14, మే 2013, మంగళవారం

అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనసింహధ్వజముగ్రాలచూడవలదే.....



నేడే చూడండి
బందరు శ్రీ దుర్గా మహల్ లో
మీ అభిమాన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరు తారక రామారావు మరియు మీ అభిమాన తారాగణం సావిత్రి, అక్కినేని, రేలండి రమణారెడ్డి  ఎస్ వీ రంగారావు మొదలగువారు నటించిన
మాయా బజార్
 ...........................

అసలు ఇక్కడే ఎందుకు చూడాలి? ఏం పెద్ద గొప్ప ఆ టాకీసు అని అంటారని నాకు తెలుసు!!!
మీరు వినలెదా... మచిలీపట్నం మాయాబజార్ మాటనీ కొస్తే లైనేసా ... అన్న పాట. ఇదేకాకుండా సుందరాకాండ సినిమాలో మచిలీపట్నపు మాట్నీ ఆటకు బాక్సులు నిన్డునులే అని ఇంకొన్ని తెలుగు పాటల్లో కూడా బందరు, మాయాబజారు ప్రస్తావన కనిపిస్తుంది.

మయా బజార్ విడుదలైన కొత్తల్లో దుర్గా మహల్ లో ప్రతిరోజూ పండగట అని పెద్దవాళ్ళు అంటుండగా విన్నాను. ఆంధ్రావని అంతటా తారక రాముడికి  తెర ముందే  నీరాజనాలు ఇచ్చేవారని ప్రతీతి. అప్పట్నుంచే ఇంతమంది గుండెల్లో చోటు చేసుకున్న ఈ సినీరాజాన్ని ఇప్పుడు యావత్ భారతానికే నచ్చిన మొదటి  చలన చిత్రం గా మహా మహా సత్యజిత్, శ్యాం బెనగల్, గురుదత్, రాజ్ కపూర్, మృణాల్ సేన్ వంటి వారి చిత్రాలను తోసిరాజని, బెంగాలీ, హిందీ  కావ్యాలని పక్కన పెట్టి, ఎన్నికవ్వటం మన ఆంధ్రులకి గర్వకారణం.

ఈ సినిమా గురించి బ్లాగ్లోకం లో చాలా మంది చాల రకాలుగా చెప్పెసుకున్నారు. మాయ శశిరేఖ పేరు పెట్టుకున్న బ్లాగరి ఆ. సౌమ్య గారు కూడా పలువురు మెచ్చగ ఇట్లా (మాయాబజార్ – పాండవులు లేని భారతం), ఇంకా భండారు శ్రీనివాసరావు గారు (http://bhandarusrinivasarao.blogspot.in/2013/05/blog-post_2772.html) రాసేసారు.
ఏమో, యెంత చెప్పినా యెంత వినినా తినగా తినగ వేము (ఇది వేము కాదండోయి, ప్రాస కోసం అని మనవి) ఇంకా తీయనగునని చూడగా చూడగా ఇంకొద్ది గొప్పతనం, వింత బయటపడుతుందని అనుకొని , తెలుసుకొని , మళ్ళీ ఇలా రాసే అవకాశం ఈ శుభ సందర్భంగా నాకు కలిగిన్ది.

ఏ రకం గా చూసినా, ఏ కోణాల్లో చూసినా, ఏ శాఖ లో వెతికినా తప్పు పట్టటానికి వీలులేని కళాఖండం "మన" మాయాబజారు . వింత కొలిపే మార్కస్ బార్లె ఛాయాగ్రహణం నలుపు తెలుపుల్లో ని వెన్నెల నీ, చందమామ నీ, హాయి గొలిపే  చల్ల పిల్ల గాలినీ, ఆ గాలికి ఊయలలూగే పైరునీ కథానాయకుడు ప్రియురాలి సరాగాలనీ ఇంపుగా చిత్రించి చూపారు. పింగళి గారి మాటకారితనం గురించి చెప్పనలవి కాదు (నాకు , పైన పేర్కొన్న బ్లాగరి ఇప్పటికే చెప్పేశారు). వింతలూ భ్రాంతులూ విషయానికొస్తే అప్పుడెప్పుడో 1957 లోనే మన దృశ్య శ్రవణ పెట్టె ని అప్పటి  వీక్షకులకు పరిచయం చేసారు రెడ్డి గారు. బిగ్గు బజార్లని, వన్ మాల్ నీ అప్పుడే ఊహించేసారు విడిది లో సృష్టించేసారు . అం ఆహా అంటూ గింబళి, గిల్పం సృష్టించేసారు. రథ చోదకుడు భళి భళి దేవా అని పాడినా, ఘటోత్కచుని  శిష్యులు అల్లరి ఆగం చేసినా, అలమలాలు వీరతాళ్ళు అన్న కొత్త పదాలు కనిపెట్టినా , చిన మాయను పెను మాయ అని కృష్ణ పాత్రని ముసలి బ్రాహ్మడిగా చూపించినా ప్రేక్షకులకి వినోదిన్చారే గానీ విసుగు పుట్టలేదు చిత్ర నిడివి వల్ల కానీ తడవ తడవ కీ వచ్చే పాటల వాళ్ళ కానీ  అలుపు వెయ్యలేదు. సావిత్రి ఆహ నా పెళ్ళంట అంటూ చూపిన నటన ఇంకా ఏ ఇతర నటీమణుల నటన లోనూ చూడలేము.  తడబాటు సిగ్గు కలగలిపి నాట్యాన్ని  జోడించి మధ్యలో మగతనపు భావ ప్రకటన చూపి కలగలిపిన ఆ సన్నివేశాలు  చిత్రానికే మకుటాయమానం. 

నటన లో జంట కవులవంటి నందమూరి అక్కినేని నటనా చాతుర్యం, రేలంగి, రమణారెడ్డి హాస్యం, ఘంటసాల, లీల, సుశీల, మాధవపెద్ది గళవిన్యాసమ్, పింగళి వారి పద విన్యాసం, ఘంటసాల వారి స్వరాలూ అన్నిటినీ మించి ఎస్వీ రంగారావు ఘతొత్కచీయమ్ .... వీటన్నిటికీ 

చిత్ర నిర్మాణానికి పని చేసిన అందరికీ 

వీరందరికీ రంగులద్దిన చిత్రకారులకీ 

ఇంత అరుదైన చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్న ఆంధ్రు లందరికీ 

ఎన్నిక కు కారకులైన అందరికీ 
  
మాయాబజార్ సినిమా మొత్తం డైలాగులు, పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే వాయించెయ్యగలను.- అని ధంకా బజాయించి చెప్పే బ్లాగు వీరుడు రవికిరణ్ గారికీ, ఇంకా ఆ.సౌమ్య గారికీ 

వివాహ భోజనంబు అంటూ ఇప్పటికీ మాధవపెద్ది గళమే వింటున్నామా అని అనిపించేలా పాడగల అభినవ మాధవపెద్ది సత్యం నా సహోద్యోగి చింతలపాటి సురేష్ ( చింతలపాటి సురేష్) గారికీ 

చివరగా, అప్పటి కాలానుగుణ పరిస్తితులను బట్టీ సాహసం చేసి వింతలూ విశేషాలతో ఏర్చి కూర్చటమే కాకుండా వ్యాపారాత్మకం గా అలోచించి, ఈ చిత్రాన్ని రాసినా చూసినా సకల సౌభాగ్యాలు సంపదలూ కలుగుతాయని ఫలశ్రుతి చెప్పించిన కె వి రెడ్డి గారి ఆలోచనకు 

వేసెయ్యండి వీరతాళ్ళు. 

ఈ పద్యం ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను :

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"


మరిక సెలవా .... 
మల్లాది లక్ష్మణ కుమార్  
 





31, మార్చి 2013, ఆదివారం


ఇంకొన్ని చక్రి కవితలు:

చడి చప్పుడు లేకుండా ఎప్పుడు ఎలా చేరి ఒదిగానో 
ఆకలి తాపాలు వేధిస్తే వేగలేక  తనువు మరచానో 
తడబడుతూ పడిలేస్తూ అందుకే  ఇలా ఎదిగానో 
తెలివి తెచ్చుకు నిలువెత్తు తెర దిమ్పుకున్నానో  
విధి మేర వింత కలబోత  తలదాల్చుకున్నానో 
మలి వేళన తెలిసి నిశ్చేష్టత అలము కుంటానో  
కలత నిదుర లో కలలని అన్వయిస్తానో  ?!!

      *               *                *

నీ అస్థిత్వానికి అనంత సాక్షి నేను
నీ ఆగమనాభిలాషి ఆతిధ్యము నేను   
నీ అనంత చెరగుల ఆధారమూ నేనే 
నీ  సవ్వడుల వెన్నంటి వచ్చేది నేనే  
నీవు నన్ను చీల్చుకు రావాలి 
నేను నిన్ను కమ్ముకు రావాలి 
నా బాహువుల్లోనే నీవు ఆడుకోవాలి 
నా కౌగిలిలో నీతో దోబూచులాడాలి 
ప్చ్ కానీ నీవెంటే  నేను కనుమరుగవ్వాలి 
ఇది విరామరహిత విన్యాస  కేళి 
ద్రష్ట దృష్టుల నవరస జావళి 
ఈ ఆనందమేనా  దీపావళి !!

ఉగాది కి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని ఆశిస్తూ 

16, జనవరి 2013, బుధవారం

చక్రి - కవితలు


కొత్త సంవత్సరం లో రాఖరఖాలుగా రాద్దామని అనుకున్నాను కానీ ....   కాలేదు.
ప్రస్తుతానికి క్రింది కవిత, అదీ మా చక్రి రాసినది, చదివి ఆనందించండి.

ప్రతి క్షణం మనసుని కాంతిమయం చెయ్యాలి ట
కానీ మరుక్షణమే చీకటి అలుముకుంటుంది ట
ఎవరి బ్రతుకు పుటలకు వారే రంగులద్దాల ట
తమ చేతలతో తామే మాపుకుంటారు ట
గతమయ్యే రేపు, జ్ఞాపకమయి మరపుకొంటారు ట
వెను తిరిగి చూస్తే మసక బారిన వెలుగు రేఖలు ట
నలిగి వెలిసి వసి వాడిన రంగు పూ సోబగులు ట
ఆ నోట ఆ నోట అన్నారు ట విన్నారుట ట వింటారు ట!!
అవి వెలిగి రంగులిడినవో
నలిగి మసి నలుముకున్నవో
మౌన రాగాల మూగబోయినవో ?!!

పలు భావనల సమాహారం మా చక్రి కవితలు. నాకెంతో ఇష్టమైన కవితలు మీకు కూడా పరిచయం చేస్తున్నాను.

తరువాత తీరిగ్గా కలుద్దాం.

సెలవు.

మల్లాది లక్ష్మణ కుమార్ 

15, జనవరి 2012, ఆదివారం

మీది బందరా...



ఈ ఒక్క ప్రశ్న చాలనుకుంట నేను బందరు పిచ్చోన్ని అని చెప్పటానికి. ఈ మధ్య ఫేసు బుక్కు లో బందరు బంధువులు అన్న గుంపు ఒకటి మొదలైయ్యింది. ఇప్పటికి 369 మంది సభ్యులతో దినదిన ప్రవర్థమానం గా వృద్ధి చెందుతోంది. గత రెండు రోజులుగా నేను దీని ని అనుసరిస్తూ, తప్పకుండా ఈ బ్లాగు లోకానికి తెలియచేయాలని అనిపించి మీతో పంచుకుంటున్నాను.

విషయం ఏదైనా బందరు అన్న పదం దోర్లిందంటే పక్కనున్నవాడు లేదా పరిసరాల్లో ఉన్న ఏ బండరోడైనా తప్పకుండా అటువైపు వెళ్లి మీది బందరా!... అన్న మాట తో పరమానందం చెందుతూ వివరాలను కనుక్కుంటాడు. ఈ గుంపు లో ఒక సభ్యుడు ఇదే విషయం మీద రాస్తూ... ఒకానొక బందరుతో పరిచయం లేని వ్యక్తి అనిన మాటలు గుర్తు చేసుకున్నాడుట. అది ఏమిటయ్య అంటే... "నెను ఒకటి గమనించాను. నెను ఆంధ్ర లొ చాల చొట్ల తిరిగాను. మచిలిపట్నం వాళ్ళ కి ఆ వూరు అంటె ఉన్నంత ప్రెమ, ఇంకె వూరి వాళ్ళకి వాళ్ళ వూరి మీద చూడలెదు. మీ బందరు వాళ్ళకి బందరు అంటె చాల ప్రెమ. ఆదెదొ సినిమా లొ కొత శ్రీనివాస రావు  'మీది బందరా అంటూ ఉంటాడు, అది నిజమెనెమొ అనిపిస్తుంది." అని అన్నాడుట. మద్యాహ్నం HY టీవీ లో వేదగిరి రాంబాబు గారితో పరిచయం కార్యక్రమం లో బందరు గురించిన ప్రస్తావన వచ్చి ఆయనా గుర్తు చేసుకున్నారు, ఆదివిష్ణు గారంటూన్దేవారు
ఈ ( బందరు ) సముద్ర గాలిలో సాహితీ విలువలు పీల్చిన వాళ్ళంతా బందరు పేరు నిలబెట్టే ఉద్దండులయ్యారు. ఇక్కడ సముద్రం దగ్గర తిరిగే వాళ్ళు పిచ్చివాల్లన్నా అయ్యుండాలి లేదా కవి అన్న అయూన్దాలి అని.


ఈ గుంపు విషయానికి వస్తే.. ప్రముఖమైన కోనేరు సెంటరు ముఖచిత్రం తో తయారైనది.
ఇదే కాక బందరు లోని ప్రముఖమైన ప్రదేశాల చిత్రాలను పలు సభ్యులు ఎగుమతి చేసారు. వాటిని మీకు పరిచయం చేసే ప్రయతనం చేస్తాను.

 రామానాయుడు పేట (బుట్టాయి పేట) లోని వివేకానంద మందిరం. మా ఇల్లు దీని ఎదురుగా నే. ఇక్కడ చాల సంవత్సరాల నుంచి సంగీతం పాఠాలు జరుగుతుంటాయి. నృత్య పాఠాలు, వేసవి సెలవల లో చిత్ర కళా సంసద్ వారి చిత్రలేఖన తరగతులు ఉండేవి.
 ఆంద్ర జాతీయ కళాశాల. గాంధీ గారు బందరు వచ్చినపుడు ఇందులో విడిది చేసారని చెప్తారు. ఇక్కడ ఆయన స్వయంగా రాసిన వ్యాఖ కూడా క్రింద పొందుపరచాను. (శిలా ఫలకం)
 అయ్యగారి రామ మూర్తి గారు - ఆంధ్రా సైంటిఫిక్ కంపనీ స్థాపకులు. దీనినే తరువాత బెల్ కంపెనీ అని పిలుస్తారు.
 కలంకారీ తరువాత బందరు రోల్డు గోల్డు నగల తయారీలో ప్రసిద్ది చెందింది. రంగు వెలవని అచ్చ బంగారు నగల లాగే ఇవి తళ తళ లాడతాయి.

 "బతుకు బందరు బస్టాండు అయింది రో..." అని చాలా సినిమాలలో హాస్యాన్ని పండిస్తారు. చిన్న వర్షం పడితేనే ఈ పరిస్తితి మా బందరు బస్టాండ్ ది. ఇదే కాదు ఆ రహదారంతా ఇదే పరిస్తితి.

 కోట శ్రీనివాస రావు గప్చుప్ సినెమా లో చెప్పినట్టుగా.. 'బచ్చు పేట అన్న ఆనందం సత్యనారాయణ పురం (విజయవాడ) లో ఏముంది' అని ...
ఇది ఆ బచ్చుపేట లోని వెంకటేశ్వర స్వామి గుడి. దీని ఎదురుగానే హిందూ ఎలిమెంటరీ పాథశాల లో మేము చదువుకున్నాము. కృష్ణా రావు గారి బడి అని అప్పట్లో చాల విలువలు గల చదువు అని ప్రతీతి.

 మా బందరు సముద్ర తీరం.
 విజయవాడ నుంచి వచ్చేవారికి స్వాగతం తెలిపే ముఖ ద్వారం. ఇది మన బందరు బంధువుల గుంపు నుంచి నేను కూడా మొదటిగా చూస్తున్నాను. ఎందుకంటె నేను బందరు వెళ్లి చాలా కాలమయింది
 ప్రసిద్ధమైన చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామిని చేతి తో తాకి నమస్కారం చెయ్యవచ్చును. పండరి తరువాత ప్రముఖమైన పాండురంగని సన్నిధి.
 గాంధీ గారు వ్రాసినట్టు తెలిపే శిలా ఫలకం.

 నేను చదివిన హిందూ కళాశాల. ఆ రోజుల్లో నిపుణులైన ఉపాధ్యాయుల తరగతులతో మా కళాశాల మంచి చదువు నందిమ్చింది. 1986-87  లో హైస్కూలు లో 1987 -90 లో కళాశాల లోను చదివాను.
 రామానాయుడు పేట లోని కేకినీ మహలు. చిన్నప్పట్నుంచీ అలా పిలుచుకోవటమే కానీ లోపల ఏముందో ఎప్పుడూ చూడలేదు. బయట నుంచి చూస్తె మటుకు చాలా అందం గా దర్పం గా కనిపిస్తుంది.
 కోనేరు సెంటరు. పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర్య పోరాట సమయం లో ఇక్కడే త్రివర్ణ పతాకం ఎగురవేసారని పూర్వీకులు చెపుతారు. ఈ కూడలి ఎప్పుడూ హడావిడిగా, చిందర వందరగా వుండే ట్రాఫిక్ తో వుండేది. బందరు ప్రత్యేకత ఇంకోటి ఏమిటంటే, రోడ్డు మీదే పశువులు హాయి గా విశ్రమిస్తూ వుంటాయి. మా చిన్నప్పుడు లెండి. ఇప్పుడు సంగతి తెలీదు.


సాగర తీరం లోని దీప స్తంభం.
 లయన్సు క్లబ్బు లోని ముట్నూరి కృష్ణా రావు గారి హాలు దగ్గర ఘంటసాల వారి విగ్రహం
 బందరు లడ్డు యెంత ప్రసిద్దో మీకందరికీ తెలుసు గానీ బందరు మసాల గురించి బందరు వాళ్ళ మైన మాకు మాత్రమె తెలుసు. అందుకే ఈ ప్రసక్తి వచ్చినపుడు మా నోళ్ళ లో నీళ్లూరుతూ వుంటాయి. రకరకాల మసాలాల గురించి మా గుంపులో వివరం గా చర్చ జరుగుతూ ఉంటూనే వుంది. వేరే ఎక్కడైనా ఈ రుచి రాదు గాక రానే రాదు. ఈ విషయమై నేను వ్రాసిన కొన్ని పంక్తులు..
"అహా, క్రిష్త్న కిషొరు దగ్గర గానీ, రామాలయం దగ్గర గానీ, కొనెరు సెంటరు దగ్గర గానీ.... మన బందరు మసాలా అంటె ఇహ దానికి పొటీ లేదు గాక లేదు. టమటా మసాలా, వంకాయ బజ్జీ మసాల, మిర్చి బజీ మసాలా ఒక యెత్తయితె - వుండ మసాలా (పెసర) అబ్బొ, అద్భుతం. ఇవనీ అసలైతె, చక్రాల్ల వుండె శనగపప్పు అద్దిన పెద్ద చెగొడీలు కొసరు అన్నట్టు.  హైదరాబాదు సమొసాలు, గప్పు చిప్పులు బలదూర్ మన బందరు రుచుల ముందు!!!"

 నగరం లోని ఒకప్పటి మినర్వా సినిమా హాలు.
 మునిసిపల్ పార్కు. ఈ మధ్యనే దీనిని ఈ రకం గా అభివృద్ధి చేసారు. పిల్లలకూ పెద్దలకూ సాగర తీరం, చిలకలపూడి తరువాత మంచి ఆట విడుపు.
 ఈ చిత్రాన్ని అందించిన వారికి అభినందనలు. ఇది ముట్నూరి కృష్ణా రావు గారి ఇల్లు. వారు కృష్ణా పత్రిక స్థాపించి బందరు నుంచే నడిపేవారు.
 పాత బందరు పోర్టు.
 నగరానికి మంచి నీరు నందించే పంపుల చెరువు.

 పరాసు పేట లోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం. బందరు లోని ప్రదేశాల పేర్లు మీకు వింతగా అనిపించవచ్చు. పరాసు పేట అని, ఇంగ్లీషు పాలెం అని, ఫ్రెంచ్ పేట అని.. ఇవన్నీ ఆంగ్లేయులు మన భారతదేశం లో అడుగు పెట్టినపుడు మొదటి పాదం బందరులో వేశారుట. వారితో పాటూ వచ్చిన పోర్చుగీసు వారు, ఫ్రెంచి వారు వారి వారి ప్రదేశాలను విడివిడిగా అభివృద్ధి చేసారుట. అందుకే ఆయా పేర్లు ఆ ప్రదేశాలకు పెట్టారు.
 ఫిరంగి దిబ్బ. అని ఎందుకన్నారో నాకూ తెలియదు గానీ దీని పేరు అదే.
 వాతావరణాన్ని తెలిపే రాడారు కేంద్రం.
 బందరు రైల్వే స్టేషను. ఇది ఈ మార్గం లోనే చివరి మజిలీ. అందుకే పాత రోజుల్లో పొగ బండిని వెనుకకు తిప్పటానికి ఒక యంత్రం వుండేది. దాని మీదకి ఇంజను ఎక్కించి గుండ్రం గా తోసుకుంటూ వెనుకకు తిప్పి మళ్ళీ భోగీలను కలిపేవారు.
 బస్టాండు దగ్గరలో గల షిరిడి సాయి దేవాలయం, భక్తులు కొన్ని సంవత్సరాల క్రితం ఈ పెద్ద ప్రతిమను ప్రతిష్టించారు.
 శక్తి పటాలు. ఇవి కూడా మా బండరుకే ప్రత్యేకం అని అనుకుంటున్నాను. దసరా సమయం లో ( ముస్లిం ల పీర్ల లాగా) ఈ శక్తి పటాలను తగిలించుకొని ఊరేగుతూ వెడతారు. దప్పుల దరువులకు తగిన చిందులు వేస్తూ..
 బందరు టౌను హాలు. చాలా సంస్కృతిక కార్యక్రమాలకు నెలవు.










                                 *                    *                   *

 ఇక ఆ గుంపులోని కొందరి వ్యాక్యాలు చిత్తగించండి..

ఆదిత్య మద్దూరి ఇలా అన్నారు ...
సాగర గర్భం నుండి బయటపడ్డ బందరు,
వీధికొక్క వింత గాధ నింపుకున్నదీ ఊరు,
గుడులకు బడులకిక్కడ పెద్దపీట వేసినారు,
ఒక మారీ ఊరొస్తె ఇక జన్మ లో మరువరెవరు!!!
 రంగనాథ్ ప్రభల సమయోచితం గా ఇలా వ్రాసారు..
సంక్రాంతి సమయాన వేకువ ఝామున వచ్చే పొగమంచు వాసన
ముంగిళ్ళ లోగిళ్ళలో సయ్యాటలాడే గొబ్బిళ్ళు,
హరి నామస్మరణతో శుభోదయాన మేలుకొలిపె హరిదాసు,
పట్టు పావడాలతో పరికిణీలతొ నమ్మోహన పరిచె పల్లె పడుచులు,
బాలబాలికల కేరింతలు, కొత్త అల్లుళ్ళ సందడులు,అరిసెల ఘుమఘుమలు,
... కుర్రకారు జోరుకు తోడైన, కోడిపందాల జోరు,
ఫల సాయన్ని ఆనందించే రైతులు,
ఇన్ని ఆనందాలని పంచే పల్లెలకి దూరంగ సంక్రాంతికి జరుపుకుటున్న మన హడావిడి బ్రతుకులు
దానికి కాంత్ జోన్నలగెడ్డ గారు ఇలా స్పందించారు...
చాలా బాగా వ్రాశారు రంగనాథ్ గారు - మీ కవి హృదయం గొప్పది. మీరు చెప్పిన
ఆనందాలన్నీ నిజంగా ఈనాడూ జరుగుతూ వుంటే ఎంత బాగుంటుందో.

గొబ్బిళ్ళకై చూద్దామంటే ఏ సందులోనూ లేవాయే
హరినామ స్మరణ వెంకన్న గుడికే సరి
పట్టు పావడాలు, పరికిణీలు అన్నీ ప్రవాసీ ఆంధ్రులు పట్టుకెళ్లారు
పరీక్షల హడావిడిలో బాలబాలికలు మునిగి తేలుతున్నారు
కొత్త అల్లుళ్ళు కంపూటర్ల ముందు deliverables తో కుస్తీ పడుతున్నారు
రైతులు ప్రభుత్వ సాయంకై ఎదురు చూస్తున్నారు
మునుపటి పల్లెలు జల్లెడ వేసినా కానరావు
నాటి సంక్రాంతి సంకరమైపాయే
నాబోటి వాడికీ భావుకత పెల్లుబుకటమే నేటి వింతాయే!!
 కంచి శేషగిరి రావు గారు ఇలా..
బంధువులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు......ఈసారి ప్రతిసారి పండగలా కాకుండా మరో కొత్త వేడుకని అందిస్తోంది. అది ఏమిటో ఈపాటికి మీకు అర్ధం అయ్యేవుంటుంది? మన గ్రూప్ ద్వారా అనేకమంది కొత్త బండువులని,పాతమిత్రులని కలుసుకున్నాం! ఇప్పుడు మనకు నిజంగా సంక్రాంతి సంబరం లా అనిపిస్తోంది!
గతం లో కన్నా మేము ఎక్కువ ఫేస్ బుక్ లో కాలన్ని గడుపుతున్నామని కొంతమంది బంధువులు తమ అనుభూతి ని మనతో పంచుకున్నారు! మనం మనప్రమేయం ...లేకుండా అనేక గ్రూప్ లలో ఆడ్ అవుతూ..ఉంటాం, అయితే ఈ గ్రూప్ లోకి రావడం సంతోషం గా భావించడం అది నిజం గా మన బందరు గొప్పతనం తప్ప మరొకటి కాదు! ప్రతిరోజు మన బంధువుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఈ స్పందన, ఉత్సాహం ఇలానే నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను. కొత్తబందువులకి,వారిని పరిచయం చేస్తున్నవారికి మిగతా బంధువుల కృతజ్ఞతలు ఎప్పుడూ ఉంటాయి. మావూరు బందరు- మేము ఏది చేసినా'వండర్' ఈ ప్రత్యేకత ఇలా నిరంతరం కొనసాగాలని...........అందరికి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అర్పిస్తూ.....శుభోదయం!
              *                  *                   * 
ఈ విషయాలన్నీ బ్లాగ్మిత్రులతో పంచుకోవటానికి చాలా కాలం తరువాత మన బందరు చిత్రాలను మా కందిస్తున్న బందరు బంధువుల నిర్వాహకులకు నా ధన్యవాదాలు. వారి అనుమతి లేకుండానే ఈ విశేషాలు ప్రచురిస్తున్నందుకు క్షమాపణలతో...
మీది బందరా... మరిక ఆలస్యమెందుకు. మన బందరు బంధువుల గుంపులో చేరిపోండి. మన వూరి గొప్పదనాన్ని నలుదెసలా చాటండి. చివరిగా ఒక సందేశం.. "మీది బందరా.." అన్న కార్యక్రమం మన బందరు వారి కోసం ప్రతి సంవత్సరం లగే జనవరి 26 న కూకట్పల్లి లో one place లో సాయం సమయంలో  జరుగుతోందని గుంపులోని సభులోకరు తెలిపారు. వారి ఫోను నంబరు 9618067477  (నరహరిసేట్టి సాయి శ్రీనివాసు గారు ) బందరు వారు అందరికీ వారి తరఫున ఆహ్వానం
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ..... 
మీ 
మల్లాది లక్ష్మణ కుమార్
 



27, అక్టోబర్ 2011, గురువారం

మళ్ళీ వచ్చే దీపావళి, క్షమించాలి

మళ్ళీ వచ్చే దీపావళి, క్షమించాలి .... మళ్ళీ వెళ్ళే దీపావళి.
మీకందరికీ ఆలస్యం గా దీపావళి శుభాకాంక్షలు. మీ చేతులు కాల్చుకోకుండా...  విష్ణు చక్రాలు వేళ్ళలో దూర్చి తిప్పకుండా... బుజ్జాయి లు  ఇంటి లోపలే చిచ్చు బుడ్లు పెట్టి మిమ్మల్ని కంగారు పెట్టకుండా...  తారా జువ్వలు పక్క వాళ్ళ ఇళ్ళ మీదకు ఎగురవేయకుండా...

ఇవన్నీ జరగకుండా, ప్రశాంతం గా, క్షేమం గా ఈ దివ్వెల పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటాను.

విశేషం ఏమిటంటే, నేను భాగ్యనగరానికి బదిలీ అయి వచ్చేసాను. మూడు నెలలు అయ్యిన్దనుకోండి. ఈ పరుగుల జీవితం లో మీతో ముచ్చట్లు చెప్పుకోవడం కుదరనందుకు నాకు మిగుల బాధగా ఉంది.
అయినా పర్లేదు...   

మళ్ళీ మీ బుర్ర తినటానికి, మీ ఓపిక పరీక్షించటానికి మీ ముందుకు మళ్ళీ వస్తాను.

మరిక ఇప్పటికి సెలవా మరి!!

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్