24, మార్చి 2010, బుధవారం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం

శ్రీరామ కళ్యాణం జనరంజకం, ఈ జగతికి శుభదాయకం, మంగళకరం
జగత్ప్రసిద్ది ఐన శ్రీ సీత రామ కళ్యాణం ఎన్నో శతాబ్దాలు/సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్న ఆనందకరమైన పండుగ. మన భద్రాద్రి లో జరిగే కళ్యాణం నిజం గా సీతారాములను అక్కడ ఆహ్వానించి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి, పవిత్రత అక్కడ ప్రత్యక్షం గా చూస్తున్నా, రేడియో లో వింటున్న, తలచుకున్న చాలా ప్రత్యేకం గా నాకు అనిపిస్తుంది. (ఇది చాల సంవత్సరాల క్రితం మాట) ఆ రోజుల్లో ఉషశ్రీ గారి వ్యాఖ్యానం తో సాగే కళ్యాణ ప్రసార కార్యక్రమం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, చెణుకులు, తళుకు బెళుకులు కళ్ళకు కట్టినట్టుగా అయన వివరిస్తుంటే ఆ కళ్యాణం మన చేతులతో చేస్తున్నట్టుగా అనిపించేది. తరువాత మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి కాలం లో కూడా చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. ఇంట్లో పూజ త్వరగా ముగించుకొని అది వినటం కోసం మా తాతయ్య తో సహా వేచివుందేవాళ్ళం.  ఈ రోజుల్లో ఎవరు వ్యాఖ్యానం చెపుతున్నారో తెలియదు  ...., అవి వినటానికి కూడా ఇప్పటి వారికి తీరిక లేదు.  రేడియో పూర్తిగా మరుగున పడిపోయింది.
సరిగ్గా కళ్యాణం అయిపోవచ్చే సమయానికి మా బందరు లో ఇంటి దగ్గర వున్నా సాయి మావయ్య (ఇప్పటి దత్త ఆశ్రమం ఎదురుగా) వాళ్ళ రామాలయం లో పానకం కోసం పరిగెత్తే వాళ్ళం. ఈ పండుగ ప్రత్యెక ప్రసాదం అదేగా.
రామనాయుదిపేట కూడలిలో వినాయక చవితి, శ్రీరామనవమి పండగలకి పందిళ్ళు వేసి (తాటాకు తో, కొత్త ఆకుల వాసన బాగుండేది) ప్రతిరోజూ రాత్రికి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. చవితికి కోట సచితానంద శాస్త్రి హరికధలు, శ్రీరామనవమికి నాటకాలు, ప్రొజెక్టర్ తో సినిమాలు తప్పకుండ చూసేవాళ్ళం.
శ్రీరామా నామాలు, కీర్తనలు, కావ్యాలు, పాటలు మన తెలుగు జాతికి తరగని సంపదలు.
వాటిని మనకు అందించిన వాల్మీకి, త్యాగయ్య, రామదాసు ఇత్యాదులు, గానం చేసిన దాసులు, గాయకులూ ధన్యులు. రామ నామ జపమే తన జీవన పరమావధి గా గడిపిన పవన పుత్రా హనుమాన్ కు నా నమస్సులు.
 మీకందరకూ శ్రీరామా కళ్యాణ శుభమాహోత్సవాన ఇవే నా శుభాకాంక్షలు.
శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి, బహు తీపి... అన్న పాట వింటూవుంటే ఆ రామచంద్రుని పై ఉన్న భక్తీ, ఆదరం, గౌరవం రెట్టింపు అవుతుంది. సకల గుణాభిరాముడు, ధర్మార్ధకామములందు విచక్షణ తో ప్రవర్తించి మానవాళికి ఆదర్శ ప్రయుడై నిలచిన ఆ పట్టాభి రామునికి నమస్సులతో,
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

మీ లక్ష్మణ కుమార్ మల్లాది. మీ స్పందనలను నా మెయిల్ కు పంపండి, mailto:malladi.lakshman@rediffmail.com