20, జనవరి 2011, గురువారం

తవికలు - 2

ఇంతకు ముందు చెప్పినట్టు, మిత్రులు నండూరి శివ ప్రసాదు గారు, తన మరొక తవికను ప్రచురించటానికి అంద చేసారు!

ఇది చదివే ముందు కొంచెం ముందుమాట చెప్పాలి. మన కృష్ణా, గోదావరి లాంటి తీరాంధ్ర ప్రాంతాల్లో చలికాలం అన్నది పేరుకే అని, ఒక మాదిరిగా ఉత్తరాంధ్ర లో చలి పెడుతుందని, మనకి తెలుసు.( నీ చెప్పేది ఇక్కడ ఉంటున్న ఆంధ్రుల గురించి. విదేశాలలో అయితే మంచు కురియటాలు, ఆ బాధలు వేరే ఉంటాయి. నా పాఠకుల లో  రకరకాల దేశాల వారున్నారని ఈ మధ్య గూగుల్ వారు మొదలెట్టిన పాఠకుల జాబితా వలన తెలుస్తోంది. వారందరికీ నా ధన్యవాదాలు, నా సోదిని భరిస్తున్నందుకు. ఒక విన్నపం ఏమిటంటే... దయచేసి మీ సలహాలను, వ్యాఖ్యలను, అభిప్రాయాలను వ్యాఖ్య లతో తెలియచేయండి )

కానీ, నా లాంటి (మా లాంటి) కోస్తా జీవులకి, ఉత్తర భారత దేశ చలి ఈ గోండా లోని ఉద్యోగ పర్వం వలెనే తెలిసొచ్చింది. ఆ కాలం మొదలైన నుంచీ ప్రతీ వారం ఏదో ఒక కొత్త రకం దుస్తులు, ఆ చలి తట్టుకొవటానికి కొనవలసి వచ్చింది. అందువలన మీరు ఈ క్రింది ఉదాహరించిన స్తితి ని చూసి నవ్వుకోవద్దునని మనవి.

ఇంతకీ మన శివుడు చెప్పిన అనుభవాలు ఏమంటే :
(వారి రచన యధాతధం గా ఇవ్వటం వలన కొండొకచో ఆంగ్ల పదాలు అలాగే వుంచటం జరిగింది, క్షమించండి.)

ముత్యాల మంచు ముద్దాడగా
పచ్చ పచ్చని పైరు పరవశించింది
పట్టాల శ్వట్టర్స్ కప్పుకున్న పశువులు
పొగ మంచులొనుంచి పలకరిస్తున్నాయి

సూరీడుని సూసిని సూసి సాన రోజులయ్యింది
సుక్కల్ని సూసి సాన కాలమయ్యింది

వేశవి కాలపు తీవ్రత
వర్షకాలపు ఆర్ద్రత
శీతకాలపు సాంద్రత
ఇదే మా గోండా ప్రత్యేకత!!

A BEAUTIFUL WINTER

డార్జీలింగ్ లోనో హిమాలయాల లోనో ఉండే మంచుతో తెల్లవారింది. సూర్యుడు కనపడకుండా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. చన్నీళ్ళలో చేతులు పెడితే చురుక్కుమంటొంది. వేడి వేడి అన్నం కూడా రెండు నిముషాలలో మాయం అయిపోతొంది. అన్ని రకాల వేషదారణలో Bike మీద బయలుదేరాను. winter shirts (అంటే పాత shirts) వాడటం మొదలు పెట్టాను. (బయటికి కనపడవు కదా) . ఐదు అడుగుల ముందు ఏ ముందో కనపడటం లేదు. పట్ట పగలు కూడ Head Light కాంతి అవసరం లేదంటే Accident తధ్యం .

గోండా నుంచి తరబ్ గంజ్ కి వెళ్ళే లోపు ఏడవకుండా ఏడుపు ( మంచు కను రెప్పల మీద పడి బిందు రూపంలో రావటం) వర్షంలోకి వెళ్ల  కుండా శిరస్త్రానము, బట్టలు తడిసి పోవటం, ముత్యాల మీసం(మంచుతొ తడిసిన) Bike Speed 20km దాటక పోవటం వల్ల మేఘాలమీద కీలుగుర్రం మీద వెడుతున్న అనుభూతులు  చాల కొత్తగా ఉన్నాయి.

                        *        *        *
దీనిలో నాకు నచ్చిన ఒక ప్రయోగం, " ముత్యాల మీసం"
మంచులో తిరగగా మంచు బిందువులు మీసం పై పడి మెరుస్తుంటే ముత్యాలతో చేసిన మీసం లా ఉన్నదని మిత్రులు సెలవిచ్చారు.  బాగుంది కదూ!!

మరిక సెలవు
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది





నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు

మా చక్రి సంక్రాంతి శుభవేళ కొత్త సందేశం ఇచ్చాడు. మరిక అదేమిటో చిత్తగించండి:
                                                        *       *      *
నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు
ఆనాటి కానాటి
సామ్రాజ్యాలు సామ్రాట్టులు మటుమాయమయ్యే
రాజ్యాలు రాజులు పోయి రాతి గురుతులు మిగిలే
నవాబులు పటేళ్ళు తెరమరుగాయే
కామందులు కరణాలు కనుమరుగాయె
ఘోర కలికల్మషములు కాలగర్భము చేరె !
నాటికి నేటికి తెలుగు వెలుగుజూడ
పాంచ వేద మది నన్నయ్య తెనిగించు
రామాయణమున్ తిక్కన నిర్వచించు
సిరికిన్ జెప్పడంటూ శ్రీనాధు వర్ణించు
మందార మకరందమనుచు పోతన ప్రార్ధించు
సత్య భామనే యనుచు సిద్దేంద్రు నర్తించు
శ్రీరాము దయ చేతననుచు బద్దెన పలికించు
విశ్వదాభిరామయన్చు వేమన బోధించు
అదివో అల్లదివో అనుచు అన్నమయ్య మ్రొక్కించు
లెస్స లెస్సయని శ్రీకృష్ణరాయ శ్లాఘించు
పలుకే బంగారమాయెనా యనుచు గోపన్న లాలించు
ఎందఱో మహానుభావులన్చు త్యాగయ్య కీర్తించు
ఎల్లలెరుగని నీ విదుల భావమ్ముల మేలుగని నీ
సంక్రాంతికిన్ విశాలాంధ్రసుతుల్ సుఖమునొందు గాక
వేర్పాట్లు మరచి !!

(--భావము తప్ప వ్యాకరణ దోషములు గ్రహించ వలదని మనవి ) అని చక్రి తెలియచేసారు.
                                       *     *     *

మన తెలుగు వెలుగులు ఎల్లెడలా వ్యాపింప చేయు ఇటువంటి కీర్తనలే మనకు రక్ష. కావున దయచేసి మన భాషను విడదీయకండి. కిన్చపరచకండి. అభిమానించండి. సొగసును ఆస్వాదించండి.

ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, యాస ఏదైనా... 

"జై తెలుగు" అనండి.  తెలుగు తల్లికి నివాళు లివ్వండి.

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది.
(మీ అభిప్రాయాలను ప్రచురించటం మరచిపోకండి)