24, ఫిబ్రవరి 2011, గురువారం

చిన్నారి బుడుగు ఏడుస్తున్నాడు !!



తెలుగు భాష కి యెనలేని సేవలు చేసి మాలాంటి వారికి భాష మీద మక్కువ పెంచి తన చుట్టూ తిప్పుకున్న మహా మహుడు, రచనారావిన్దుడు, మన ముళ్ళపూడి వెంకట రమణ గారు దూర లోకాలు చేరారు. ఇక బాపు బొమ్మ ఏ బుడుగు తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, కబుర్లు చెప్పుకుంటుంది??

పాపం చిన్నారి బుడుగు ని దగ్గరకు తీసుకోండి, లాలించండి, మీ గుండెల్లో పెట్టి పెంచుకోండి.

ఆ ఆంధ్రాగ్రేసరునికి నివాళులతో

లక్ష్మణ కుమార్ మల్లాది.

ఆ రోజుల్లో ... రేడియో లో...

నిన్న దృశ్య శ్రవణ పెట్టె (అదేనండీ టెలివిజన్) చూస్తూ మీటలు మారుస్తూ అనుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమం లో సూర్య భగవానుని పూజల గురించి చెపుతుంటే ఆసక్తిగా చూస్తున్నాను. చివర్లో సూర్య నారాయణుని సుప్రభాతం వినిపించారు.  ' శ్రీ సూర్య నారాయణా  ... మేలుకో... హరి సూర్య నారాయణా .... అంటూ మొదలవుతుంది. 

నా పాత పుటలలో రాసినట్లు గా  భక్తిరంజని, ఆకాశ వాణి లో వినిపించే మధుర రాగాల గానలహరి వెంటనే గుర్తోచ్చేసింది. సూర్యుని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది.

"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."

అంటూ పొద్దు పొడుస్తున్న సూర్య బింబాన్ని వర్ణించటం మధురానుభూతి నిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు  మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడి ఛాయ ... "    అంటూంటే నేను నిజం గా నా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను.  చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం రేడియో లో వినపడే వందేమాతరం తో నే తెల్లారేది. అప్పటికి లేచి దంతధావనం కానిచ్చే లోపల నాద స్వరం, ఆంగ్ల వార్తలు అయిపోయి ఆ రోజు భక్తిరంజని కార్యక్రమం  లో ఏం వస్తుందో నని ఉత్కంత గా ఉండేది. వారాన్ని బట్టి వివిధ దేవతలా స్తోత్ర తరంగిణి వినిపించే వారు. వోలేటి వెంకటేశ్వర్లు గారి భజగోవిందం, బాలాంత్రపు వారి సూర్యాష్టకం, పైన చెప్పిన సూర్య నారాయణ స్తోత్రం బృంద గానం, రామా రావు గారి హనుమాన్ చాలీసా, శివ స్తుతి, మధురాష్టకం (మధురం మధురం అంటూ యెంత మధురం గా వినపదేదో), బాల మురళి తత్వాలు, రామదాసు కీర్తనలు, శ్రీరంగం గోపాలరత్నం పాటలు, మల్లిక్ గారి రాజ రాజేశ్వరీ స్తోత్రం... అలా అన్నీ మధురాలే.

మల్లిక్ గారి స్తోత్రం మంద్రం గా పవిత్రం గా రాగ యుక్తం గా వాయులీన నేపద్యం లో వినపడుతుంటే రోజు మొదలెట్టటం చాలా ఆనందం గా ఉండేది. చాలా అరుదుగా ఈ మధ్య దీన్ని ప్రసారం చేస్తున్నారు. దాన్ని వింటూ గతం లోకి పరుగెత్తటం బాల్యానందాన్నిస్తుంది.

ఈ కార్యక్రమం తరువాత పొలం పనులు, వెంటనే ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వచ్చేవి. మధ్యలో ఎక్కడో సంస్కృతం లో కూడా వార్తలు ఉండేవి. "ఇయమాకాషవాని! సంప్రతి వార్తః సుయంతం, ప్రవాచికః బలదేవానంద సాగరః" అంటూ వణుకుతూ వుండే గొంతు తో ఆ పెద్దాయన వార్తలు చదువుతుంటే ఏమిటో ఆ చిన్న వయసు లో కూడా ఏదో కొత్తది వినేస్తున్నాననిపించేది. "ఆగచ్చ! ఉపనిష్!" అంటూ పంతులు గారు చెప్పే సంస్కృత పాఠం తో పాటు, మా ఇంట్లో ఉదయపు ఉపాహారం తయారయ్యేది. చాలా రోజులు పెసరట్టు ఉప్మా లే మెను. అల్లం పచ్చడి  రుచి అదనం.

(ఆ భోగం కూడా ఎంతమందికి వుంటుందో .. అదృష్టవంతులు.  పచ్చిమిరపలు ,  అల్లం, జీలకర్ర  జమాయించి చేసి వేసిన పెసరట్టు  రుచి  విజయవాడ బాబాయి హోటల్లో తప్పితే వేరే  చోట  దొరకగాలదంటారా  .. ఈ రోజుల్లో   అదికూడా  అందని ద్రాక్ష అయిపొయింది.  మరుగున పడుతున్న తెగులుపట్టిన  తెలుగు లాగా. మొన్నామధ్య  ఓ చుట్టం  పెళ్ళిలో అల్పాహారం గా పెసరట్టు ఉప్మా పెట్టిస్తే, వేడి వేడి గా అందరూ సుబ్బరంగా సుష్టు  గా లాగించేసి ఈ ఆలోచన చేసిన ఆయన్ని మనసులో అభినందిన్చుకున్నారు.)

అది తిన్న వెంటనే మేం బడికి వెళ్ళే సమయం అయ్యేది. ఎనిమిది గంటల తరువాత వచ్చే ఈ మాసపు పాట, ఇతర కార్యక్రమాల మధ్యలో వచ్చే లలిత గీతాలు తెలుగు నుడికి, వడి కి , సరళమైన పదాల్లో కుదించి చెప్పే భావ ప్రకటన అనన్య సామాన్యం. దేవులపల్లి, బాలాంత్రపు రజని, నండూరు సుబ్బా రావు, దాశరధి వంటి మహనీయుల గీతాలు హృద్యం గా ఉండేవి. ఇక తొమ్మిది గంటల తరువాత, మధ్యాహ్నం పన్నెండు తరువాత వచ్చే శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాంతీయ కళాకారుల తో సంపన్నం అయ్యేవి. అవి వింటూ తేనీరు తాగుతూ చదువుకుంటూ ఉండేవాడిని. కార్మికుల కార్యక్రమం, ఒకటిన్నరకు స్త్రీల కార్యక్రమం, సాయంత్రం యువజనుల కార్యక్రమం దేనికదే విభిన్న కార్యక్రమాల సమాహారం గా అలరించేవి.

ఆ కార్యక్రమాలే కాకుండా వాటి మొదలులో వచ్చే నేపధ్య బాణీలు దేనికవే ప్రత్యేకం గా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే విధం గా ఉండేవి.  మీరు కనక వాటిని వింటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. యెంత బాగుండేవో కదూ. చిన్నక్క ఎకంబరం కబుర్లు, ఉషశ్రీ ధర్మ సందేహాలకి సమాధానాలు, బాలానందం లో రేడియో అక్కయ్య ముచ్చట్లు, పల్లె పదాలు, జానపద బాణీలు, స్త్రీల పాటలు, మధ్య మధ్యలో అలనాటి వెండితెర పాటలు, ఆ నాటి కొత్త పాటలు... వ్యాఖ్యాతల చతురతలు...  ఆదివారం మధ్యాన్నం నాటకం కోసం ప్రత్యేకం గా ఎదురు చూసేవాన్ని. (టెలివిజన్ వచ్చిన కొత్తలో చిత్రలహరి కోసం చూసినట్టుగా) నండూరు సుబ్బా రావు నాకు ఇష్టమైన నటుడు. ఆయన వాచికం ఇంచుమించు జగ్గయ్య గారి వాచికం లా తాజా గా ఉండేది. కృష్ణ మూర్తి - కుక్కపిల్లలు అన్న నాటకం లో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ నా చెవుల్లోనే వుంది.

ఇక వార్తల విషయానికొస్తే, ధిల్లీ వార్తలలో అ అ అ ... ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది ..." అంటూ తడబడుతూ మొదలెట్టే కందుకూరి సూర్యనారాయణ, ఎవరో తరుముకొస్తున్నట్టు చదివే అద్దంకి మన్నార్, ఇలియాస్ అహ్మద్, ఏడిద గోపాల రావు, ప్రాంతీయ వార్తలు చదివే కోక సంజీవ రావు, కొప్పుల సుబ్బా రావు, వ్యాఖ్యాతలు పాలగుమ్మి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మల్లాది సూరి బాబు ఇత్యాది మహా మహులందరూ నా జ్ఞాపకాలలో ఇంకా పదిలం గా ఉన్నారు.

ఈ తలపులన్నీ గురుతుకు రాగా ఇందాకే అంతర్జాలం లో అలనాటి భావ/లలిత/భక్తీ గీతాలకై వెతుకులాడాను, మళ్ళీ విందామని లేదా పొందుదామని. కొంతవరకు మన తెలుగు వీధి గుమ్మాలలో (అంటే సైట్లలో అని కవి హృదయం) రా రాజు అని నేననుకునే "మాగంటి.ఆర్గ్" లో విని నా జ్ఞాపకాలని తాజా గా ఉంచుకున్నాను.  మీరూ ఆ వీధి వాకిట్లో వుండే గోవు వెనక ఆ ఇంట్లో కి చేరి అలరించే వీటిని చదివి, విని ఆనందించ గలరని భావిస్తూ..

ఇంకొక్క మాట...   పైన చెప్పిన వాటిలో మీ వద్ద ఏదైనా దొరికితే నాకు పంప గలరని అర్ధిస్తూ , మళ్ళీ ఆలస్యం చేస్తే రాయటం మరిచి పోతానని మీకు సమర్పిన్చేసుకున్తున్నాను.

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్.