29, నవంబర్ 2010, సోమవారం

'పడమటి సంధ్యా రాగం

ఈ మధ్య మీతో చాలా సార్లు మాట్లాడదామని అనుకున్నాను... ఒక రోజు చిన్ని గళాలు ఆహ్లాదంగా ఆ 'పాత' మధురాలు పాడేప్పుడు (పాడుతా తీయగా లో), ఇంకొక రోజు బాలు గారు 'గాన గాంధర్వ' కార్యక్రమంలో ఆనాటి చక్కర కేళీలు గానం చేస్తున్నప్పుడు, ఓ రోజు రాత్రి రావూరి భరద్వాజ గారి అంతరంగ తరంగాలు 'అంతరంగిణి' చదువుతూ అంతర్ముఖుడి నైనపుడు (దీన్ని గురించి విపులం గా చర్చించాలని ఉంది.. ఈ లోగా వీలయితే ఆయన రచనలు 'ఒకింత వేకువ కోసం', 'నాలో నేను' లాంటి వి చదవండి ), కన్యాశుల్కం నాటిక ను ఆస్వాదిస్తున్నపుడు ....

మొన్నొక రోజు  'పడమటి సంధ్యా రాగం' విని/చూసి... .......................      ..............

గుమ్మలూరి గారి అభిరుచికి జంధ్యాల వారి చమత్క్రుచి (చమత్కార రుచి) తోడై, మంచి కాఫీ లాంటి, యెర్ర గా వర్రగా ఉన్న ఆవకాయ ముద్దలా..  ఎన్ని సార్లు ఆ చిత్రం చూసినా ప్రతిసారీ కొత్త ఆవకాయ రుచిలా. . . కమ్మగా..

జంధ్యాల గారి మాటల చమత్కారం ఒక ఎత్తైతే బాలు గారి సంగీతం వీనుల విందుగా ...      హాయిగా..

పిబరే రామ రసం...  (మన సదా శివ బ్రహ్మేన్డ్రుల కృతి) తెలిసిన రాగంలో నైనా మధ్య మధ్య లో పలకరించే వాయులీన రాగాలతో, ధ్వని తంత్రుల (పియానో) తరంగాలతో మరింత వినసొంపుగా వినిపించింది.  ఖండాంతరాలకు వెళ్లి తమకు తెలియకుండా 'తమను' కోల్పోయే తెలుగు వాడి దీన స్థితి  ...ఆ దీనత్వానికి అలవాటు  పడలేని ఆ పెద్దాయన పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది.  శ్రీరామ నవమిని గుర్తు చేసుకోలేని ఆ పెద్దాయన  "అదే  ఆ  రోజుల్లో అయితే  ..." అని  గుర్తు  చేసుకునే  సందర్భం  నా  పాత పుటల్లో  ని  జ్ఞాపకాలను  తట్టి  లేపింది. 

తిట్ల పురాణం, దండకం బాగా వంట పట్టించుకున్న జంధ్యాల మార్కు హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర చిత్రణ, వాచకం (గాత్ర ధారణ వేరే వారిది అనుకుంట) బాగా కుదిరాయి.  వర్షం లో గొడుగేసుకుని పచ్చిక తడుపుతూ వుండటం, ఇంట్లో వాళ్ళు తాళాలేసుకుని బయటకెడితే అయన తాళం పోగొట్టుకుని వచ్చి బయట దినపత్రిక నెత్తిన కప్పుకుని గుడ్లు మిటకరించుకుని కూర్చోటం, ఆరు బయట (అమెరికా లో) వొళ్ళంతా నూనె పూసుకుని హంగామా చేయటం... ఇంకా చాలా సందర్భాలలో...   మళ్ళీ, హిమక్రీముల దుకాణం యజమాని ని బాగున్నారా అంటే  "కు లాసే... (అంటే కుమారుని వలన లాసు)" అని వ్యంగ్యం గా చెప్పటం, పైగా కొడుకు ని వివిధ రకాల రాక్షసుల పేర్లతో పిలవటం .....       చాలా సందర్భాలలో సంభాషణలు బాగా నవ్విస్తాయి.


ఇక్కడ చూడండి:
....

విదేశాల నేపధ్యం లో జరిగే కథలతో వచ్చిన తెలుగు చిత్రాలలో ఇంత సహజం  గా, ఆద్యంతం చూడదగ్గ సినిమాలలో ఇది ఒకటి అని ఒప్పుకోక తప్పదు.

మీరు చూసారా?  మళ్ళీ మళ్ళీ చూడండి.   
  
హాస్యం ఆరోగ్య/ఆనంద దాయిని. హాయి గా నవ్వుకుని మనసుని తాజా గా ఉంచుకోండి.
మరి ఉంటాను...

మీ
మల్లాది లక్ష్మణ కుమార్