోకాలలోకి  తీసుకుపోయి , విహరిమ్పచేసి అలరిస్తుంది.



ఒకప్పుడు "పాడుతా తీయగా" అన్న బాలు గారి కార్యక్రమం కోసం  మధ్య మధ్య లో  అయన చెప్పే  పాటల తెర వెనుక కధలు గురించి,  ఆ పాటల గురించి అయన వ్యాఖ్యానం, అయన చెప్పే తేట తెలుగు పద్యాల గురించి...... ఇలా చాలా వాటి గురించి చకోర పక్షుల్లాగా ఎదురు చూసే వాళ్ళం.  తెలుగు పాట ఎన్ని రకాలు గా పురుడు పోసుకుందో, ఎన్ని వయ్యారాలు పోయిందో, ఎన్ని రంగుల కళలు కందో, గాయకులు ఆ కార్యక్రమం లో పాడే పాత.. ఆపాత మధురాలు విని పులకించిపోయే వాళ్ళం. ప్రస్తుతం బహుళ ప్రచారం కోసం ఈ మధ్య వచ్చే సంకర పాటలు (పాతకులు/పాటకులు/పాఠకులు క్షమించాలి! లెస్స పలికితివి వత్సా! అని అనే వాళ్ళుంటే  ... ధన్యవాదాలు) అంటే అనీ కాదు, ఈ రోజుల్లో కూడా మంచి పాటలు వస్తున్నై. కాదని అనడంల్లేదు, కానీ ప్రేక్షకుల మనోరంజనం  కోసం చేసే చోట మంచి పాటలు పాడాలి. ఒక రోజు పాల్గొన్న గాయకుడు కూడా ఈ రకమైన బాధ వెలిబుచ్చారు. అయన ఒక మంచి పాత పాట పాడగా, న్యాయ నిర్ణేత అడిగారు, అందరూ ప్రస్తుత కాలం పాటలు పాడగా నువ్వు ఇలా చేసావేమిటి అని. దాని కోసం టీవీ వారిని ప్రాధేయపడి పాడాను అని చెప్పాడు కూడా.
ఇన్ని ఇలా జరుగుతుండగా, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుడు శ్రీ కీరవాణి (పేరులో తెలుగుతనం చూసారా) తనకు నచ్చిన పాటలు పాడితేనే వస్తాను అని షరతు తో వచ్చానని చెప్పారు. ఇంతకీ ఆ పాటలు ఏమిటో తెలుసా.. అలనాటి మల్లేశ్వరి లోని 'ఎందుకే నీకింత తొందర ..' , మరొక ఎప్పుడు వినని ఆణిముత్యం లాంటి పాట, ఆయనకి మన పాత మూలాలు మీద పట్టు వుండటం తోనే, తన పాటలు అంత శ్రావ్యం గా ఉంటాయి. కులుకుల కీరవాణి అని నేను సేకరించి పదిలపరచిన అయన పాటల గుచ్చానికి పేరు పెట్టుకున్నాను.



మరి ఏవీ ఆ పాత మధురాలు. ఏవీ ఆ మధుర మధురోహల సొబగులు. వింత దరువుల, వింత గొంతుకల, వింత విన్యాసాల పాటలు ఈ గాయకులూ పాడటం, వహ సెహబాస్ అని ఇతరులు పొగడటం, ఆకాశానికి ఎత్తే యటం .. నాకు మాత్రం నచ్చలేదు. మీరు ఎమనుకోపోతే ఈ మధ్య వచ్చిన రెహమాన్ రేహమేనియా కూడా అంత వినసోమ్పోగా లేదు. (మణిరత్నం మాయాజాలం మరుగైనట్లుగా..)



దయచేసి మన పురాతన నిధి ని పదిలంగా ఉంచండి, పదిమందికీ వినిపిమ్పచేయండి, ఆహ్లాదం కలిగించేలా అనుభవించండి, ఆ అనుభూతిని రోజంతా పదిలపరుచుకోండి.



మీ
మల్లాది లక్ష్మణ కుమార్

8, ఏప్రిల్ 2010, గురువారం

ఇళయరాజా

ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునే చాల చాల మంది లో నేను ఒకడ్ని . అంటే నా చెవులు ఇప్పటికే తెగిపోయి ఉండాలి అని అనమోకండి. చెన్నై వచ్చాక సంగీత దాహం చాల మటుకు తీరింది. ప్రతి రోజు ఆఫీసు నుంచి రాగానే ఎఫ్ ఎం లో ప్రతి ఛానల్ లో రాత్రి తొమ్మిది గంటల నుంచి సంగీత ప్రవాహం మొదలవుతుంది. దాదాపు అన్ని అలవరసలలోను నిరంతర గానామృతం ప్రవహిస్తూంటుంది. మన తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా తమిళ భాషలో చాలా చాలా విబ్భిన్న తరహాలలో సంగీతం రచించారు ఇళయరాజా. ఇక్కడ నాకు బాగా నచ్చిన కొన్ని పాటల లంకెలు ఇస్తున్నాను. ఇవి విని రాజా గారికి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పండి  ... ఎందుకంటే సంగీతం పరమౌషధం! భాషా బేధం లేనిది సంగీతం.

౧. నిలావే వా...(మౌన రాగం చిత్రం లోనిది)    http://www.tamilwest.com/tamilsongs/inter/Mouna%20Raagam/ 
౨. ఎన్వానిలే ఒరే వెన్నిలా... , కాట్రిల్ ఎన్ధాన్ గీదం    http://www.tamilwest.com/tamilsongs/inter/johnny/
౩. పురువమే పుదియ పాడ పాడల్... (ఇది మన తెలుగులో కూడా వున్నది, పరువమా చిలిపి పరుగు తీయకు అని )
౪. నాన్ పాడుం మౌన రాగం ....   http://www.tamilwest.com/tamilsongs/inter/IdhayaKoyil/
౫. పెన్మానే సంగీతం పాడి వా ....  
                           http://www.tamilwest.com/tamilsongs/inter/Naan%20Sigappu%20Manithan/
౬. పూవే సెం పూవే ...  
                            http://www.tamilwest.com/tamilsongs/inter/Solla%20Thudikkuthu%20Manasu/
౭. రాసావే ఉన్నైనంబి (ఇది జానకి పాడిన పాత, ఎంత మధురంగా ఒక రకమైన యాస తో ఉంటుందో వినండి)
             http://www.tamilwest.com/tamilsongs/inter/Mudhal%20Mariyathai/
ఇవి కాక నా దగ్గర చాలా పాటలు సేకరించి ఉంచాను. పైన ఇవన్ని లంకెలతో ఎందుకు ఇచ్చానంటే మీరు వెంటనే అంతర్జాలం నుంచి పొందటానికి. చ్చాదస్తం అనుకోకండి, ఈ పాటలు వినండి.  మరిక ఉంటాను.  

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

1, మార్చి 2010, సోమవారం

ఈ పాటను వినండి, చాల బాగుంది

ఈ పాటను వినండి, చాల బాగుంది, తమిళ్ లో చాల శ్రావ్యమైన పాటలలో ఇది ఒకటి.  మన బాలు గారు తరచూ గా ప్రస్తావించే సంగీత రాక్షసుడు ఇళయరాజా గారి పనితనం మనకి ఈ పాట ద్వారా తెలుస్తుంది.
నాకు ఇష్టమైన పాటలలో ఇది ఒకటి.

link - http://smashits.com/tsearch/music/song/nilavu-thoongum-neram.html