మనం గుడికి వెళ్ళిన ప్రతీసారీ ప్రసాదం దగ్గర కొచ్చేసరికి కొంతమంది ఏదైనా తీసుకుంటారు. కొంతమంది శుభ్రత, రుచి, ప్రసాదం లో రకం (పులిహోర, దధ్యోజనం, పొంగలి లాంటివి) చూసి తీసుకుంటారు. కొన్ని చోట్ల ఏ రకమైన ప్రసాదం అయినా దాని రుచే రుచి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటివి అన్నమాట. తిరుపతి లడ్డు "ఆహా మహా ప్రసాదం, ఏమి రుచి" అనుకుంటూ దేముడంటే పడని వాళ్ళు కూడా లాక్కుని, తింటారు. ఈ రోజుల్లో కొంచెం సహజ లక్షణాలు తగ్గినా, ఒక తునక అయినా చాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళినపుడు, మా తాతయ్య వరసయే ఒకాయన అక్కడ పని చేస్తూన్దేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా దర్శనం పైన అవరోధాలేమీ లేవు. దేవుని దగ్గర కొంతసేపు అలా నిన్చున్దబెట్టారు. ఇక ప్రసాదమైతే, ఒక పెద్ద బుట్టలో చక్కర పొంగలి, దోశలు, వడలు లాంటివి అనేకం తెచ్చి ఇచ్చారు. ఈ ప్రసాదం రుచికరమైన ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని చూసే వాళ్ళని "ప్రసాదం భక్తులు" అని నామకరణం చేశాను. వీళ్ళు గుడికి దాదాపు ప్రసాదం కోసమే, (కొంచెం భక్తి తో కూడా) వెళ్తారు.
ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే, నేను కూడా ఆ ప్రసాదం భక్తులలో ఒకణ్ణి. చిన్నప్పుడు బందరు లో కృష్ణా రావు గారి బళ్ళో చదివేప్పుడు (బందరు బచ్చుపేట లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండేది.) పుష్య మాసం (ధనుర్మాస) లో రోజుకొక్క తరగతి నుంచి ప్రసాద వినిమయం కోసం పిలిచేవారు. మా వరుస ఎప్పుడొస్తుందని ఆత్రం గా చూసే వాణ్ని. ప్రసాద మంటేనే కొద్దిగా పెడతారు. అందుకే దానికి ఆ రుచి వస్తుందేమో. అయినా, వరుసలో ఒక ఆకు (మర్రి అకో మరి ఏదో గుర్తు లేదు) పుచ్చుకుని వేడి వేడి తీపి పొంగలి నోరు కాల్చుకుంటూ తినటం నాకింకా గుర్తే. అక్కడ కళ్యాణ మంటపానికి పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి. చెప్పాలంటే అంత పెద్దవి కాదు కానీ అప్పటి నా వయసుతో పోల్చుకుంటే పెద్దగా అనిపించేవి. ఎక్కటానికి కష్ట పడే వాళ్ళం. వాటిమీదేక్కి ఆడుకోవటం ఇంకొక మంచి జ్ఞాపకం. విషయం మారి నా పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతున్నాను...
ఆ తరువాత నేను పెద్దయ్యాక గుడికి వెళ్ళినపుడు, ప్రసాదం పుచ్చుకోవటం అనేది చాలా అరుదుగా జరిగింది. అక్కడి శుభ్రతా, పెట్టే వాడి శుభ్రతా అన్నీ చూసి తిన బుద్దయ్యేది కాదు. ఆ మధ్య ఒక గుడిలో (బ్రాహ్మల నిర్వహణ లోని గుడి) మా బావమరిది తో వెళ్ళినపుడు 'గారి' ప్రసాదం పెట్టబోతే ఆ ఇచ్చే అయన మా వాణ్ని 'ఏమండీ ఆయన బ్రాహ్మలు కాదా' అని అడిగాడుట.
కానీ ఈ మధ్య ఈ చెన్న పట్నం లో నంగనల్లురు లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిని ఒక స్నేహితుడు పరిచయం చేసాడు. (ఆయనను 'భక్తుడు' అన్న పొట్టి పేరు పెట్టేసాను.ఈ భక్తుడు కూడా ప్రసాదం భక్తుడే) అక్కడ ప్రసాదం గురించి ప్రత్యేకం గా చెప్పాలి. పొంగలి గానీ పులిహోర గానీ, రవ్వ కేసరి, తీపి పొంగలి కానీ ... ఆహా యెంత రుచి గా ఉంటుందండీ. మంచి నెయ్యి కారిపోతూ యమ రుచిగా వుంటుంది. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి, నా శుభ్రతా పరీక్ష లో కూడా అది నెగ్గింది. చాలా శుచిగా, మడిగా తయారు చేస్తారు. చెన్నై లో నేను చూసిన దేవాలయాలన్నిటి లోనూ ప్రసాదం చాలా రుచిగా వుంటుంది. అన్నిటిలోకీ ఈ గుడి ఇహ చెప్పకర్లేదు.
అందుకని ఈ మధ్య నేను మళ్ళీ ప్రసాదం భక్తుడ నయిపోయి, దాని కోసమే గుడికి వెళ్లి ఒక చుట్టు తిరిగి, దేముడికి ఒక నమస్కారం పారేసి (భక్తి తోనే అనుకోండి) ప్రసాదం వరుసలో నిలబడి పోతున్నాను. ఒకోసారి, రెండవ సారి కూడా. (ప్రసాదాన్ని బట్టి)
మీరుకూడా, దేముడేవరైనదీ కాకుండా భక్తి తో ప్రసాదం భక్తులుగా మారిపోండి.
ఉంటాను
మీ
మల్లాది లక్ష్మణ కుమార్.