4, ఏప్రిల్ 2010, ఆదివారం

ఆ రోజులే వేరు!!

ఆ రోజులే వేరు!!
మనం ఎప్పుడు వాడే మాట ఇది. ఒక ఉరు నుంచి వేరొక వూరు వెళ్ళినా, ఉద్యోగం మారినా, లేదా మన వయస్సు మారినా, పాత సంగతులు గుర్తుకొచ్చినపుడు మనం అంటుంటాం, "అబ్బ నువ్వేన్నైన చెప్పరా కానీ,  ఆ రోజులే వేరు".
దానికి నేనేమీ మినహాయింపు కాదు. చిన్నతనం లో మనం చేసిన అల్లరి, బాధ్యతలు లేని జీవితం ఎవరికి బాగుండదు చెప్పండి. వేసవి కాలం సెలవలు వచ్చిందంటే సూర్య కిరణాలు లేపుతుంటే లేవటం, (అంటే ఆలస్యం గా) ఎడ పెడా తిరిగేయ్యటం, సాయంత్రం పక్కింటి అబ్బాయి బుడ్డిబాబు, రాము, మా అన్నయ్య వాళ్ళతో గోలికాయలు ఆడటం, పోద్దస్తమాను రేడియో వినటం, ఇన్ని వ్యాపకాలు ఒక్కసారిగా మీద పడి పోతాయి. ఎండలు మండేవి అనుకోండి, కాని ఆయనెవరో చెప్పినట్టు, "మావిడి పళ్ళు, మల్లె పువ్వులు కావాలి గాని, మండుటెండలు అక్కరలేదా అని" ... ఆ రోజులే వేరు.
ఉదయం రేడియో లో మల్లిక్ గారి రాజ రాజేశ్వరి స్తోత్రం తో సుప్రభాతం అవటం మనం ఈ రోజుల్లో ఊహిన్చలెము .  మల్లాది సూరిబాబు గారి లింగాష్టకం, బాల మురళి రామదాసు కీర్తనలు, మధురాష్టకం, సుప్రభాతం, దేవి స్తుతి, సత్యదేవుని పాటలు, ఇలా చెప్పుకుంటూ పొతే మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం అనిపిస్తుంది. ముఖ్యం గా వాయులీనపు నేపద్యం లో మల్లిక్ గారి మంద్ర స్వరం లో ఆ స్తోత్రం పోద్దుపోద్దున్నే మనసుని ప్రశాంతం గా చేసేది. (ఇది ముఖ్యం గా విజయవాడ స్టేషన్ వినేవాల్లకే).
ఇప్పుడు కూడా ఆ పాత మధురాల్ని ఆలిండియ రేడియో వాళ్ళు తమ archieves దుకాణం లో అమ్మకానికి పెట్టారట. వీలయితే కొనుక్కుని, ఆ మధురాల్ని అచ్చంగా ఉన్చేసుకోండి.  నా మటుకు నాకు నా బాల్యం అంటే గత స్మృతులన్నీ సున్నాలు చుట్టుకుంటూ ఆ నేపధ్య సంగీతం తో కనివినిపిస్తాయి. ఇక శ్రావణ  మాసం లో (మా) బందరు, వర్షం లో పొద్దస్తమానం స్నానం చేస్తూనే ఉండేది. చల్లటి ఆ వాతావరణం, బురద బురద (కొండొకచో నీరు నిండిన) రహదారులు, ఆ వర్షం లో తడుస్తూ ఊరంతా తిరగడం, పేరంటాళ్ళు, పట్టు చీరల రెపరెపలు, తాంబూలాలు, శనగలు  సెనగల మసాల గారెలు,  ఇంకా ఇంకా చాలా ... నాకు నచ్చిన నా పాత జ్ఞాపకాలు.

1 కామెంట్‌: