1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపు వెళ్ళిపొయాడు రమణ ని వెతుక్కుంటూ...

 ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు సాహితీ క్విజ్ లో పాల్గొనేప్పుడు బాపు పూర్తి పేరు ఏమిటి అంటే సత్తిరాజు లక్ష్మీనారాయణ అని నేర్చుకొవడం తో బాపు తో పరిచయం. కనిపించిన ప్రతీ కాగితం, పుస్తకం చదివే వయసు వచ్చేసరికి ఆంధ్ర ప్రభ, జ్యొతి లలో ఆయన కార్తూన్లంటె పడిచచ్చే పరిస్తితి వచ్చింది. ఈ రాతలేమిటండీ బాబూ బొమ్మలు గీసినట్టు గా వున్నయ్, అనుకునే సరికి బుడుగు పరిచయం అయ్యాడు. వెంటనే సీగానపెసూనంబ వాళ్ళ బాబాయి .... 'సాక్షి ' చూసేసరికి కాగితాల మీదే కాదు తెరమీద బొమ్మలు ఇంకా అద్భుతం గా అనిపించాయి. రవణ అద్దిన బాపు ఇంకా మురిపెంగా అనిపించింది. ముత్యమంతా పసుపు అని చిన్నప్పుడు వినిపించిన రాగాలు, తెర మీద మధురంగా కనిపించాయి. ఒక్కొక్క సన్నివెశం ఒక్కొక్క గ్రంధం, దానిగురించి రాసుకుంటూ పొతే ఒక్కొక్క పుస్తకం. వాటిని తెరకెక్కించటానికి బాపు ఎన్ని బొమ్మలెసుకున్నాడో గానీ, అవన్నీ ఈ తరం వాళ్ళకి ఒక నిఘంటువు. యెన్నిసార్లు చూసినా తనివితీరని మధురానుభూతి ముత్యాల ముగ్గు. ఇక గోరంతదీపం ... ఆ పాట వినడమే ఒక మధుర భావన. వ్యాపారాత్మకం గా బాపుకి మిగిల్చినదెమీ లేదేమో గానీ, అది మరో ఆణిముత్యం. ఇట్లా వరసగా చెప్పేసుకుంటూ పొతే, అయన చిత్రాలనీ తడిమి తడిమి, మనసు తడి చేసుకొవటమే. నిన్న మొన్నటి పెండ్లిపుస్తకం, మిస్టరు పెళ్ళాం వరకూ. రామ భక్తి నుంచీ, గొదారి పరవళ్ళ వరకూ, అక్షరమాల లో "అ" నుంచీ "క్ష" వరకూ అన్నీ చెప్పుకుంటునట్టు  వివరంగా గుర్తు తెచ్చుకొవడమే. ఇంకా బాపు మనమధ్య లేడని యెందుకు అనిపించట్లెదో??? అవును మరి బుడుగు యెక్కడికి పొతాడు, ఈ బాపు బొమ్మలన్నీ మన కళ్ళ ముందే వున్నాయి. చిత్ర రాజాలన్నీ బాపు ని మన కళ్ళకి కడుతున్నాయి. ఆయన కార్తూన్లు కదుపుబ్బ నవ్విస్తాయి. తెలుగు వున్నంత మటుకూ బాపు రాత లిపి యెక్కడికీ పోదు. అవును... బాపు అజరామరుడు. మనమధ్యే ఆయన జ్ఞాపకాలన్నీ పదిలపరిచి ఆ తాయిలం చూపించి ప్రాణ సఖుడు రవణ ని వెతుక్కుంతూ వెళ్ళిపొయాడు. పొన్లెండి, ఇన్నాళ్ళూ రమణ లేని బాధని అనుభవించిన బాపు విముక్తుడయ్యాడు. 

 ఇంక మళ్ళీ మళ్ళీ శ్రీరామ పట్టాభిషెకం చేసెవారెవరో..


ఇన్నాళ్ళూ నవరసాలూ పండించిన బాపు బొమ్మ విషాదం పండించలేక, గీయటానికి బాపు లేక యేమీ తోచకుండా కూర్చుంది. 


బాపు చేతిలో రకరకాల అవతారాలు యెత్తి అలంకారాలు కూర్చుకున్న  దేవతలు స్వర్గం లో తీయబొయే సినిమాలకి  తమ పాత్రల కోసం ముందుగానే రుమాళ్ళు పరుస్తున్నారు.  



కానీ, రాసిన చెయ్యి పోయి గీసిన గీత కూడా చెరిగిపొయ్యె సరికి, చిన్నారి బుడుగు మాత్రం కంటికి మింటికి యెకధారగా యెడుస్తూనే వున్నాడు !!!




 అందమైన 'తెలుగు' కుంచె అంధకారంలో ఉండిపోయింది. తెలుగు వినాలంటే 'రమణ' - తెలుగు చూడాలంటే బాపు'  

- ఇంతకు మించి ఏం చెప్పగలం