14, మే 2013, మంగళవారం

అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనసింహధ్వజముగ్రాలచూడవలదే.....



నేడే చూడండి
బందరు శ్రీ దుర్గా మహల్ లో
మీ అభిమాన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరు తారక రామారావు మరియు మీ అభిమాన తారాగణం సావిత్రి, అక్కినేని, రేలండి రమణారెడ్డి  ఎస్ వీ రంగారావు మొదలగువారు నటించిన
మాయా బజార్
 ...........................

అసలు ఇక్కడే ఎందుకు చూడాలి? ఏం పెద్ద గొప్ప ఆ టాకీసు అని అంటారని నాకు తెలుసు!!!
మీరు వినలెదా... మచిలీపట్నం మాయాబజార్ మాటనీ కొస్తే లైనేసా ... అన్న పాట. ఇదేకాకుండా సుందరాకాండ సినిమాలో మచిలీపట్నపు మాట్నీ ఆటకు బాక్సులు నిన్డునులే అని ఇంకొన్ని తెలుగు పాటల్లో కూడా బందరు, మాయాబజారు ప్రస్తావన కనిపిస్తుంది.

మయా బజార్ విడుదలైన కొత్తల్లో దుర్గా మహల్ లో ప్రతిరోజూ పండగట అని పెద్దవాళ్ళు అంటుండగా విన్నాను. ఆంధ్రావని అంతటా తారక రాముడికి  తెర ముందే  నీరాజనాలు ఇచ్చేవారని ప్రతీతి. అప్పట్నుంచే ఇంతమంది గుండెల్లో చోటు చేసుకున్న ఈ సినీరాజాన్ని ఇప్పుడు యావత్ భారతానికే నచ్చిన మొదటి  చలన చిత్రం గా మహా మహా సత్యజిత్, శ్యాం బెనగల్, గురుదత్, రాజ్ కపూర్, మృణాల్ సేన్ వంటి వారి చిత్రాలను తోసిరాజని, బెంగాలీ, హిందీ  కావ్యాలని పక్కన పెట్టి, ఎన్నికవ్వటం మన ఆంధ్రులకి గర్వకారణం.

ఈ సినిమా గురించి బ్లాగ్లోకం లో చాలా మంది చాల రకాలుగా చెప్పెసుకున్నారు. మాయ శశిరేఖ పేరు పెట్టుకున్న బ్లాగరి ఆ. సౌమ్య గారు కూడా పలువురు మెచ్చగ ఇట్లా (మాయాబజార్ – పాండవులు లేని భారతం), ఇంకా భండారు శ్రీనివాసరావు గారు (http://bhandarusrinivasarao.blogspot.in/2013/05/blog-post_2772.html) రాసేసారు.
ఏమో, యెంత చెప్పినా యెంత వినినా తినగా తినగ వేము (ఇది వేము కాదండోయి, ప్రాస కోసం అని మనవి) ఇంకా తీయనగునని చూడగా చూడగా ఇంకొద్ది గొప్పతనం, వింత బయటపడుతుందని అనుకొని , తెలుసుకొని , మళ్ళీ ఇలా రాసే అవకాశం ఈ శుభ సందర్భంగా నాకు కలిగిన్ది.

ఏ రకం గా చూసినా, ఏ కోణాల్లో చూసినా, ఏ శాఖ లో వెతికినా తప్పు పట్టటానికి వీలులేని కళాఖండం "మన" మాయాబజారు . వింత కొలిపే మార్కస్ బార్లె ఛాయాగ్రహణం నలుపు తెలుపుల్లో ని వెన్నెల నీ, చందమామ నీ, హాయి గొలిపే  చల్ల పిల్ల గాలినీ, ఆ గాలికి ఊయలలూగే పైరునీ కథానాయకుడు ప్రియురాలి సరాగాలనీ ఇంపుగా చిత్రించి చూపారు. పింగళి గారి మాటకారితనం గురించి చెప్పనలవి కాదు (నాకు , పైన పేర్కొన్న బ్లాగరి ఇప్పటికే చెప్పేశారు). వింతలూ భ్రాంతులూ విషయానికొస్తే అప్పుడెప్పుడో 1957 లోనే మన దృశ్య శ్రవణ పెట్టె ని అప్పటి  వీక్షకులకు పరిచయం చేసారు రెడ్డి గారు. బిగ్గు బజార్లని, వన్ మాల్ నీ అప్పుడే ఊహించేసారు విడిది లో సృష్టించేసారు . అం ఆహా అంటూ గింబళి, గిల్పం సృష్టించేసారు. రథ చోదకుడు భళి భళి దేవా అని పాడినా, ఘటోత్కచుని  శిష్యులు అల్లరి ఆగం చేసినా, అలమలాలు వీరతాళ్ళు అన్న కొత్త పదాలు కనిపెట్టినా , చిన మాయను పెను మాయ అని కృష్ణ పాత్రని ముసలి బ్రాహ్మడిగా చూపించినా ప్రేక్షకులకి వినోదిన్చారే గానీ విసుగు పుట్టలేదు చిత్ర నిడివి వల్ల కానీ తడవ తడవ కీ వచ్చే పాటల వాళ్ళ కానీ  అలుపు వెయ్యలేదు. సావిత్రి ఆహ నా పెళ్ళంట అంటూ చూపిన నటన ఇంకా ఏ ఇతర నటీమణుల నటన లోనూ చూడలేము.  తడబాటు సిగ్గు కలగలిపి నాట్యాన్ని  జోడించి మధ్యలో మగతనపు భావ ప్రకటన చూపి కలగలిపిన ఆ సన్నివేశాలు  చిత్రానికే మకుటాయమానం. 

నటన లో జంట కవులవంటి నందమూరి అక్కినేని నటనా చాతుర్యం, రేలంగి, రమణారెడ్డి హాస్యం, ఘంటసాల, లీల, సుశీల, మాధవపెద్ది గళవిన్యాసమ్, పింగళి వారి పద విన్యాసం, ఘంటసాల వారి స్వరాలూ అన్నిటినీ మించి ఎస్వీ రంగారావు ఘతొత్కచీయమ్ .... వీటన్నిటికీ 

చిత్ర నిర్మాణానికి పని చేసిన అందరికీ 

వీరందరికీ రంగులద్దిన చిత్రకారులకీ 

ఇంత అరుదైన చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్న ఆంధ్రు లందరికీ 

ఎన్నిక కు కారకులైన అందరికీ 
  
మాయాబజార్ సినిమా మొత్తం డైలాగులు, పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే వాయించెయ్యగలను.- అని ధంకా బజాయించి చెప్పే బ్లాగు వీరుడు రవికిరణ్ గారికీ, ఇంకా ఆ.సౌమ్య గారికీ 

వివాహ భోజనంబు అంటూ ఇప్పటికీ మాధవపెద్ది గళమే వింటున్నామా అని అనిపించేలా పాడగల అభినవ మాధవపెద్ది సత్యం నా సహోద్యోగి చింతలపాటి సురేష్ ( చింతలపాటి సురేష్) గారికీ 

చివరగా, అప్పటి కాలానుగుణ పరిస్తితులను బట్టీ సాహసం చేసి వింతలూ విశేషాలతో ఏర్చి కూర్చటమే కాకుండా వ్యాపారాత్మకం గా అలోచించి, ఈ చిత్రాన్ని రాసినా చూసినా సకల సౌభాగ్యాలు సంపదలూ కలుగుతాయని ఫలశ్రుతి చెప్పించిన కె వి రెడ్డి గారి ఆలోచనకు 

వేసెయ్యండి వీరతాళ్ళు. 

ఈ పద్యం ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను :

"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"


మరిక సెలవా .... 
మల్లాది లక్ష్మణ కుమార్