అంటూ మెట్లు దిగుతున్న శివ ప్రసాద్ ఒక్కసారి కొయ్యబారిపోయాడు. ముందు నడుస్తున్న రాధాకృష్ణ, వెనక మెట్ల మలుపు తిరుగుతున్నా నాదీ అదే పరిస్థితి. ఎదురుగా సింహం లాంటి అల్సేషియన్ వరండా లోంచి బయటకు వస్తూ మమ్మల్ని చూసేసింది.
తెలుగుతనానికి దూరంగా ఉద్యోగరీత్యా ఉత్తర భారత ప్రదేశ్ లో హిందీ బతుకు బతుకుతున్న మాకు అపుడపుడూ కలిసి కాలక్షేపం చేయటం ఒక సరదా. రాధాకృష్ణ కు బదిలీ అవటం తో వాళ్ళని కలవటానికి వచ్చి కబుర్లలో పడి రాత్రి 11 గంటలు అవటం గమనించలేదు. ఆ సమయానికి ఇంటివాళ్ళు సదరు సింహాన్ని కట్టేయకుండా వదిలేస్తారని కూడా మర్చిపోయం.
ముందు రాధాకృష్ణ ఉండటం మా అదృష్టమయింది. మెడ మీద వాటా లోకి అద్దెకు ఉంటున్న ఆయన్ని కొద్దిగా గుర్తు పట్టి, నాలుకతో పరామర్శించే ప్రయత్నంలో పడింది. శివప్రసాద్ ఏమనుకుంటున్నాడో గాని, నాకు కాళ్ళు వణుకుతున్నాయి. ఎక్కడైనా ష్.... మంటే పారిపోయే గ్రామా సింహాలు, వెనక వస్తుంటేనే భయపడి, మాటిమాటికీ వెనక్కు చూసే నాకు ఈ పరిస్థితి 'సింహ' స్వప్నమే . పైన మెట్ల తలుపులు బిడాయించి భానుగారు, వాణి గారు, మాయావిడ భయం గా చూస్తున్నారు. గభాల్న పైకి ఉడాయించుదా మన్న ఆలోచన వచ్చినా ' అది ఎపుడైనా వేగంగా వస్తుంటే కరిచేస్తున్దేమూ అనిపిస్తుంది' అని వాణి గారన్న మాటలు గుర్తొచ్చి ఆలోచన అదిమి కదలకుండా నిల్చుండిపోయాను. మధ్యలో ఉన్న శివ పరిస్థితి బేరీజు వేసుకుంటూ హుస్సైన్సాగర్ బుద్ధ విగ్రహం లా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. పరామర్శలు అందుకుంటున్న రాధాకృష్ణ కూడా భయపడుతుండటం స్పష్టం గా కనపడుతోంది. విశాలంగా ఉన్న వరండా లోంచి ఇంటాయనను పిలుద్దామన్నా వాళ్లకి వినిపించేలా లేదు. ఎవరికీ ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు. మా భయాల్లో మేముండగా, సింహం పరామర్శ లాపి , మా వంక అనుమానంగా చూసి, ఠీవిగా రెండు మెట్లెక్కింది. శివ ఇంకా రెండు మెట్ల దూరంలోనే ఉండటంతో, భాను గారిలో గాభరా మొదలయ్యింది. రాధాకృష్ణ రెండడుగులు ముందుకు వేసే ప్రయత్నం గమనించి, మొదట్లో ఆయనపై ఉన్న అభిప్రాయం చెరిపేసుకుని, వెనక్కి తగ్గి ఆయన్ను చేరి అనుమానించటం మొదలెట్టింది సింహం. కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు శివ. నిమరాలని ఎత్తిన చెయ్యి నాకుతుంటే, లోపల భయంగా ఉన్నా, చిన్నప్పట్నుంచీ దాన్ని తన గుండెల మీద పెంచిన రకం ఆనందాన్ని ముఖంలో చూపిస్తూ, ఓ వెర్రి నవ్వు నవ్వి, దానికి అనుమానం పెరగకుండా, ముఖద్వారం వైపు జరగసాగాడు రాధాకృష్ణ.
దొరికిన అవకాశం చేజార్చుకోవద్దన్న గిరీశాన్ని గుర్తు తెచ్చుకుని, వెంటనే వాడేసుకున్నాను. చప్పుడు కాకుండా చప్పున పైకొచ్చిపడి మళ్ళీ తలుపులు బిగించాను. ఆ సందడికో, రాధాకృష్ణ ఆనందానికి తృప్తి చెందో ఏమో, ఆయన్ను విడిచి మళ్ళీ శివ దగ్గరకు వచ్చి నాలిక చాచింది సింహం. అంతా నిశ్శబ్దం గా ఉంది. వీధి దీపం కాంతి సన్నగా శివ ముఖంపై అయన భయాన్ని ప్రతిఫలిమ్పచేస్తోంది. "ఏమండీ..." అంటూ భయంగా చెయ్యి ఎత్తి నాకోసం వెనక తడిమాడు. "ఆ ఎత్తిన చెయ్యి మెల్లగా దాని వీపుపై వేసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చెయ్యండి" నా గొంతు దూరంగా మేడ మీంచి విన్పించటం తో, నేను చేసిన మిత్ర ద్రోహానికి గతుక్కుమన్నాడు. వెంటనే ఆత్మరక్షణ ఉపాయం ఆలోచిస్తూ, "పాన్డేజీ..." అంటూ ఇంటాయాన్ని స్మరించాడు. మొదట్లో నూతినుంచి వచ్చినట్లున్నా అయన అరుపులు మెల్లగా స్టీరియో పానిక్ రూపాన్ని పొందాయి.
ఈలోగా ఈ హడావిడికి, రాధాకృష్ణ పిలుపులకి ఇంటాయన కరుణించి వచ్చి, దాని గొలుసు పట్టుకుని దూరంగా తీసుకుపోయే ప్రయత్నం లో పడ్డాడు. ఆడాల్లిద్దరూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా పడుకుని ఈ హడావిడికి లేచి, ఇదంతా వినోదంగా చూస్తున్న శివ వాళ్ళబ్బాయి కౌశిక్ "భలే మజా వచ్చింది" అని గొల్లుమన్నాడు.
..... ఒక 5 సంవత్సరాల క్రితం మేము గొండా అనే తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగిన సరదా సంఘటన ఇది. మేమంతా మళ్ళీ కలుసుకున్న ప్రతీసారీ గుర్తు చేసుకుని నవ్వుకుంటాము. ఆ సంఘటనకి యధా రూపమే ఇది, మీకోసం సరదాగా........................ చదివి ఆనందించారు కదూ !!!
మీమల్లాది లక్ష్మణ కుమార్.