14, జనవరి 2014, మంగళవారం

ఆకాశం సందడిగా ఉంది. రెపరెపలాడే పతంగులు, కుర్రకారు కేరింతలు... సంధ్య, కెంజాయ రంగు కళ్ళాపు చల్లి నింగిలో రంగుల చుక్కలేసి ముగ్గులు దిద్దటానికి తయారు చేసుకున్నట్టుంది. ఇప్పటిదాకా కనిపించని కొత్త పిట్టలు ఆకాశంలో ఈ వింత విహంగాలేమిటా అని సందడి చేస్తూ కిచకిచలతో కుహు కుహూ రవాతో నన్ను అడిగాయి. అవి మిడిసిపడే ఎగసి'పడే' కాగిత కలలే నని, చెట్టూ పుట్టలపై రాలిన సుమాలనీ, మేడలపై మిద్దెలపై తెగిపడిన రంగుల కలలనీ, ఆధారం లేక గాలి కి ఎగురుతున్న పటాల్నీ, అందనంత దూరం పోయి కంటికి కనిపించని మిగిలిన పతంగులనీ వాటికి చూపి, కంగారేమీలే దని వాటికి సర్ది చెప్పి ఇప్పుడే పంపించాను.