1, ఏప్రిల్ 2010, గురువారం

పాత జ్ఞాపకం.

మా బ్యాంకు సంవత్సరీకాలు మూలంగా (అపార్థం చేసుకోకండి, నా ఉద్దేశ్యం annual closing ) మీతో మనసు విప్పి మాట్లాడలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. పొతే, ఈ సోది పుస్తకం మొదటి పుటలో మీకొక అమాయకమైన ప్రాణి చిత్రం కనపడుతూ ఉంది ఉంటుంది, కొత్తగా.  అది, .......... నేనే.  దాని పూర్తి వివరం ఆ లంకె లోకి వెడితే కనిపిస్తుంది,
మరి చూస్తారు కదూ...
మీ లక్ష్మణ కుమార్ మల్లాది.

29, మార్చి 2010, సోమవారం

మా చక్రవర్తి స్పందనలు మీ కోసం

క్రితం కబుర్లలో రాసినట్లు మా శ్రీరామ చంద్ర చక్రవర్తి సమయానుకూలంగా తెలియచేసే స్పందనలను మీకందరికీ పంచాలని అనుకుంటున్నాను, ఇక చిత్తగించండి !!!
""మందార మకరంద మాధుర్యమునదేలు  మధుపమ్ము ఓవునే మదనములకూ !
నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచ చనునే తరంగిణులకు !
లలితా రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుతజములకూ !
పూర్ణేందు చంద్రికా స్ఫ్హురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నీహారములకు !
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము 
ఏ రీతి ఇతరమ్ము జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ?!!  

శ్రీమన్నారాయణుని  పట్ల భక్తి ఎంత ప్రియమైనదో  !! తెలుగు లో మాత్రమే  ఆ అనుభూతి ని అంతే హృద్యంగా  పొందగలమని   పోతన వారి పద్యమే చెపుతుంది !! అంత తీయనైన తెలుగులో స్వీయ భావాలు, అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు పంచుకోవటం విశేష ప్రయత్నమే !! ఈ అంతర్జాల వీధి సోది  సుమాలలో మా లక్ష్మణుడి బంతిపూలు విలక్షణంగా విరబూస్తూ ఉంటాయని ఆశిస్తున్నాను !!  క్రొత్త పూత కోసం చూస్తూవుంటాను""

మీ అందరికీ మా నిత్య శుభాకాంక్షలు !!

24, మార్చి 2010, బుధవారం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం
జగత్ప్రసిద్ది ఐన శ్రీ సీత రామ కళ్యాణం ఎన్నో శతాబ్దాలు/సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్న ఆనందకరమైన పండుగ. మన భద్రాద్రి లో జరిగే కళ్యాణం నిజం గా సీతారాములను అక్కడ ఆహ్వానించి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి, పవిత్రత అక్కడ ప్రత్యక్షం గా చూస్తున్నా, రేడియో లో వింటున్న, తలచుకున్న చాలా ప్రత్యేకం గా నాకు అనిపిస్తుంది. (ఇది చాల సంవత్సరాల క్రితం మాట) ఆ రోజుల్లో ఉషశ్రీ గారి వ్యాఖ్యానం తో సాగే కళ్యాణ ప్రసార కార్యక్రమం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, చెణుకులు, తళుకు బెళుకులు కళ్ళకు కట్టినట్టుగా అయన వివరిస్తుంటే ఆ కళ్యాణం మన చేతులతో చేస్తున్నట్టుగా అనిపించేది. తరువాత మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి కాలం లో కూడా చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. ఇంట్లో పూజ త్వరగా ముగించుకొని అది వినటం కోసం మా తాతయ్య తో సహా వేచివుందేవాళ్ళం.  ఈ రోజుల్లో ఎవరు వ్యాఖ్యానం చెపుతున్నారో తెలియదు  ...., అవి వినటానికి కూడా ఇప్పటి వారికి తీరిక లేదు.  రేడియో పూర్తిగా మరుగున పడిపోయింది.
సరిగ్గా కళ్యాణం అయిపోవచ్చే సమయానికి మా బందరు లో ఇంటి దగ్గర వున్నా సాయి మావయ్య (ఇప్పటి దత్త ఆశ్రమం ఎదురుగా) వాళ్ళ రామాలయం లో పానకం కోసం పరిగెత్తే వాళ్ళం. ఈ పండుగ ప్రత్యెక ప్రసాదం అదేగా.
రామనాయుదిపేట కూడలిలో వినాయక చవితి, శ్రీరామనవమి పండగలకి పందిళ్ళు వేసి (తాటాకు తో, కొత్త ఆకుల వాసన బాగుండేది) ప్రతిరోజూ రాత్రికి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. చవితికి కోట సచితానంద శాస్త్రి హరికధలు, శ్రీరామనవమికి నాటకాలు, ప్రొజెక్టర్ తో సినిమాలు తప్పకుండ చూసేవాళ్ళం.
శ్రీరామా నామాలు, కీర్తనలు, కావ్యాలు, పాటలు మన తెలుగు జాతికి తరగని సంపదలు.
వాటిని మనకు అందించిన వాల్మీకి, త్యాగయ్య, రామదాసు ఇత్యాదులు, గానం చేసిన దాసులు, గాయకులూ ధన్యులు. రామ నామ జపమే తన జీవన పరమావధి గా గడిపిన పవన పుత్రా హనుమాన్ కు నా నమస్సులు.
 మీకందరకూ శ్రీరామా కళ్యాణ శుభమాహోత్సవాన ఇవే నా శుభాకాంక్షలు.
శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి, బహు తీపి... అన్న పాట వింటూవుంటే ఆ రామచంద్రుని పై ఉన్న భక్తీ, ఆదరం, గౌరవం రెట్టింపు అవుతుంది. సకల గుణాభిరాముడు, ధర్మార్ధకామములందు విచక్షణ తో ప్రవర్తించి మానవాళికి ఆదర్శ ప్రయుడై నిలచిన ఆ పట్టాభి రామునికి నమస్సులతో,
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

మీ లక్ష్మణ కుమార్ మల్లాది. మీ స్పందనలను నా మెయిల్ కు పంపండి, mailto:malladi.lakshman@rediffmail.com

20, మార్చి 2010, శనివారం

ఒక స్నేహితుడి స్పందన

మన తెలుగు భాష అందాలన్నీ దాని వివిధ రకాలైన యాసలలో నిబిడీకృతమై ఉన్నాయ్.  కృష్ణ వాళ్ళది స్వచ్చమైన భాష ఐతే, తెలంగాణా, కర్నూలు, చిత్తూరు (అరవం మిళితమైన), గుంటూరు, నెల్లూరు, గోదావరి, శ్రీకాకుళం (ఒక రకం రాగాలు దీర్ఖాలతో),  హైదరాబాది (ఉర్దూ తో) ఇత్యాదులైన రకరకాల యాసలతో తెలుగు హొయలు పోతోంది. దేని అందం, శ్రావ్యం, సాహిత్యం దానికి ప్రత్యేకం, దాని సొంతం. మా గోదావరి కథలు, (ప్రస్తుతం దిగువ గోదారి కథలు), నెల్లూరు కథలు, అల్లం రాజయ్య రాసిని కథలు, ఇలా వివిధ ప్రాంతాల భాష ఔచిత్యాన్ని మనకి తెలుపుతాయి.
మన ప్రాచీన (పాత) సాహిత్యం లో ఉన్న బ్రాహ్మణ ప్రత్యెక భాష చాలా హృద్యం గా ఉంటుంది.
ఇక విషయానికి వస్తే, నా స్నేహితుడు, గొర్తి శ్రీరామచంద్ర చక్రవర్తి, పంపిన మెయిల్ నుంచి మీకోసం అందిస్తున్న ఒక స్పందన ......

ఓ రెంకా రేవడ్సా ?!! కాదిస్కే !!

పొంతులు గారా !! పండక్కొచారాండీ , అమ్మగారు బాన్నారాండీ ?!!
చాన్నాళ్ళ కొచ్చారు !! ఓ పారొచ్చెల్లండి (మా ఇంటికి ) !!
ఊడ్పులౌతన్నై బాబు, మాపటికొస్తాను నాన్న గారికి సెప్పు !
ఆయ్ ! పెద్ద పాప భీవారవేనండి !!
సంటిదానికి ఈ సంకురేతిరి కి రెండొచ్చే !!
నానున్నాను గందా ?!!
పర్లేదండి నేనట్టుకొస్తాగా ! రేయ్ శీను ఆ పెట్టెత్తుకోరా !!
ఏవన్నా అవుసరవుంటే పిలవండి !
లే సారూ పొద్దుగాల్నే వస్తుంటి, గా కింద సారు కాడ ఆలస్సిమైపోనాది!!
అంతా మంచిగుందా సారు !! ఏడ సారు, దినాం పరేసానే గంద !!
అన్నీ ప్రియమైపాయే !! గీ ఔలగాండ్ల లొల్లి తో పరేసానౌతున్డాది !!
మగ బిడ్డ బాగా సదువుతుండు !! వాన్కి మంచి కొలువు దొర్కాల , ఇంకేం ఫికర్ లే !!
నాతానేడౌతాది సారూ ?! పెయి బాలే కుండే !
వొంకాయిలు , బీరకాయిలు, పొట్లకాయ ఆలుగెడ్డ టమాటాలు పచ్చిరపకాయలూ య
పాలకూర,గోంగూర బచ్చలి కూర కరేపాకు కొత్తిమీరా వ్
తమ్పడికాయిలు,తమ్పడికాయిలు, తమ్పడికాయిలూ వ్
ఆ కాఆపీ కాఆపీ కాఆపీ !!! ఏ టీ ఏ టీ ఏ టీ !!!
ఇడ్డి వడా ఇడ్డి వడా ఇడ్డి వడా ఇడ్డి వడా !!!
ఆ కాఆపీ కాఆపీ కాఆపీ !!! ఏ టీ ఏ టీ ఏ టీ !!!
డైవర్ బాబూ కొంచం బ్రేకు మీద కాలెయ్యి !!
నీక్కాదేటి సెప్పేది లోన కెళ్ళేహే !!
ఏ వూరు మన్దీ ?!!
నిడమానూరు బొస్సేడెక్కాలే ?!!
చోద్దెం సూత్నావేటే బొస్సెల్ పోతాంది లగెత్తూ !!
ఏక్ డజన్ దేడ్ రూపయా సాబ్ !
అడై రూపాయి కి ఇస్తావా ?!!
ఎండ కాల్తన్నది, ఈడ నీడుంది
అలాగ వెళ్ళిపోయి వచ్చెయ్యండి !!
ఈపాలిత్తాన్నాగా !
ఇపుడేటన్టావ్ !
బాబ్బాబు ఈపాలొగ్గెయ్యండి !!
పొయ్యిమీద ఎసరౌతోంది వొద్నా !!
పెద్దానికి అన్నం పడేయమని చెప్పా !
అమ్మా నాల్గు డబ్బాలేయ్యనా !!
పంతులుగారు బొత్తిగా నల్లపూసైపోనారు !
శాస్తుర్లు గారికి కుర్చీ తెండిరా !!
అమ్మా, ఫ్రెండింటి కెళ్లి వస్తానే !!
ఏరా హోం వర్క్ చెయ్యకుండా ఎక్కడికి తగలడ్డావ్ ?!
మీరేవన్నా చెప్పండి ఈ మారు మా ఇంట్లో చెయ్యి కడగాల్సిందే !
ఏవే అలా చూస్తూ నుంచుంటావే, ఇంకో మారు ఆ గారెలందుకో !
అన్నీ వడ్డించినా మారడగాలమ్మా !!
అక్కాయ్ హోటల్లో ఓ పెసరట్టు వేసుకుంటే సరి !
అల్లం మిర్చి మంచిగా దట్టించు !
బాబూ కొంచెం అల్లప్పచ్చడన్దుకో !!
కొంచం నడుమ్వాలిస్తే గానీ నా వల్ల కాదు రా !
వీడిని నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదారీదినట్టే !
ముసురట్టిందీవేళ , పకోడీలు వేసేదా ?!!
మరి బండి వాడి జిలేబీ తెచ్చేదా ?!!
అదడగాల్సిన మాటా అదీ ?!!

ఆ మాటా ఈ మాటా ఆ నోటా ఈ నోటా అంతా తెలుగే
అన్నింటా హాయిగా తీయగా సాగు తోంది నలుగు తోంది వెలుగుతోంది
విరోధిలో మొలకెత్తిన విషబీజాలు
వికృతి లో విరగడౌతాయని ఆశిద్దాం
విరోధి మలచి సయోధ్య సాధించి
తెలుగు పురోగతి సాగిద్దాం !!

విక్రుతములన్నీ సుక్రుతములౌ గాక
విరాగాములన్ని సరాగాములౌ గాక
యుగాది అంతా శుభాలగు గాక
- మీ మల్లాది లక్ష్మణ కుమార్

15, మార్చి 2010, సోమవారం

బెజవాడ బందరు మధ్య స్టేషన్లు

ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని "తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?" అని అడిగారట. ఆయన "తరిగొప్పుల" అని చెప్పాడట. కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ "వచ్చే స్టేషన్ పేరు?" అని అడిగితే పక్కనున్నాయన సమాధానం "ఇందుపల్లి" అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి" అని అడగ్గానే పక్కాయనకి విసుగు పుట్టి , "ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?" అని అడిగారట. దువ్వూరివారు మహాపండితులు, అయినా "ఏదో కొద్దిగా వచ్చులెండి" అని అన్నారు. అప్పుడు ఆ పక్కనున్నాయన "అయితే ఈ శ్లోకం రాసుకోండి - స్టేషన్ల పేర్లన్నీ గుర్తుంటాయి" అని ఇలా చెప్పాడట -


"బెరాని ఉత ఇందోగు నూక
వప్పెచిమాః క్రమాత్
స్టేషన్సు బెబం శాఖాయాం

నూక్రాస్యాదితి నిర్ణయః"


అప్పుడు శాస్త్రి గారు రాసుకుని చదువుకున్నారు


బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు - గుడ్లవల్లేరు
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపుడి
మ = మచిలీపట్నం
బెబం = బెజవాడ బందరు మధ్య స్టేషన్లు
కానీ "నూక్రాస్యాత్" అనే పదం అర్థం కాక ఏమిటి అని ఆ పక్కాయన్ని కదిపితే వెంటనే ఆయన " నూజెళ్ళలో క్రాసింగ్ అవుతుంది" అని చెప్పి దిగిపోయాట్ట. ఇంతకీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడి నామధేయం మాత్రం తెలీదు..
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)


బాగుంది కదూ మరి, ఈ/మా బందరు పిచ్చోళ్ళ గొడవ!!???