ఈ ఒక్క ప్రశ్న చాలనుకుంట నేను బందరు పిచ్చోన్ని అని చెప్పటానికి. ఈ మధ్య ఫేసు బుక్కు లో బందరు బంధువులు అన్న గుంపు ఒకటి మొదలైయ్యింది. ఇప్పటికి 369 మంది సభ్యులతో దినదిన ప్రవర్థమానం గా వృద్ధి చెందుతోంది. గత రెండు రోజులుగా నేను దీని ని అనుసరిస్తూ, తప్పకుండా ఈ బ్లాగు లోకానికి తెలియచేయాలని అనిపించి మీతో పంచుకుంటున్నాను.
విషయం ఏదైనా బందరు అన్న పదం దోర్లిందంటే పక్కనున్నవాడు లేదా పరిసరాల్లో ఉన్న ఏ బండరోడైనా తప్పకుండా అటువైపు వెళ్లి మీది బందరా!... అన్న మాట తో పరమానందం చెందుతూ వివరాలను కనుక్కుంటాడు. ఈ గుంపు లో ఒక సభ్యుడు ఇదే విషయం మీద రాస్తూ... ఒకానొక బందరుతో పరిచయం లేని వ్యక్తి అనిన మాటలు గుర్తు చేసుకున్నాడుట. అది ఏమిటయ్య అంటే... "నెను ఒకటి గమనించాను. నెను ఆంధ్ర లొ చాల చొట్ల తిరిగాను. మచిలిపట్నం వాళ్ళ కి ఆ వూరు అంటె ఉన్నంత ప్రెమ, ఇంకె వూరి వాళ్ళకి వాళ్ళ వూరి మీద చూడలెదు. మీ బందరు వాళ్ళకి బందరు అంటె చాల ప్రెమ. ఆదెదొ సినిమా లొ కొత శ్రీనివాస రావు 'మీది బందరా అంటూ ఉంటాడు, అది నిజమెనెమొ అనిపిస్తుంది." అని అన్నాడుట. మద్యాహ్నం HY టీవీ లో వేదగిరి రాంబాబు గారితో పరిచయం కార్యక్రమం లో బందరు గురించిన ప్రస్తావన వచ్చి ఆయనా గుర్తు చేసుకున్నారు, ఆదివిష్ణు గారంటూన్దేవారు
ఈ ( బందరు ) సముద్ర గాలిలో సాహితీ విలువలు పీల్చిన వాళ్ళంతా బందరు పేరు నిలబెట్టే ఉద్దండులయ్యారు. ఇక్కడ సముద్రం దగ్గర తిరిగే వాళ్ళు పిచ్చివాల్లన్నా అయ్యుండాలి లేదా కవి అన్న అయూన్దాలి అని.
ఈ గుంపు విషయానికి వస్తే.. ప్రముఖమైన కోనేరు సెంటరు ముఖచిత్రం తో తయారైనది.
ఇదే కాక బందరు లోని ప్రముఖమైన ప్రదేశాల చిత్రాలను పలు సభ్యులు ఎగుమతి చేసారు. వాటిని మీకు పరిచయం చేసే ప్రయతనం చేస్తాను.
ఆంద్ర జాతీయ కళాశాల. గాంధీ గారు బందరు వచ్చినపుడు ఇందులో విడిది చేసారని చెప్తారు. ఇక్కడ ఆయన స్వయంగా రాసిన వ్యాఖ కూడా క్రింద పొందుపరచాను. (శిలా ఫలకం)
అయ్యగారి రామ మూర్తి గారు - ఆంధ్రా సైంటిఫిక్ కంపనీ స్థాపకులు. దీనినే తరువాత బెల్ కంపెనీ అని పిలుస్తారు.
కలంకారీ తరువాత బందరు రోల్డు గోల్డు నగల తయారీలో ప్రసిద్ది చెందింది. రంగు వెలవని అచ్చ బంగారు నగల లాగే ఇవి తళ తళ లాడతాయి.
"బతుకు బందరు బస్టాండు అయింది రో..." అని చాలా సినిమాలలో హాస్యాన్ని పండిస్తారు. చిన్న వర్షం పడితేనే ఈ పరిస్తితి మా బందరు బస్టాండ్ ది. ఇదే కాదు ఆ రహదారంతా ఇదే పరిస్తితి.
కోట శ్రీనివాస రావు గప్చుప్ సినెమా లో చెప్పినట్టుగా.. 'బచ్చు పేట అన్న ఆనందం సత్యనారాయణ పురం (విజయవాడ) లో ఏముంది' అని ...
ఇది ఆ బచ్చుపేట లోని వెంకటేశ్వర స్వామి గుడి. దీని ఎదురుగానే హిందూ ఎలిమెంటరీ పాథశాల లో మేము చదువుకున్నాము. కృష్ణా రావు గారి బడి అని అప్పట్లో చాల విలువలు గల చదువు అని ప్రతీతి.
మా బందరు సముద్ర తీరం.
విజయవాడ నుంచి వచ్చేవారికి స్వాగతం తెలిపే ముఖ ద్వారం. ఇది మన బందరు బంధువుల గుంపు నుంచి నేను కూడా మొదటిగా చూస్తున్నాను. ఎందుకంటె నేను బందరు వెళ్లి చాలా కాలమయింది
ప్రసిద్ధమైన చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామిని చేతి తో తాకి నమస్కారం చెయ్యవచ్చును. పండరి తరువాత ప్రముఖమైన పాండురంగని సన్నిధి.
గాంధీ గారు వ్రాసినట్టు తెలిపే శిలా ఫలకం.
నేను చదివిన హిందూ కళాశాల. ఆ రోజుల్లో నిపుణులైన ఉపాధ్యాయుల తరగతులతో మా కళాశాల మంచి చదువు నందిమ్చింది. 1986-87 లో హైస్కూలు లో 1987 -90 లో కళాశాల లోను చదివాను.
రామానాయుడు పేట లోని కేకినీ మహలు. చిన్నప్పట్నుంచీ అలా పిలుచుకోవటమే కానీ లోపల ఏముందో ఎప్పుడూ చూడలేదు. బయట నుంచి చూస్తె మటుకు చాలా అందం గా దర్పం గా కనిపిస్తుంది.
కోనేరు సెంటరు. పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర్య పోరాట సమయం లో ఇక్కడే త్రివర్ణ పతాకం ఎగురవేసారని పూర్వీకులు చెపుతారు. ఈ కూడలి ఎప్పుడూ హడావిడిగా, చిందర వందరగా వుండే ట్రాఫిక్ తో వుండేది. బందరు ప్రత్యేకత ఇంకోటి ఏమిటంటే, రోడ్డు మీదే పశువులు హాయి గా విశ్రమిస్తూ వుంటాయి. మా చిన్నప్పుడు లెండి. ఇప్పుడు సంగతి తెలీదు.
సాగర తీరం లోని దీప స్తంభం.
లయన్సు క్లబ్బు లోని ముట్నూరి కృష్ణా రావు గారి హాలు దగ్గర ఘంటసాల వారి విగ్రహం
బందరు లడ్డు యెంత ప్రసిద్దో మీకందరికీ తెలుసు గానీ బందరు మసాల గురించి బందరు వాళ్ళ మైన మాకు మాత్రమె తెలుసు. అందుకే ఈ ప్రసక్తి వచ్చినపుడు మా నోళ్ళ లో నీళ్లూరుతూ వుంటాయి. రకరకాల మసాలాల గురించి మా గుంపులో వివరం గా చర్చ జరుగుతూ ఉంటూనే వుంది. వేరే ఎక్కడైనా ఈ రుచి రాదు గాక రానే రాదు. ఈ విషయమై నేను వ్రాసిన కొన్ని పంక్తులు..
"అహా, క్రిష్త్న కిషొరు దగ్గర గానీ, రామాలయం దగ్గర గానీ, కొనెరు సెంటరు దగ్గర గానీ.... మన బందరు మసాలా అంటె ఇహ దానికి పొటీ లేదు గాక లేదు. టమటా మసాలా, వంకాయ బజ్జీ మసాల, మిర్చి బజీ మసాలా ఒక యెత్తయితె - వుండ మసాలా (పెసర) అబ్బొ, అద్భుతం. ఇవనీ అసలైతె, చక్రాల్ల వుండె శనగపప్పు అద్దిన పెద్ద చెగొడీలు కొసరు అన్నట్టు. హైదరాబాదు సమొసాలు, గప్పు చిప్పులు బలదూర్ మన బందరు రుచుల ముందు!!!"
నగరం లోని ఒకప్పటి మినర్వా సినిమా హాలు.
మునిసిపల్ పార్కు. ఈ మధ్యనే దీనిని ఈ రకం గా అభివృద్ధి చేసారు. పిల్లలకూ పెద్దలకూ సాగర తీరం, చిలకలపూడి తరువాత మంచి ఆట విడుపు.
ఈ చిత్రాన్ని అందించిన వారికి అభినందనలు. ఇది ముట్నూరి కృష్ణా రావు గారి ఇల్లు. వారు కృష్ణా పత్రిక స్థాపించి బందరు నుంచే నడిపేవారు.
పాత బందరు పోర్టు.
నగరానికి మంచి నీరు నందించే పంపుల చెరువు.
పరాసు పేట లోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం. బందరు లోని ప్రదేశాల పేర్లు మీకు వింతగా అనిపించవచ్చు. పరాసు పేట అని, ఇంగ్లీషు పాలెం అని, ఫ్రెంచ్ పేట అని.. ఇవన్నీ ఆంగ్లేయులు మన భారతదేశం లో అడుగు పెట్టినపుడు మొదటి పాదం బందరులో వేశారుట. వారితో పాటూ వచ్చిన పోర్చుగీసు వారు, ఫ్రెంచి వారు వారి వారి ప్రదేశాలను విడివిడిగా అభివృద్ధి చేసారుట. అందుకే ఆయా పేర్లు ఆ ప్రదేశాలకు పెట్టారు.
ఫిరంగి దిబ్బ. అని ఎందుకన్నారో నాకూ తెలియదు గానీ దీని పేరు అదే.
వాతావరణాన్ని తెలిపే రాడారు కేంద్రం.
బందరు రైల్వే స్టేషను. ఇది ఈ మార్గం లోనే చివరి మజిలీ. అందుకే పాత రోజుల్లో పొగ బండిని వెనుకకు తిప్పటానికి ఒక యంత్రం వుండేది. దాని మీదకి ఇంజను ఎక్కించి గుండ్రం గా తోసుకుంటూ వెనుకకు తిప్పి మళ్ళీ భోగీలను కలిపేవారు.
బస్టాండు దగ్గరలో గల షిరిడి సాయి దేవాలయం, భక్తులు కొన్ని సంవత్సరాల క్రితం ఈ పెద్ద ప్రతిమను ప్రతిష్టించారు.
శక్తి పటాలు. ఇవి కూడా మా బండరుకే ప్రత్యేకం అని అనుకుంటున్నాను. దసరా సమయం లో ( ముస్లిం ల పీర్ల లాగా) ఈ శక్తి పటాలను తగిలించుకొని ఊరేగుతూ వెడతారు. దప్పుల దరువులకు తగిన చిందులు వేస్తూ..
బందరు టౌను హాలు. చాలా సంస్కృతిక కార్యక్రమాలకు నెలవు.
* * *
ఇక ఆ గుంపులోని కొందరి వ్యాక్యాలు చిత్తగించండి..
ఆదిత్య మద్దూరి ఇలా అన్నారు ...